ఇలాంటి బ‌హిష్క‌ర‌ణ – మొట్ట మొద‌టిసారి!

స‌హ‌జంగా కౌన్సిల్ స‌మావేశాల్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు బ‌హిష్క‌రించ‌డం చూస్తుంటాం. అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశం నుంచి మొట్ట‌మొద‌టిసారిగా అధికారులు వాకౌట్ చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీన్ని బ‌ట్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో…

స‌హ‌జంగా కౌన్సిల్ స‌మావేశాల్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు బ‌హిష్క‌రించ‌డం చూస్తుంటాం. అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశం నుంచి మొట్ట‌మొద‌టిసారిగా అధికారులు వాకౌట్ చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీన్ని బ‌ట్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో రాజ‌కీయాలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వాన‌లు దంచి కొడుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. వాహ‌నాలు వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాయి. గ‌తంలో వ‌ర్షాకాలంలో హైద‌రాబాద్‌ను వ‌ర‌ద ముంచెత్తింది. భారీగా న‌ష్టం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వేస‌విలో వ‌ర్షాలు కురుస్తుండ‌డం, వ‌ర‌ద నీటిలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ‌డంపై బీజేపీ కార్పొరేట‌ర్లు ఫైర్ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. స‌మావేశానికి బీజేపీ కార్పొరేట‌ర్లు వినూత్న రీతిలో వేష‌ధార‌ణ‌తో నిర‌స‌న‌కు దిగారు. వ‌ర్ష‌పు నీటికి నాలాల్లో చిన్న పిల్ల‌లు కొట్టుకుపోయి మృతి చెంద‌డంపై బీజేపీ కార్పొరేట‌ర్లు నిర‌స‌న‌కు దిగారు. అధికార పార్టీని, అధికారుల‌ను నిల‌దీశారు. విప‌క్ష కార్పొరేట‌ర్ల తీరుకు నిర‌స‌న‌గా జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌నర్లు, వాట‌ర్ బోర్డు అధికారులు స‌మావేశాన్ని బాయ్‌కాట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

వీరికి బాస‌ట‌గా కిందిస్థాయి సిబ్బంది నిలిచారు. అధికారుల తీరుపై బీజేపీ కార్పొరేట‌ర్లు మండిప‌డ్డారు. మీడియాతో వారు మాట్లాడుతూ న‌గ‌రంలో దుస్థితిపై నిల‌దీస్తే అధికారులు స‌మాధానం చెప్ప‌లేక పారిపోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పిల్ల‌లు చ‌నిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన త‌మ‌పై కేసులు పెడ‌తారా? అని నిల‌దీశారు.

అధికారులు అవ‌మానించింది త‌మ‌ను కాద‌ని, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మిని అని బీజేపీ కార్పొరేట‌ర్లు అన్నారు. అయితే బీజేపీ కార్పొరేట‌ర్ల వైఖ‌రిపై మేయ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారులకు సిగ్గులేద‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. కౌన్సిల్ సమావేశం వాయిదా ప‌డ‌డంతో మేయ‌ర్ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. 

రాజ‌కీయాలు కేవ‌లం నాయ‌కుల‌కే ప‌రిమితం కాలేద‌నేందుకు తాజా కౌన్సిల్ స‌మావేశ‌మే నిద‌ర్శ‌నం. చివ‌రికి అధికారులు కూడా రాజ‌కీయ నాయ‌కుల్లా జీహెచ్ఎంసీ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌జాస‌మ‌స్య‌లు మాత్రం ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేదు.