కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కువ ప్రచురితమైన, ప్రసారమైన వార్తలు, అత్యధికంగా ప్రజాదరణ పొందిన వార్తలు ఏవయ్యా అంటే ముచ్చింతల్ లోని చినజీయరు స్వామీజీ ఆశ్రమంలో ప్రతిష్టించిన సమతా మూర్తి రామానుజాచార్య విగ్రహం. 216 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహం కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలో రెండోది. చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ముచ్చింతల్ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
రామానుజాచార్యులు సహస్రాబ్ది సమారోహా ఉత్సవాల వార్తలు. కథనాలు మీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. దానికి తగ్గట్లు ప్రధాని, రాష్ట్రపతితో పాటు దేశంలోని పలు రంగాల్లోని ఎందరో ప్రముఖులు ముచ్చింతల్ ను సందర్శించి పరమానంద భరితులయ్యారు. ఇక సామాన్య జనం సంగతి చెప్పేదేముంది? వేలాదిమంది భక్తి పారవశ్యంలో మునిగిపోయి ముచ్చింతల్ కు తండోపతండాలుగా వెళ్లారు. ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమాన్ని దేశంలోని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఆకాశానికి ఎత్తేశారు.
ముచ్చింతల్ వేడుకలకు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. కేసీఆర్ స్వతహాగా భక్తి భావాలున్నవాడు కావడంతో ముచ్చింతల్ లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త రోడ్లు వేయించారు. మంత్రులు, అధికారులు చాలాసార్లు అక్కడికి వెళ్లి అక్కడి వైభవాన్ని చూసి ఆహా ఓహో అన్నారు. ప్రధాని రాకముందు సీఎం కేసీఆర్ కూడా వెళ్లారు. దీంతో చినజీయర్ స్వామీ ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడారు. ఆయన హీరో అయిపోయారు.
కానీ చిన జీయర్ కు ఆధ్యాత్మిక ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సమతా మూర్తి ఉత్సవాల చుట్టూ వివాదాలు ముసిరాయి. రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉండే కేసీఆర్ ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఒకరిద్దరు మంత్రులు వెళ్లారు గానీ మెజారిటీ మంత్రులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. కేసీఆర్ కు చినజీయర్ ప్రియమైన గురువు. ఆ ప్రేమను చాలాసార్లు వ్యక్తం చేశారు. అనేకసార్లు ఆశ్రమానికి వెళ్లారు.
యాదాద్రి పునర్నిర్మాణం చినజీయర్ సలహాలు, సంప్రదింపులతోనే జరిగింది. సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు కూడా ప్రభుత్వం సహకరించింది. కానీ రామానుజాచార్య భారీ విగ్రహావిష్కరణ శిలా ఫలకం మీద కేసీఆర్ పేరు లేకుండా పోయింది. కేసీఆర్ నిప్పులు చెరుగుతున్న మోడీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోడీని చిన జీయర్ చాలా పొగిడారు. ఈ విగ్రహం ఆవిష్కరించే అర్హత ఆయనకు మాత్రమే ఉందన్నారు. మోడీ వచ్చి వెళ్ళినప్పటి నుంచి కేసీఆర్ ఆగ్రహంతో ఉగిపోతున్నారు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీలపై అయన మండి పోతున్నారు. చిన జీయర్ స్వామిపైనా ఆయనలో ఆగ్రహం బుసలు కొడుతోంది. ఆగ్రహంతో కుమిలి పోతున్నారు. నిజానికి, స్వామీజీనే శపించాలన్నంతగా ఆయన లోలోన ఆగ్రహానికి గురుతున్నారు. చిన జీయర్ స్వామికి, కేసీఆర్ కు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.
నిజమే, చిన జీయర్ స్వామి కోట్ల రూపాయల ఖర్చుతో, 216 అడుగుల ఎత్తైన ‘సమతా మూర్తి’ శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్ ముచ్చింతల్, (శ్రీరామ నగర్) ఏర్పాటు చేయగలిగారంటే, అ ఘనతలో కేసీఆర్ సహకారం కాదనలేనిది. కొన్ని నెలలు ముందుగా సిద్దం చేసిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు లేక పోవడం నిజంగా కేసీఆర్ కు పెద్ద షాక్ అంటున్నారు. చిన జీయర్ ఉద్దేశపూర్వకంగానే, కేసీఆర్ ను దూరంగా ఉంచారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు.
ఇది యౌ టూ బ్రూటస్ అన్నంతగా కేసీఆర్ ను దెబ్బతీసిందని, ఇదే కేసీఆర్ ఆగ్రహానికి మూల కారణం అంటున్నారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదు. జరిగిన పొరపాటును సవరించుకోవడానికా అన్నట్లుగా రాష్ట్రపతి ఆవిష్కరించిన రామానుజుల బంగారు విగ్రహం ఆవిష్కరణ ఫలకం మీద కేసీఆర్ పేరు ఉంది. కానీ చినజీయర్ వ్యవహారం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది. అంతే కాదు పుండు మీద కారం చల్లిన విధంగా, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలలో కేసీఆర్ ప్రస్తుత శత్రువు మోడీ, బీజేపీలకు, సంఘ్ పరివార్ సంస్థలకు పెద్ద పీట వేయడం కేసీఆర్ అసలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.
అయితే, చిన జీయర్ ఎందుకు కేసీఆర్ ను దూరం పెట్టారు, అంటే, కేసీఆర్ ను ఉచ్చులలో బిగించే వ్యూహంలో భాగంగానే, బీజేపీ అగ్రనేతలు స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నారని, అది కూడా కేసీఆర్ అగ్రహావేశాల, అనాలోచిత వ్యాఖ్యలకు కారణమని అంటున్నారు. నిజానికి సమతామూర్తిని కేసీఆర్, ఉత్తరాదిన తన ప్రచార మూర్తిగా చేసుకోవాలనుకున్నారు. జాతీయ రాజకీయాల విషయంలో ఉత్తరాదిలో హిందూ ముద్ర తనకు సమతమూర్తి ద్వారా వస్తుందనుకున్నారు.
చివరకు కనీసం శిలాఫలకం మీద కూడా తన పేరు లేకపోవడంతో ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. చివరకు ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినా చిన జీయర్ కు ఆధ్యాత్మిక ఆనందం దక్కకుండా పోయింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ – చిన జీయర్ మధ్య దూరం మరింత పెరుగుతుందా?