ప‌వార్ రిటైర్మెంట్ .. బీజేపీకి సానుకూల‌మే!

83 యేళ్ల వ‌య‌సులో శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డంతో.. ఈ బుల్లి పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం త‌లెత్తుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర రాజ‌కీయ‌మే పెద్ద సంక్షోభంగా సాగుతోంది. ఇలాంటి…

83 యేళ్ల వ‌య‌సులో శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డంతో.. ఈ బుల్లి పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం త‌లెత్తుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర రాజ‌కీయ‌మే పెద్ద సంక్షోభంగా సాగుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో ప‌వార్ త‌ప్పుకోవ‌డం ఎన్సీపీ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసే అవ‌కాశాలూ లేక‌పోలేదు!

అస‌లే బీజేపీ అక్క‌డ అవ‌కాశాల కోసం వేచి చూస్తోంది. ఎన్సీపీ ముఖ్య నేత అజిత్ ప‌వార్ ను మ‌రోసారి త‌మ‌వైపుకు తిప్పుకుని క‌మ‌లం పార్టీ ప్ర‌భుత్వాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, ఏక్ నాథ్ షిండేతో అవ‌స‌రం తీరిపోతున్న త‌రుణంలో అజిత్ ప‌వార్ వైపు బీజేపీ చూపు ఉంద‌నే టాక్ న‌డుస్తోంది. సరిగ్గా ఇలాంటి త‌రుణంలో శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకోవ‌డం ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. శ‌ర‌ద్ ప‌వార్ ఇప్పుడు అజిత్ ను మ‌రీ నిరోధించే అవ‌కాశాలు కూడా ఏమీ లేవు. అజిత్ ప‌వార్ అటు వైపు చూస్తున్నాడనే వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడే.. వెళ్లే వాళ్ల‌ను ఆప‌లేమ‌న్న‌ట్టుగా శ‌ర‌ద్ వ్యాఖ్యానించారు. 

దేశంలో చాలా ప్రాంతీయ పార్టీల‌ను, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులను బీజేపీ వాళ్లు తుప్పు వ‌దులుస్తుంటే.. ఇలాంటి త‌రుణంలో కూడా ఎన్సీపీ మీద మాత్రం ఎలాంటి క‌న్నెర్ర లేదు! ఎన్సీపీని నేచుర‌లీ క‌ర‌ప్టెడ్ పార్టీ అంటూ మోడీ అన్న‌ప్ప‌టికీ.. అదే పార్టీ అధినేత అయితే శ‌ర‌ద్ ప‌వార్ కు మోడీ స‌ర్కారే ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును ఇచ్చింది! అలా దేశంలో అత్యున్న‌త పౌర‌పుర‌స్కారాల్లో రెండో హోదాను ప‌వార్ కు ఇచ్చింది బీజేపీ స‌ర్కారే. 

ఇలా ప‌వార్ ప‌ట్ల బీజేపీ, బీజేపీ ప‌ట్ల ప‌వార్ బాహాటం కాని ప్రేమాప్యాయ‌త‌ల‌ను చూపించుకుంటూ వ‌చ్చాయి. స‌రిగ్గా అజిత్ ప‌వార్ అటు చూస్తున్నాడ‌నే టాక్ వ‌స్తున్న స‌మ‌యంలోనే శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకోవ‌డం రాబోయే ప‌రిణామాల‌కు సంకేతంగా క‌నిపిస్తోంది.

ఎన్సీపీ వెళ్లి బీజేపీతో ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అయితే ఆ ప‌రిణామాన్ని ఆప‌లేద‌న్న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన‌కుండా శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకుని ఉండ‌వ‌చ్చు కూడా! త‌ను ఆప‌లేక‌.. ప్రోత్స‌హించాడ‌నే పేరు పొంద‌లేక‌, ఆప‌లేద‌నే విమ‌ర్శ‌లూ లేకుండా శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకుని ఉండ‌వ‌చ్చేమో! 

ప్ర‌స్తుతానికి అయితే శ‌ర‌ద్ ప‌వార్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోవాలంటూ అజిత్ ప‌వార్ అండ్ కో బుజ్జ‌గిస్తోంద‌ట‌. అయితే వ‌య‌సు కార‌ణంగా ప‌వార్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోక‌పోవ‌చ్చునేమో! శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుకున్న త‌ర్వాత కూడా ఎమ్మెల్యేల వ‌ర‌కూ అజిత్ ప‌వారే నాయ‌కుడు. 

బీజేపీ తో క‌లిసి అధికారాన్ని పంచుకునే ఆప్ష‌న్ చూపిస్తే ఆయ‌న వెంట ఎమ్మెల్యేలు కూడా న‌డ‌వొచ్చు. మ‌రి ఎంపీ హోదాలో ఉన్న శ‌ర‌ద్ ప‌వార్ ఏకైక పుత్రిక సుప్రియా సులే ఎన్సీపీపై ఎంత వ‌ర‌కూ ప‌ట్టు నిల‌బెట్టుకోగ‌ల‌ర‌నేది కూడా ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే. వీరిద్ద‌రితో పాటు కేంద్ర మాజీ మంత్రి ప్ర‌పుల్ ప‌టేల్, ఇంకా జ‌యంత్ ప‌టేల్ వంటి వారు కూడా అధ్య‌క్ష స్థానం రేసులో ఉన్నార‌ని తెలుస్తోంది.