సాధారణంగా ఆడు మగాడ్రా అంటారు. కేసీఆర్ లాంటి ప్రముఖల విషయంలో అలా అనడం బాగుండదని..వీరుడు అంటున్నా…అయితే నిజంగా కేసీఆర్ వీరుడేనా? ఇప్పుడు ఆయన ప్రదర్శిస్తున్నది అంతా వీరత్వమేనా? నిజంగానే నిజం అయితే కేసీఆర్ నిజంగా వీరుడే. అందులో అణుమాత్రం సందేహం వుండదు. ఎందుకంటే దేశంలో అధికారం వెలగబెడుతున్న..వెలబెట్టాలనుకుంటున్న అనేకానేక రాజకీయ నాయకులు ఎవ్వరూ నోరు విప్పకుండా అత్యంత వినయ విధేయలతో కాలం వెల్లబుచ్చుతున్న సమయంలో కేసీఆర్ ఇంత పెద్దగా, ఇంత బాహాటంగా, ఇంత లాజికల్ గా విమర్శలు చేయడం అంటే కచ్చితంగా వీరత్వమే.
కానీ…కేసీఆర్ నైజం, కేసీఆర్ ఎత్తుగడలు, కేసీఆర్ రాజకీయ చతురత, కేసీఆర్ వ్యవహారాలు ఇప్పటకే రెండు దశాబ్దాలుగా చూస్తున్నవారందరినీ ఇది నిజమేనా? నమ్మదగ్గదేనా? అనుమానాలు వెన్నాడుతున్నాయి. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను పసిగట్టడం అంత సులువు కాదు. అవకాశాలను అంది పుచ్చుకోవడం, అధికారం అందుకునేందుకు అవకాశవాది అని అనిపించుకున్నా, మరే విధమైన బిరుదులు అందుకోవాల్సి వచ్చినా ఆయనేమీ వెనుకడగుగు వేయరు. మీరేం అనుకుంటే నాకేంటీ..నా ప్లానింగ్ నాది, నా మాటలు నావి, నా అధికారం నాది అనే టైపు కేసీఆర్.
అందుకే భాజపా మీద గత రెండు మూడు వారాలుగా అటు కేసీఆర్, ఇటు కేటిఆర్ ఒంటి కాలి మీద విరుచుకు పడుతున్నా, ఙాతీయ మీడియా సైతం కేసీఆర్ మాటలకు కవరేజీ ఇస్తున్నా, జనం మాత్రం ఇంకా అనుమానంగానే చూస్తున్నారు.
కానీ ఇదంతా ప్రీ పిపేర్డ్ స్క్రిప్ట్ అనుకున్నా, పక్కా ప్రణాళికతో విసురుతున్న పాచికలు అనుకున్నా, కేసీఆర్ సంధిస్తున్న మాటల తూటాల్లో మాత్రం సత్తువ ఎక్కువే వుంది.
ప్రతిసారీ ఎన్నికలు వచ్చినపుడే మన దేశ సరిహద్దుల్లో అలజడి ఎందుకు రేగుతుంది?
మోడీ వచ్చిన తరువాతే కదా, బోలెడు మంది గుజరాతీలు, బ్యాంకులను ముంచేసి విదేశాలకు చక్కా బోయి అక్కడి నుంచి మన వ్యవస్థలను వెక్కిరిస్తున్నది?
రాఫెల్ యుద్ద విమానాలను మన కన్నా చౌకగా మనతో పాటే ఇండోనేషియా ఎలా కొనగలిగింది? ఈ డీల్ లో అవినీతి లేదని అనగలమా?
