ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటూ ఏడాది కిందటి నుంచినే కబుర్లు చెబుతున్నారు. ఈ కబుర్లను సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకే ఎక్కువగా చెబుతుంటారు చంద్రబాబు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి చంద్రబాబు ఈ కథలు చెబుతూ ఉంటారనేది బహిరంగ సత్యం. 2022లోనే ఎన్నికలు వస్తాయంటూ 2020 నుంచినే చంద్రబాబు చెప్పుకొస్తున్నట్టుగా ఉన్నారు. మరి చంద్రబాబు మాటలు ఏ మేరకు నిజం అవుతాయనేది అందరికీ అర్థం అవుతున్న విషయమే.
మరి ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఎన్నికలు వచ్చాయనే అనుకుందాం. మరి ఎన్ని నియోజకవర్గాల్లో.. టీడీపీకి ఎన్నికలను ఎదుర్కొనగల దళం ఉందనేది అది పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది. అనుకూలంగా మీడియా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఆ పార్టీకి స్థానం ఉంది. ఇవి వాస్తవాలే. అయితే నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మాత్రం చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నిస్తేజంగానే కనిపిస్తుంది.
రాయలసీమలో అయితే.. చాలా చోట్ల ఎవరు ఇన్ చార్జిలనేది కూడా క్లారిటీ అనే అంశం. పేరుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మూడేళ్లుగా వాళ్లలో చాలా మంది క్యాడర్ కు దూరం అయ్యారు. ప్రజలతో సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత చిత్తుగా ఓడటం ఫలితంగా.. ప్రతిపక్షంలో ఉన్నా, పార్టీ ఉనికి నిలవడానికి తగినట్టుగా పనిచేసే వారు లేకుండా పోయారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు ఉండి ఉంటే టీడీపీ ఉనికి నిలిచేది. అయితే టీడీపీలోని మహామహులు ఓడటం, గత ఎన్నికల్లో కంచుకోటలన్నీ బద్ధలైన ప్రభావం ఇప్పటికీ ఉంది. ఇది వచ్చే ఎన్నికలపై కూడా తప్పేలా లేదు.
చంద్రబాబుతో మొదలు!
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ భవితవ్యం గురించి దిక్కుతోచని స్థితి ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా కుప్పంనే ప్రస్తావించవచ్చు. ఇది పేరుకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానీ, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ అక్కడ నుంచినే పోటీ చేస్తారా? అనేది ఇంకా క్లారిటీ లేని అంశమే. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని గెలిపించుకునేందుకు తెలుగుదేశం సర్వ శక్తులనూ ఒడ్డింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా అంతా పార్టీ పరువు నిలుపుకోవడానికి చేయాల్సిందంతా చేశారు. అయితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ చిత్తయ్యింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధనబలంతో నెగ్గింది అంటూ టీడీపీ వాదించవచ్చు. అయితే ఇలాంటి డిగ్రీల విషయంలో టీడీపీ ట్రాక్ రికార్డు ఏమీ తక్కువ కాదు. ఏదేమైనప్పటికీ తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కేంద్రం మున్సిపాలిటీని నెగ్గలేకపోయిన ఫెయిల్యూర్ స్టోరీ చంద్రబాబుకు సొంతమైంది. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో టీడీపీ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోంది. కుప్పంలో చంద్రబాబు పోటీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఎదురుదీనట్టుగానే ఉంటుందనే విశ్లేషణ సహజంగానే వినిపిస్తూ ఉంది.
ప్రచారం చేయకుండానే గెలిచిన రోజులు పోయి.. మిగతా రాష్ట్రంలో ప్రచారాన్ని పక్కన పెట్టి కుప్పంలో గెలుపుకోసం చంద్రబాబు నాయుడు వంగివంగి దండాలు పెట్టాల్సి రావొచ్చనే విశ్లేషణ ఉందిప్పుడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కుప్పానికే దండం పెట్టేసి, వేరే నియోజకవర్గాన్ని వెదుక్కొన్నా పెద్ద ఆశ్చర్యం లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యాసదృశ్యం లాంటిది. చంద్రబాబుకే గెలుపుపై నమ్మకం లేక మరో చోటకు తరలిపోతే టీడీపీ క్యాడర్ కు వేరే సంకేతాలు వెళ్లిపోతాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో నిస్పృహ కలగడానికి చంద్రబాబు కుప్పంలో పోటీ చేయకపోవడం ఒక్కటీ చాలు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది కుప్పం కథ!
