మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అతడికి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా లేదా? అసలు ప్రభాస్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఇదేదో అతడి వ్యక్తిగత జీవితాన్ని త్రవ్వే కార్యక్రమం కాదు. రాధేశ్యామ్ సినిమాలోనే ఈ టాపిక్ ఉంది. ఆ మేటర్ ఈరోజు బయటపడింది.
వాలంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్-పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీని మరోసారి చూపించారు. ఈ వీడియోలో ప్రభాస్ ను పూజా హెగ్డే ప్రశ్నిస్తుంది. “బాగా వంటలు వండుతావ్, బాగా మాట్లాడతావ్, మరి ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు?” అని అడుగుతుంది పూజా హెగ్డే.
నిజానికి ఇది సినిమా డైలాగ్ అయినప్పటికీ, ప్రభాస్ రియల్ లైఫ్ కూడా పెర్ ఫెక్ట్ గా సూటయ్యే ప్రశ్న కూడా. దీనికి ప్రభాస్ ఏం సమాధానమిచ్చాడనే విషయాన్ని దాచిపెడుతూ.. చిన్న సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వాలంటైన్స్ డేకు రాధేశ్యామ్ యూనిట్ నుంచి పెర్ ఫెక్ట్ గిఫ్ట్ అనిపించుంది ఈ గ్లింప్స్.
ఈ వీడియో గ్లింప్స్ తో రాధేశ్యామ్ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్టు ప్రకటించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇకపై దశలవారీగా రాధేశ్యామ్ నుంచి ఏదో ఒక స్టఫ్ రిలీజ్ అవుతుందని, హీరోహీరోయిన్లతో కూడా ప్రచారం ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ ఇందులో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నాడు.