ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్నాయుడు విమర్శల దాడి చేశారు. జగన్‌పై ఆయన పంచ్‌లు విసిరారు. సినిమా నటుల్ని మించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నటిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రజల్లో మోజు తగ్గిందన్నారు. జగన్ పరిపాలనా విధానాలు ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నాయన్నారు.
ఇదే సందర్భంలో తమ పార్టీ వైపు ప్రజలు ప్రత్నామ్నాయంగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు నవరత్నాలు సైతం సరిగ్గా అమలు కావడం లేదని రామ్మోహన్నాయుడు విమర్శించారు. పేదలు దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయిస్తున్నట్లు రామ్మోహన్నాయుడు కామెడీ చేయడం గమనార్హం. వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాడడం లేదని ఆయన ప్రశ్నించారు. పలు రాష్ట్రాల సీఎంలైన స్టాలిన్, కేసీఆర్, మమతాబెనర్జీల మాదిరిగా కేంద్రంపై జగన్ ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించలేకున్నారని రామ్మోహన్నాయుడు అన్నారు.
జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సినిమా టికెట్లు వ్యవహారంలో సమస్య సృష్టించి మళ్లీ తనే పరిష్కరిస్తున్నట్టు హీరోలతో పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సినిమా నటుల్ని మించి నటన చేస్తున్నారని వెటకరించారు. జగన్ నటనకు ఇండస్ట్రీ దండం పెడుతోందన్నారు.