కోట్లు కుమ్మ‌రించారు.. మ‌రి లాభాలూ?

ఐపీఎల్ వేలం ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో స‌గ‌టున ఒక్కో టీమ్ ఆట‌గాళ్ల జీతం కోసం వెచ్చించే మొత్తం భారీ స్థాయిలో న‌మోద‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. వేలానికి ముందు బీసీసీఐ ఒక్కో జ‌ట్టుకు…

ఐపీఎల్ వేలం ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో స‌గ‌టున ఒక్కో టీమ్ ఆట‌గాళ్ల జీతం కోసం వెచ్చించే మొత్తం భారీ స్థాయిలో న‌మోద‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. వేలానికి ముందు బీసీసీఐ ఒక్కో జ‌ట్టుకు గ‌రిష్టంగా 90 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ ప‌రిమితిని పెట్టింది. వేలంలో ఏ జ‌ట్టు ఎంత మంది ఆట‌గాళ్ల‌ను కొనుక్కొన్నా.. గ‌రిష్టంగా ఒక్కో జ‌ట్టు ప్యాకెట్ లో 90 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఉంటుంది. అంత‌కు మించి వేలంలో అధిక మొత్తం వెచ్చించ‌డానికి లేదు.

అయితే చాలా ప్రాంచైజ్ లో ఈ గ‌రిష్ట ప‌రిమితికి దూరంగానే ఆగిపోయాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ గ‌రిష్ట ప‌రిమితి క‌న్నా 20 కోట్ల రూపాయ‌ల త‌క్కువ వ్యయాన్నే వెచ్చించింది. పంజాబ్ జ‌ట్టు ఏకంగా 28 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఇక్క‌డ సేవ్ చేసుకోవ‌డానికే మొగ్గు చూపింది. ప‌ది మంది ఆట‌గాళ్ల‌ను కొన్నా.. ఎస్ఆర్ హెచ్ ఇర‌వై కోట్ల రూపాయ‌లను అలాగే పేకెట్ లో ఉంచుకుంది. వేలం స‌మ‌యంలో ఎక్కువ వెచ్చించిన జ‌ట్టు కొత్త జ‌ట్టు అయిన ల‌క్నో మాత్ర‌మే. ఈ జ‌ట్టు యాజ‌మాన్యం ఏకంగా 84 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని వేలంలో వెచ్చించింది.

అయితే ఇదంతా వేలం మొత్తం మాత్ర‌మే. పాత ప్రాంచైజ్ లు అన్నీ త‌మ వ‌ద్ద ప‌లువురు ఆట‌గాళ్ల‌ను అట్టి పెట్టుకున్నాయి. వారితో భారీ మొత్తాల‌కు కాంట్రాక్ట్ ల‌ను కొన‌సాగిస్తూ ఉన్నాయి. స్టార్ ఆట‌గాళ్ల‌కు, ప్రాంచైజ్ ల‌కు న‌మ్మ‌క‌మైన ఆట‌గాళ్ల‌కు అలాంటి కాంట్రాక్ట్ లు కొన‌సాగుతున్నాయి. ఆ డీల్స్ విలువ కూడా ప‌దుల కోట్ల రూపాయ‌ల స్థాయిలో ఉన్నాయి. ప‌ది కోట్లు, అంత‌కు మించిన మొత్తాల‌తో ఆట‌గాళ్ల‌తో జ‌ట్ల‌కు ఒప్పందాలున్నాయి.

వేలంలో వెచ్చించిన మొత్తాల‌కూ, ఆ ఒప్పందాల మొత్తాల‌ను క‌లిపితే.. ఒక్కో జ‌ట్టు వంద కోట్ల రూపాయ‌ల పై మొత్తాన్ని వెచ్చించిన‌ట్టుగా అవుతోంది. ఆట‌గాళ్ల జీతాల కోస‌మే ఇలా ఒక్కో జ‌ట్టు వంద కోట్ల రూపాయ‌ల పై మొత్తాల‌ను వెచ్చిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక ప్లేయ‌ర్లే గాక‌.. కోచ్ లు, అసిస్టెంట్ కోచ్ లు ఇత‌ర స‌హాయ సిబ్బంది, నెట్స్ ప్లేయ‌ర్లు వీరంతా వేరే లెక్క‌. ఇలా ప్ర‌తి జ‌ట్టూ ఒక్కో మ్యాచ్ కోసం ప‌ది కోట్ల రూపాయ‌ల పై మొత్తాన్ని ఆట‌గాళ్ల‌కు జీతంగా వెచ్చించ‌నుంది. ఇక హోస్టు ఖ‌ర్చులు కూడా ప్రాంచైజ్ ల మీదే ఉండ‌వ‌చ్చు. 

అయితే అయినా ఐపీఎల్ ప్రాంచైజ్ ల‌కు ఇబ్బంది ఏమీ లేద‌నేది లెక్క‌. ఒక్కో మ్యాచ్ టీవీ టెలికాస్ట్ ధ‌రే యాభై కోట్ల రూపాయ‌ల పై స్థాయిలో ఉంది. అందులో మెజారిటీ వాటా జ‌ట్టు యాజ‌మాన్యాల‌కే ద‌క్కుతుంది. ఆ పై స్పాన్స‌ర్స్ ద్వారా కూడా కోట్ల రూపాయ‌లు స‌మ‌కూరే అవ‌కాశం ఉంది. ఈ లెక్క‌ల‌న్నీ వేసుకునే జ‌ట్టు యాజ‌మాన్యాలు ఆట‌గాళ్ల‌పై కోట్ల రూపాయ‌ల‌ను కుమ్మ‌రించాయి.