కారణం తెలియక ముందే కోలుకుంటున్న ఏలూరు

ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యానికి అసలు కారణం ఇంకా తెలియడం లేదు. ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చి చెప్పిన విషయం ఒక్కటే ప్రస్తుతానికి అధికారికం. బాధితుల శరీరాల్లో సీసం, నికెల్ అవశేషాలున్నాయని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది.…

ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యానికి అసలు కారణం ఇంకా తెలియడం లేదు. ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చి చెప్పిన విషయం ఒక్కటే ప్రస్తుతానికి అధికారికం. బాధితుల శరీరాల్లో సీసం, నికెల్ అవశేషాలున్నాయని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. అయితే ఆ అవశేషాలు వారి శరీరాల్లోకి ఎలా వచ్చాయనేదే అంతు చిక్కకుండా మారింది.

మరోవైపు ఏలూరులో పలు చోట్ల సేకరించిన తాగునీటి నమూనాలలో క్రిమి సంహాకర మందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు స్వయంగా కలెక్టర్ వెల్లడించారు. అంటే తాగునీరు కలుషితం అనేది ప్రధాన కారణంగా తెలుస్తోంది. కూరగాయల సాగు కోసం వాడుతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు తాగునీటి వనరుల్లో కలసిపోవడంతో సమస్య మొదలైంది. 

మందుల ప్రభావంతో పండించిన కూరగాయలు, ఆయా ప్రాంతాల్లో గడ్డి తిన్న పశువుల ద్వారా వచ్చిన పాలు, ఇతరత్రా కారణాల వల్ల ఏలూరులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.. మున్సిపల్ వాటర్ తాగినా, మినరల్ వాటర్ తాగినా క్రిమిసంహారక మందుల ప్రభావం ఉండటంతో ప్రజలు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

అయితే ఎయిమ్స్ బృందం తేల్చిన విషయం మినహా.. మిగతావన్నీ కేవలం అనుమానాలు మాత్రమే. ఇటీవల చేపల చెరువుల్లోకి వరదనీరు రావడంతో.. చేపలన్నీ బైటకొచ్చాయని, వాటిని తక్కువ రేటుకు కొని తిన్నవారు అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి వెజిటేరియన్లు కూడా ఎందుకు స్పృహ తప్పి పడిపోయారనే విషయం మాత్రం వారు చెప్పడం లేదు.

ఇక వైరస్, బ్యాక్టీరియా నిర్థారణ కోసం చేసిన కల్చర్ టెస్ట్ కూడా నెగెటివ్ రావడం కాస్త ఊరటనిచ్చే అంశం. అంటే బాధితుల శరీరాల్లో ఎక్కడా వైరస్, బ్యాక్టీరియా లేవని తేలింది. కణజాల పరీక్ష కోసం హైదరాబాద్ కి పంపిన నమూనాల ఫలితాలు మరో వారం రోజుల్లో వస్తాయి. అప్పుడు ఈ వింత ఆరోగ్య స్థితిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

అయితే కారణం తెలియకముందే ఏలూరు కోలుకుంటోంది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 68 మంది బాధితులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మొత్తం 497మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 24 మందిని విజయవాడకు తరలించారు. దీన్నిబట్టి చూస్తే మరో రెండు రోజుల్లో ఏలూరులో పరిస్థితి వందశాతం అదుపులోకి వస్తుంది. 

మళ్ళీ అదే ప్రశ్న