సాధారణంగా ఇప్పటి రాజకీయ నాయకులు ఎవరూ నిజాలు చెప్పారు. నిజాయితీగా ఉండరు. దాదాపు అందరూ గారడీలు చేసేవారే. మాటల మరాఠీలే. గల్లీ నాయకులైనా అంతే. ముఖ్యమంత్రి అయినా అంతే. ప్రధాని అయినా అంతే. ఏం తేడా లేదు. ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి చెప్పుకుందాం. ఆయన మాటల మాంత్రికుడనే సంగతి తెలిసిందే కదా. చాలా ఆకర్షణీయంగా మాట్లాడతాడు.
కేసీఆర్ చెబుతున్నదంతా నిజమేనని జనం అనుకుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావొచ్చుగానీ ఆయన కూడా సగటు రాజకీయ నాయకుడే. ఆయన అబద్దాలు అలవోకగా చెబుతాడు. కానీ జనం ముందు వీరుడిలా, శూరుడిలా నటిస్తుంటాడు. తాను అరివీర భయంకరుడినని ప్రతిపక్షాలకు చాటి చెబుతుంటాడు. కొంత కాలంగా ప్రధాని మోడీని కేసీఆర్ నానా బూతులు తిడుతున్న వైనం చూస్తున్నాం.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైన తిట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా మోడీని తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టారు. అంతకుముందు జనగామలో, భువనగిరిలో కూడా మోడీ మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ఇలా తిట్టడం రాజకీయాల్లో మామూలే కాబట్టి దాన్ని తప్పుపట్టలేం. అదంతా రాజకీయం. ఇక కేసీఆర్ అబద్దాల గురించి చెప్పుకోవాలి. చినజీయర్ ఆశ్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్ళలేదు.
ఉద్దేశపూర్వకంగానే వెళ్లలేదనే సంగతి అందరికీ తెలుసు. కానీ జ్వరం వచ్చి కేసీఆర్ వెళ్లలేదని మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇదే విషయం చెప్పింది. అయితే ఈ సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారు. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో తాను ప్రధానికి స్వాగతం పలకడానికి ఎందుకు వెళ్లలేదనే దానిపై ఇంకో కారణం చెప్పారు.
తమ ఇంట్లో ఇద్దరికీ కరోనా వచ్చిందని, అలాంటప్పుడు ముచ్చింతల్ కు వెళ్లి ప్రధానిని కలవడం, ఆయనతో మూడు నాలుగు గంటలు గడపడం సరికాదని అన్నారు. జనం కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి తాను వెళ్లలేదని అన్నారు. దీనిపై ఎవరో యేవో వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను పట్టించుకోనని అన్నారు. తాను రావడం లేదనే విషయాన్ని సీఎంవో ద్వారా ప్రధానికి పరోక్షంగా ముందే చెప్పానని కేసీఆర్ అన్నారు.
ఎవరి గౌరవం వారికి ఇవ్వాలనే సంగతి తనకు తెలుసనీ, ప్రోటోకాల్ తెలుసనీ అన్నారు. తాను చదువుకున్న వాడినని చెప్పారు. మరి ఈరోజు రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన కథ బాగానే ఉంది. ప్రధాని వచ్చిన రోజు తనకు జ్వరం వచ్చిందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పడమేమిటి? అబద్ధాలను గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. కేసీఆర్ ధైర్యవంతుడే అయితే మోడీ అంటే నాకిష్టం లేదు. అందుకే వెళ్లలేదని చెప్పొచ్చు కదా.
మోడీ ఎపిసోడ్ తరువాత కేసీఆర్ కు ఇష్టమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగానే ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్ళలేదు. అయితే ఏంటి? అని ప్రతిపక్షాలను ప్రశ్నించాడు. ప్రధానికి ఎదురుపడటానికి కేసీఆర్ కు భయమో, గిల్టీ ఫీలింగో తెలియదు. మొత్తమ్మీద విజయవంతంగా అబద్ధాలు చెప్పారు.