ఇలాంటి పాయింట్లు అన్నీ కొత్తవి కాదు. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వల్లె వేస్తున్నవే. గొంతు చించుకుంటున్నవే. కానీ ఇప్పుడు కేసీఆర్ తన స్టయిల్ లో కొత్తగా వినిపించడం అలాగే దాదాపు ప్రతిపక్షాల గొంతులు అన్నీ అలసిపోయి మూగపోతున్న వేళ ఈ కొత్త గొంతు, అది కూడా దక్షిణాది నుంచి వినిపించడం అన్నది ఙాతీయ మీడియాకు సైతం ఆసక్తిగా అనిపిస్తోంది.
వృధాయాసేనా?
నిజానికి దేశం మొత్తం మీద భాజపా వ్యతిరేకత, అనుకూలత సమానంగా వున్న పరిస్థితి కనిపిస్తోంది. మోడీ విధానాలు, భాజపా సిద్దాంతాలు, హిందూయిజం ఇవన్నీ నచ్చిన వారు బలమైన సంఖ్యలోనే వున్నారు. కానీ బలమైన ఓటు బ్యాంకుగా మాత్రం అన్ని చోట్లా లేరు. అందువల్లే ప్రతి చోటా భాజపా ఏదో విధంగా కిందా మీదా పడి అధికారం ‘లాక్కోవాల్సి’ వస్తోంది తప్ప, అందుకోవడం కుదరడం లేదు.
కేసీఆర్ ఆ విషయం కూడా బలంగానే ప్రస్తావిస్తున్నారు. ప్రజలు ఎన్నుకోకుండా అధికారం లాక్కుని అనుభవించే భాజపా పద్దతిని ఆయన ఎండ గడుతున్నారు. ఇది నిజంగా నిజం. కాంగ్రెస్ ఏనాడూ మరీ ఇంత దారుణానికి ఒడి గట్టలేదు. ఓడి పోతే సైలంట్ గా అధికారం అప్పగించేసి, ఆ తరువాత కుట్రలు చేసేదేమో కానీ అసలు ఆదిలోనే అడ్డం పడిపోయి అధికారం లాగేసుకోలేదు.
కాంగ్రెస్ తప్పదాలు
రాజకీయపరంగా కాంగ్రెస్ కన్నా దారుణమైన క్రూరమైన పాలన సాగిస్తోంది భాజపా. అది పచ్చి వాస్తవం. ఇడి, సిబిఐ వంటి వాటిని వాడడంలో కాంగ్రెస్ ను మించిపోయింది. ఎన్నికల్లో గెలిస్తే సరేసరి,గెలవకపోతే ఏదో విధంగా గుంజుకోవడం అన్నది అలవాటు చేసుకుంది. రాజకీయ నాయకులను నయానా, భయానా అణచిపెట్టి వుంచడంలో ఆరితేరిపోయిన విధానాలు అన్నీ అనుసరిస్తోంది. తమిళనాట ప్రదర్శించిన రాఙకీయాలు, ఆంధ్రలో అనుసరించిన పద్దతులు, బెంగాల్ లో చేసిన బీభత్సం అన్నీ వర్తమాన సమాజం కళ్ల ముందు ఙరిగినవే.
అయినా ప్రజలు ఇంకా, ఇప్పటికీ భాజపా వైపు సగానికి పైగా మొగ్గుతో వున్నారు. దీనికి రెండు బలమైన కారణాలు వున్నాయి. భాజపా వెనుక వున్న హిందూ మేధావి వర్గం సోషల్ మీడియాలో సాగిస్తున్న ప్రచారం. పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ. ఇవే బలమైన కారణాలు. కాంగ్రెస్ పార్టీ చివరి దశలో అత్యంత సులువైన రాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయింది. ప్రాంతీయ పార్టీలను చేరదీసి, వారి బలంతో తాను అధికారం నిలబెట్టుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చేసింది. ఆ క్రమంలో తమ పార్టీ ఎక్కడిక్కడ బలహీనం అయిపోతోందన్న విషయాన్ని పూర్తిగా విస్మరించింది. అంతే కాదు. తమ మద్దతు ప్రాంతీయ పార్టీలు తప్పిదాలు చేసి, నిర్మొహమాటంగా జైలు పాలు చేసింది. దాంతో కాంగ్రెస్ అనుకూలం ప్రాంతీయ పార్టీలు పలుచనయ్యాయి.
