ప‌వ‌న్ సార్‌…రాజ‌కీయం చేయ‌డం చేతకాద‌ని!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాగైతే రాజ‌కీయంగా ఎప్ప‌టికీ పైకి రాలేమ‌ని అభిమానులే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌కు హిత‌వు చెబుతున్నారు. రాజ‌కీయం చేసే విధానాన్ని మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాగైతే రాజ‌కీయంగా ఎప్ప‌టికీ పైకి రాలేమ‌ని అభిమానులే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌కు హిత‌వు చెబుతున్నారు. రాజ‌కీయం చేసే విధానాన్ని మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. ఒక‌వైపు మీకు చెప్పేంత‌టి వాళ్లం కాదంటూనే, ప్ర‌స్తుతం చేస్తున్న రాజ‌కీయం మాత్రం స‌రైంది కాద‌ని అభిమానులే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

జన‌సేన స్థాపించి ఇప్ప‌టికి ప‌దేళ్లు అవుతోంది. ఇంత వ‌ర‌కూ పార్టీ సంస్థాగ‌త నిర్మాణానికి నోచుకోలేదు. క‌నీసం గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లాస్థాయి క‌మిటీల‌కు నోచుకోలేదు. అక్క‌డ‌క్క‌డ మిన‌హాయిస్తే జ‌న‌సేన‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు కూడా లేక‌పోవ‌డాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. 

ఒక‌వేళ ఎక్క‌డైనా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తే, ఆ ప‌ద‌విని అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేస్తార‌నే అనుమానంతో ప‌వ‌న్ వాటి నియామకాల‌కు దూరంగా ఉన్నార‌ని అభిమానులు ప్ర‌త్యేకంగా చెబుతున్నారు. ఇదే రాజ‌కీయం అయితే, చేత‌కాద‌ని అనుకునే ప్ర‌మాదం వుంద‌ని ప్ర‌త్యేకంగా హెచ్చ‌రిస్తున్నారు.

ఇది స‌రైంది కాద‌ని, ఇలాగైతే పార్టీ ఎప్ప‌టికీ ఎద‌గ‌లేద‌ని ప‌వ‌న్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ, వైసీపీ రాజ‌కీయాల్ని చూసి నేర్చుకోవాల‌ని ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్‌కు హిత‌వు చెప్ప‌డం విశేషం. ముఖ్యంగా రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌ను చూసి కాపు, బ‌లిజ త‌దిత‌ర అనుబంధ కులాల వారు నేర్చుకోవాల‌ని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌త్యేకంగా చెప్ప‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

జ‌న‌సేన స్థాపించి ప‌దేళ్లు అవుతున్నా, ఇంత వ‌ర‌కూ క‌మిటీలు వేయ‌క‌పోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌ను వేయ‌క‌పోతే పార్టీ బ‌తికి బ‌ట్ట ఎలా క‌డుతుంద‌ని తాజాగా అభిమానుల నుంచి ప్ర‌శ్న ఎదురు కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన‌కు గ‌ట్టి మ‌ద్దతుదారులుగా నిలిచిన వారే ఇలాంటి ప్ర‌శ్న‌లు వేయ‌డం విశేషం. నియామ‌కాలు చేప‌ట్ట‌కుండా పార్టీ నాశ‌నం కావ‌డం కంటే, వూస్తే ఏమ‌వుతుందో చూద్దాం అని అభిమానులు స‌ల‌హాలిస్తున్నారు.

త‌మ మొర ఆల‌కించాల‌ని, జ‌న‌సేన‌ను బ‌ల‌ప‌రిచేందుకు ఇత‌ర పార్టీల వారిని చేర్చుకోవ‌డంతో పాటు, ఉన్న వాళ్ల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. చివ‌రికి అభిమానుల‌తో కూడా చెప్పించుకునే దుస్థితి ప‌వ‌న్‌కు వ‌చ్చింద‌నేది వాస్త‌వం.