ఆ నాయ‌కుడికి త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

క‌ర్నాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌కు త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పింది. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న ప్ర‌మాదం నుంచి బతికి బ‌య‌ట‌ప‌డ్డారు. క‌ర్నాట‌క అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అన్ని రాజ‌కీయ ప‌క్షాలు…

క‌ర్నాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌కు త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పింది. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న ప్ర‌మాదం నుంచి బతికి బ‌య‌ట‌ప‌డ్డారు. క‌ర్నాట‌క అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అన్ని రాజ‌కీయ ప‌క్షాలు సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేస్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి నిమిషాన్ని ఎంతో విలువైన‌దిగా భావిస్తూ, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ రాష్ట్ర‌మంతా క‌లియ‌తిరిగేందుకు హెలీకాప్ట‌ర్‌ను వాడుతున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్‌ను ఒక గ‌ద్ద ఢీకొట్టింది. అయితే ఫైలెట్ చాక‌చ‌క్యంతో ప్ర‌మాదం త‌ప్పింది.  

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కోలార్ వెళ్తుండగా హోసకోటే వద్ద హెలికాప్టర్‌ను గ‌ద్ద ఢీకొంది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్ట‌ర్‌ను అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్‌ చేశారు.

ఈ ప్రమాదంలో ఫైల‌ట్‌ గ్లాస్ విరిగిపోయింది. డీకే కెమెరామన్ స్వల్పంగా గాయపడ్డారు. పైలెట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ల్యాండ్ చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒక‌వేళ‌ గాల్లో ఉండగా అద్దం ప‌గిలి వుంటే ప్ర‌మాద తీవ్ర‌త మ‌రో ర‌కంగా వుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

గ‌తంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో విమాన ప్ర‌మాదాల్లో ప్ర‌ముఖులు ప్రాణాలు పోవ‌డం తెలిసిందే. తాజా ఘట‌న‌లో డీకే శివ‌కుమార్ ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.