మరోపక్కన కాంగ్రెస్ పార్టీలో వృద్ద తరం పెరిగిపోయింది. కోటరీ రాజకీయాలు కొత్త తరాన్ని దగ్గరకు రానివ్వలేదు. తప్పుడు సలహాలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పటడుగులు వేసింది. ఫలితంగా దక్షిణాదిలో బలమైన రెండు తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా దూరం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతులు పూర్తిగా కాలిపోయాయి. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధానికి ఇప్పుడు ఏ విధమైన చికిత్స లేదు. కాంగ్రెస్ పార్టీ తరపును రాహుల్ ఎంతయినా మాట్లాడవచ్చు.కానీ ఓటరును పోల్ బూత్ కు తీసుకెళ్లి ఓట్లేయించే వ్యవస్థ ఆ పార్టీకి ఇప్పుడు దాదాపుగా లేదు. జనాలు అందరూ పూర్తిగా భాజపా అంటే కోపగించుకున్నా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టం. ఎందుకంటే ఆ పార్టీ నమ్ముకున్న ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇప్పుడు దాదాపుగా ఆక్సిజన్ బెడ్ మీద వున్నాయి. భాజపాకు ఏమాత్రం కోపం వచ్చినా ఆ ఆక్సిజన్ కూడా కట్ అయిపోతుంది.
కేసీఆర్ సాధించేది ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ కుదలైన సమయంలో, ప్రాంతీయ పార్టీలు సద్దు మణగడమో, సర్దుకుపోవడమో అలవాటు చేసుకున్న తరుణంలో, కొత్తగా జాతీయ పార్టీ పెట్టడం లేదా దేశం నలుమూలలా గొంతు వినిపించడం ద్వారా కేసీఆర్ సాధించేది ఏమిటి? దీని ద్వారా కేవలం తెలంగాణలో తన పార్టీ మనుగడను మరో దఫా కొనసాగించడం మాత్రమే లక్ష్యమా? ఇలాంటి తప్పటడుగే చంద్రబాబు గత ఎన్నికల సమయంలో వేసారు. దేశంలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేయలేక, యాంటీ మోడీ స్టాండ్ తీసుకుని దేశం అంతా కాలికి స్పెషల్ ఫ్లయిట్ కట్టుకుని తిరిగేసి బోర్లా పడిపోయారు. ఇప్పుడు మోడీ కి దగ్గరా కాలేక, దూరమూ కాలేక కిందా మీదా అవుతున్నారు.
జాతీయ స్థాయిలో విజయం సాధించే సత్తా లేకపోయినా, అవకాశం వస్తే ప్రధాని కావాలనుకునే ప్రతిపక్ష నేతల జాబితా కాస్త బారుగానే వుంది. ఈ కూటమిని కాదని వేరు కుంపటి పెట్టుకున్నా నెగ్గుకురావడం అంత సులువు కాదు. లేదా తను కూడా ప్రధాని అభ్యర్థినే అన్న సూచనలు ఇవ్వడానికే ఇదంతా అని అనుకున్నా సరైన ఆలోచన కాదు. మరి ఇంత పెద్దగా రోడ్డెక్కడం ద్వారా కేసీఆర్ సాధించాలనుకునేది ఏమిటి?
మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండ గట్డడం ద్వారా సాధించేది ఏమిటి? మోడీ కార్పొరేట్ విధానాల ఆనుపానులు జనాలకు అందుతూనే వున్నా కూడా అటే మొగ్గుతున్నారు. రూపాయి ఇన్వెస్ట్ మెంట్ అవసరం లేని సంస్థలు వేల కోట్ల పబ్లిక్ ఇష్యూలకు వస్తుంటే జనం వేలం వెర్రిగా పెట్టుబడులు పెడుతూ మోసపోతూనేే వున్నారు. హిందూ..మైనారిటీ అంటూ చీలిపోయి కొట్టుకుంటూనే వున్నారు. ప్రతి రాష్ట్రంలో ఏదో విధంగా ఈ వర్గ విబేధాలకు ఆజ్యం పోస్తూనే వస్తున్నారు. మధ్య తరగతి జనాలకు గత దశాబ్దకాలంగా ఏ ఊరటా లేకున్నా ఇంకా సోషల్ మీడియాలో ఙరుగుతున్న ప్రో హిందూ పోస్ట్ లు చూసి మోడీ ఙిందాబాద్ అంటూనే వున్నారు.
ఇవన్నీ కేసీఆర్ కు తెలియనివి కాదు. జాతీయ స్థాయిలో విజయం మీద కేసీఆర్ కు ఏ విధమైన పగటి కలలు లేవు. భ్రమలు లేవు అనే అనుకోవాలి. అయినా కూడా ఇలా ఎత్తుగడలు వేస్తున్నారు అంటే కేవలం ప్రతిపక్ష ఓట్లను చీల్చడానికి అనే వాదన కూడా సరికాదు. కేసీఆర్ ప్రతిపక్ష ఓట్లను చీల్చేంత సీన్ ఙాతీయస్థాయిలో లేదు. కేవలం తెలంగాణలో మరోసారి తన అధికారం నిలబెట్టుకోవాలనే తాపత్రయం, రాష్ట్ర స్థాయిలో భాజపాను తిట్టడానికి ఏ అవకాశం లేకపోవడం వల్ల ఈ బాణీ ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పాలన జనాలకు తెలుసు కాబట్టి, దాన్ని తిట్టిపోయడానికి కేసీఆర్ దగ్గర కావాల్సినంత సరుకు వుంది. కానీ తన పాలనను సదా ఎత్తి చూపిస్తున్న రాష్ట్ర భాజపా నాయకులను కట్టడి చేయడానికి ఏముంది? నేరుగా మోడీని టార్గెట్ చేయడం తప్ప? భాజపాను రాష్ట్రంలో ఎన్నుకుంటే ఇదిగో ఇలా వుంటుంది? ఎలా వుంటుందీ అంటే మోడీ పాలన మాదిరిగా..అని చెప్పడానికి, ఆ విధంగా ఇక్కడ భాజపా హవా పెరగకుండా చేయడానికి తప్ప కేసీఆర్ చేస్తున్న హడావుడి మరెందుకూ పనికి వస్తుందంటే అనుమానమే?
అయితే మరి ఇంతకీ కేసీఆర్ వీరుడా? కాదా? అంటే నిస్సందేహంగా వీరుడే. జగన్ అంటే కేసుల భయం వుండొచ్చు. నోటికి ప్లాస్టర్ వేసుకుని వుండొచ్చు. మరి చంద్రబాబుకు పోయేదేముంది? అయినా కూడా భయంగా కూర్చుకున్నారు. గత ఎన్నికల్లో తీసుకున్న స్టాండ్ నే కొనసాగించి వుంటే ఆయన ఇప్పటికి బలమైన ఙాతీయ ప్రతిపక్ష నేతగా కనిపించి వుండేవారు. కనీసం పవన్ కళ్యాణ్ అయినా గత ఎన్నికల ముందటి ‘పాచిపోయిన లడ్డూలు’ స్టాండ్ నే పట్టుకుని వున్నా రాష్ట్ర స్థాయిలో మంచి నాయకుడిగా ఎదిగేవారు. ఆ ఇద్దరు వదులుకున్న చాన్స్ ను కేసీఆర్ పట్టుకున్నారు. అందుకని వీరుడే అనుకోవాలి.
-చాణక్య