కేసీఆర్ మోదీకి తుపాకీ ఎక్కుపెట్టారు, అయితే దాన్ని జగన్ భుజంపై ఉంచి కాల్చాలనుకోవడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. గతంలో జగన్, కేసీఆర్ భాయి భాయి. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ ముఖ్య అతిథి. అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత రంజాన్ స్వీట్లు తినిపించుకోవడం.. తరచూ ఒకరినొకరు కలవడం.. ఇలా చాలానే చేశారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. జగన్ తో స్నేహం తనకెంతవరకు లాభం అని కేసీఆర్ ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది.
ఏపీని తిడితేనే తెలంగాణలో ఏ పార్టీకైనా మనుగడ. అలాంటిది, ఏపీ సీఎంతో రాసుకుపూసుకు తిరిగితే ఇంకేమైనా ఉందా. అందుకే కేసీఆర్ మారిపోయారు, ఆ తర్వాత నీళ్ల వివాదాలొచ్చాయి, ముఖ్యమంత్రులు అస్సలు మాట్లాడుకోలేదు, సరికదా ఏపీ సీఎంని, మంత్రుల్ని చెడామడా తిట్టించారు కేసీఆర్. ప్రతి విషయంలోనూ ఏపీతో పోలిక పెట్టుకునేవారు.
ఏపీలో ఉద్యోగులు నిరసన చేస్తే.. తెలంగాణ మంత్రి చూడండి.. అక్కడ ఏం జరుగుతుందో అంటూ సెటైర్లు వేశారు. ఇవన్నీ కేసీఆర్ కి తెలియకుండా జరిగేవి కావు, పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ ని ఇరికించేందుకు వ్యూహం రచించారు. ఇప్పుడు టైమ్ చూసి మరో దెబ్బకొట్టేందుకు రెడీ అవుతున్నారు.
కేంద్రం విద్యుత్ సంస్కరణలు తేవాలనుకుంటోంది. అందులో ముఖ్యమైనది వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం, ఏపీ దీన్ని ఒప్పుకుంది, తెలంగాణ అస్సలు ఒప్పుకోవడం లేదు. తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ పనిలో పనిగా ఏపీ తలవంచిందంటూ శ్రీకాకుళం జిల్లాలో 25వేల మీటర్లు పెట్టారని ప్రస్తావించారు కేసీఆర్. మరి జగన్ దీనికి కౌంటర్ ఇవ్వగలరా.. ఈ మీటర్ల వల్ల రైతులకు నష్టం లేదని చెప్పగలరా. అనవసరంగా గుడ్డ కాల్చి తనపై వేస్తున్న కేసీఆర్ ని జగన్ నిలువరించేందుకు ప్రయత్నిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
జగన్ ప్రస్తావన అవసరం లేదు కానీ..
గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా వ్యతిరేకించింది. జగన్ ఆ స్థాయిలో నిరసన తెలపలేకపోయారు. ఇప్పుడు వ్యవసాయ మీటర్ల విషయంలో కూడా జగన్ సైలెంట్ గా ఉన్నారు, కేసీఆర్ వయలెంట్ గా మారిపోయారు. ఇలా చాలా విషయాల్లో ఇద్దరు సీఎంల మధ్య వ్యత్యాసం ఉంది. జగన్ నిర్ణయాలతో ఏపీకి నష్టం జరుగుతుందని అనుకున్నా.. కేసీఆర్ మాత్రం అక్కడ కేవలం తన రాజకీయ అజెండా ప్రకారమే బీజేపీని తిట్టిపోస్తున్నారు. మోదీతో కయ్యానికి సై అంటున్నారు. మధ్యలో ఏపీ సీఎం జగన్ ని సీన్ లోకి తెస్తున్నారు.
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే.. కేసీఆర్ అంతవరకే పరిమితం కావాలి, మధ్యలో ఏపీ ప్రస్తావన ఎందుకు..? ముందు ముందు జగన్ మరెన్ని అపనిందలు కాచుకోవాలో..?