చిత్తూరు జిల్లాలో ఎవరెక్కడో!
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు ఇన్ యాక్టివ్ గా ఉన్న జిల్లాల్లో ముందు వరసలో చిత్తూరు జిల్లా నిలుస్తోంది. చాలా చోట్ల పాత నేతలు యాక్టివ్ గా లేరు. యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవడానికి ఒకరిద్దరి పేర్లే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల దాడికి అయినా, టీడీపీ బలాన్ని చాటడానికి అయినా చిత్తూరు జిల్లాలో ఒకరిద్దరు నేతలు మాత్రమే ప్రతి సారీ పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మిగతా వారు నిమిత్త మాత్రులుగా ఉన్నారు. పార్టీ ఇన్ చార్జిలుగా బాధ్యతలు అప్పగించిన వారు కూడా ఆ నియోజకవర్గాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జిలుగా చంద్రబాబు ప్రకటించిన జాబితాలోని వారు అయితే కనీసం ఒక ఎంపీపీ స్థానాన్ని అయినా నెగ్గుకు రాగలరా? అనేది సందేహమే!
కర్నూలు జిల్లాలో నిస్తేజంగా!
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు జిల్లాలో పోటీ చేసిన వారిలో ఎంతమంది మరోసారి అదే టికెట్ పై అవే నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నారనేది పెద్ద మిస్టరీ. కర్నూలు ఎంపీ , నంద్యాల ఎంపీ సీట్ల విషయంలోనే టీడీపీ తరఫున అభ్యర్థిత్వం ఫలానా వారికి అని కచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి చేరిన వారికి అప్పుడు ఎంపీ టికెట్లను కేటాయించడంతో, ఎన్నికలు అయిపోగానే వారు సీన్ నుంచి తప్పుకున్నారు.
గత ఎన్నికల్లోనే బోలెడంత ఖర్చు పెట్టుకున్నారు. దీంతో మరోసారి భారీ ఖర్చుకు కూడా వారు జడిసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాతకాపులైనా చక్రం అడ్డేస్తారా? అంటే అంత సీన్ కూడా కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో 2019 వరకూ టీడీపీ ఉనికి చాటిన వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీ తరఫున అంతా తామైన వారు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇళ్లను దాటడం లేదు. వారి ఫిరాయింపు రాజకీయాలూ, ఇతర వ్యవహరాలతో సొంత నియోజకవర్గంలో కూడా వారిపై వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది.
అధికారంలో ఉంటూ వ్యతిరేకతను సంపాదించుకున్న వాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నా.. అంతకన్నా మెరుగైన స్థితిని పొందలేకపోతున్నారు. పలువురు సీనియర్లు రిటైర్మెంట్ కు దగ్గరపడటం, గత ఎన్నికల ఓటమి పీడకల నుంచి మిగతా వారు బయటపడలేకపోతూ ఉండటం, వీటికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సీమలో ప్రబలంగా వ్యతిరేకత ఏదీ వ్యక్తం కాకపోవడం కూడా టీడీపీ నేతలకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తోంది!
అనంతపురంలో ఎవరికెవరో!
ఒకే పార్టీలో ఉన్నా.. ఒకరిపై ఒకరు బాహాటంగా కత్తులు దూసుకోవడం, వెనుక వెనుక గోతులు తొవ్వుకోవడం అనంతపురం జిల్లా టీడీపీలో గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న సంస్కృతే. కనీసం గ్రూపులు కూడా లేవు. ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారక్కడ టీడీపీ నేతలు. ఒకప్పుడు బీసీ ఓటు బ్యాంకుతో అనంతపురం జిల్లాలో టీడీపీ బలంగా ఉండేది. అయితే 2009 నుంచి బీసీ ఓటు క్రమంగా చీలుకుంటూ వస్తోంది.
వైఎస్ మొదలుపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతోనే టీడీపీ వైపు నుంచి బీసీ ఓటు బ్యాంకు దూరం కావడం మొదలైంది. 2014లో టీడీపీ అనంతపురంలో మెజారిటీ సీట్లను నెగ్గినా దానికి ప్రధాన కారణం రుణమాఫీ హామీ. రుణమాఫీకి ఆశపడి రైతాంగం టీడీపీకి మద్దతుగా నిలిచింది. అయితే చంద్రబాబు చేసిన మోసంతో ఆయనపై పూర్తిగా నమ్మకం పోయింది. 2019నాటికి అటు బీసీ ఓటు బ్యాంకులో స్పష్టమైన చీలిక వచ్చింది. చంద్రబాబుపై అన్ని వర్గాల్లోనూ నమ్మకం పోయింది. దీంతో టీడీపీ అని చెప్పుకునే వారి శాతం క్రమంగా తగ్గిపోయింది అనంతపురం జిల్లాలో.
