నేటి హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

హిజాబ్ వివాదంపై క‌ర్నాటక హైకోర్టు ఇవాళ ఇచ్చే తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కుంది. మ‌త‌ప‌ర‌మైన విశ్వాసాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. విడ‌వ‌మంటే పాముకు, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం…

హిజాబ్ వివాదంపై క‌ర్నాటక హైకోర్టు ఇవాళ ఇచ్చే తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కుంది. మ‌త‌ప‌ర‌మైన విశ్వాసాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. విడ‌వ‌మంటే పాముకు, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం అనే సామెత చందాన హిజాబ్ వివాదం త‌యారైంది. దీంతో దీనిపై తీర్పు హైకోర్టుకు కూడా స‌వాల్ అని చెప్పొచ్చు. 

ఏ ఒక్క‌రి హ‌క్కుల‌కు భంగం క‌ల‌గ‌కుండా, మ‌నోభావాల్ని దెబ్బ‌తీయ‌కుండా కీల‌క ఆదేశాలు ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క‌లో ప‌లు జిల్లాల్లో ప‌ది రోజులుగా మూత‌ప‌డిన పాఠ‌శాల‌లు సోమ‌వారం ప్రారంభమ‌య్యాయి. హిజాబ్ వివాదంతో విద్యా సంస్థ‌ల‌ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా బెంగ‌ళూరు, మైసూరు, ఉడుపితో పాటు మ‌రికొన్ని జిల్లాల్లో ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం లేకుండా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, విద్యాశాఖాధికారుల‌తో క‌ర్నాట‌క సీఎం బొమ్మై వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడి భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు.  

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఈ నెల 19వ తేదీ వ‌ర‌కూ నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో వుంటాయి. విద్యా సంస్థ‌ల వద్ద గుంపులుండ‌కూడ‌ద‌ని ఆదేశించారు. అలాగే వివాదాస్ప‌ద ఆంశంపై ఎలాంటి ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి లేద‌ని తేల్చి చెప్పారు. ఇటీవ‌ల హిజాబ్ వ్య‌వ‌హారంపై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. తుది తీర్పు ఇచ్చే వ‌ర‌కూ వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలో ప‌ట్టింపుల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశించింది. 

హిజాబ్‌కు బ‌దులు మామూలు వ‌స్త్రాల‌ను ధ‌రించి రావాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంపై కొంద‌రు మైనార్టీ విద్యార్థులు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. అయితే క‌ర్నాట‌క హైకోర్టు విచారిస్తోందని, అక్క‌డ తుది తీర్పును చూసిన త‌ర్వాతే తాము జోక్యం చేసుకుంటామ‌ని పిటిష‌న్‌పై స్ప‌ష్టం చేసింది. సున్నిత‌మైన అంశాన్ని జాతీయ‌స్థాయిలో స‌మ‌స్య చేయొద్ద‌ని కూడా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం హిత‌వు చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ హైకోర్టు ఏం చెబుతుంద‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.