మోదీ సర్కార్‌పై యుద్ధానికి సన్నద్దమని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్… అందుకు తగ్గట్టు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. తనలాగే మోదీపై నిరసన గళం వినిపిస్తున్న ఇతర రాష్ట్రాల, ఇతర పార్టీల నేతలతో స్నేహం కొనసాగించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొంత కాలంగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న జాతీయ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరో ముందడుగు వేశారు.
తాను తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మమతాబెనర్జీ ఫోన్ చేస్తే మాట్లాడ్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 24 గంటలు కూడా గడవకనే మమతాబెనర్జీ నుంచి కేసీఆర్‌కు కాల్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్డేయేతల సీఎంలతో త్వరలో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు మమతాబెనర్జీ తెలిపారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు ఆమె ఫోన్ చేశారని రాజకీయ వర్గాల అభిప్రాయం. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని కేసీఆర్‌తో ఆమె అన్నట్టు సమాచారం.
సాధారణ ప్రజల బాగు కోసం వినమ్రంగా కలిసి పనిచేయాలని దీదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చాలా విశాలమైన దృక్పథంతో తమ పార్టీ పోటీ చేయలేదనే విషయాన్ని కేసీఆర్‌తో చెప్పినట్టు తెలిసింది. వారణాసిలో మార్చి 3న జరగనున్న ర్యాలీలో పాల్గొనున్నట్లు మమతా చెప్పారు. సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు విషయంలో అందరి సహకారం అవసరమని దీదీ చెప్పినట్టు సమాచారం.