గత ఎన్నికల్లోనే కంచుకోటలన్నీ బద్ధలు కాగా.. వాటిని పునర్నిర్మించుకోవడానికి టీడీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు పెద్దగా కష్టపడుతున్న దాఖలాలు కూడా లేవు. కొంతకాలం కిందట అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలుగా పాత నేతల పేర్లనే ప్రకటించారు. అయితే ఆ పేర్లను వింటే పడే ఓట్లు కూడా ఇకపై పడతాయా? అనే పరిస్థితి నెలకొంది. తనది నాయకులను తయారు చేసే కర్మాగారం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నారు కానీ, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జిలుగా ఉన్న వారు పాతికేళ్ల నుంచి తామే బీసీ నేతలన్నట్టుగా వ్యవహరిస్తున్న వారు. బీసీల్లో కూడా కొత్తతరం నాయకత్వం ఏదీ టీడీపీలో ఎదగలేదు!
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసినా.. గత పదిహేనేళ్లలో టీడీపీ తరఫున కొత్తగా తయారైన బీసీ నాయకులు లేరు! అదే కమ్మ సామాజికవర్గం నుంచి కాంట్రాక్టర్లు అంతా టీడీపీ నేతలు అవుతున్నారు. బీసీల ప్రాబల్యం ఉన్న అనంతపురం జిల్లాలో సగానికి సగం నియోజకవర్గాల్లో టీడీపీలో కమ్మలదే హవా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్ల హవా ఉన్నా, గత ఎన్నికలతో పరిస్థితి మారింది. బీసీలకు ఎంపీ టికెట్లు దక్కాయి. ఇలా చూసినా.. అనంతపురం జిల్లాలో జనాభా వారీగా చూస్తే రెడ్లతో పోలిస్తే కమ్మల జనాభా చాలా తక్కువ! సరిగ్గా నాలుగైదు శాతం జనాభా లేదు ఈ జిల్లాలో. అయితే ఐదారు నియోజకవర్గాల్లో కమ్మ వాళ్లే నాయకులు! కొత్త తరం బీసీ నాయకత్వాన్ని తయారు చేసుకోలేక టీడీపీ బీసీలకు పూర్తిగా దూరం అవుతోంది.
పార్టీలో ఉన్న ముఖ్య నేతల మధ్యన సఖ్యత పూర్తిగా చెడింది. మరి కొందరు వేరే నియోజకవర్గాల వైపు చూస్తున్నారు. తాము ప్రస్తుతం ఇన్ చార్జిలుగా ఉన్న నియోజకవర్గాలు కాకుండా, పక్క నియోజకవర్గాలపై వారి చూపుంది. ఈ పరిణామాలతో క్షేత్ర స్థాయిలో మరింత గందరగోళం నెలకొన్న వైనం ఉంది.
కడప జిల్లాలో.. చెప్పుకోవడానికేముంది!
టీడీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పుడు కూడా కడప జిల్లాలో తెలుగుదేశం నెగ్గగలిగింది ఒకటీ అర నియోజకవర్గాలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తయిన సందర్భాల్లో కడపలో ప్రత్యర్థులకు ఇచ్చే మెజారిటీలను లెక్కేసుకోవడం తప్ప టీడీపీకి మరో గత్యంతరం లేదు. అంతే కాదు.. ఇది వరకూ కడప జిల్లాలో చంద్రబాబును భుజాన మోసుకు తిరిగిన వారు కూడా ఆయన తీరుతో విసిగిపోయి పచ్చకండువాలను పక్కన పెట్టేశారు. రాజకీయంగా ఇన్ యాక్టివ్ గా ఉన్నా ఫర్వాలేదు టీడీపీలో యాక్టివ్ గా ఉండటం కంటే.. అనే తీరును అనుసరిస్తున్నారు వారంతా.
యాభై అసెంబ్లీ నియోజకజవర్గాలకు పైగా, ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాలున్న రాయలసీమ ప్రాంతంలో టీడీపీ గట్టిగా ఉందని చెప్పుకోవడానికి పదో వంతు సీట్లు కూడా కనిపించడం లేదు! మూడేళ్ల ప్రతిపక్ష వాసం గడుస్తున్న తరుణంలో కూడా టీడీపీ పరిస్థితి ఇదిప్పుడు.