ప‌వ‌న్ చెవిలో జోరీగ‌…ఆ నాయ‌కుడు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెవిలో జోరీగలా కాపు నాయ‌కుడు త‌యార‌య్యారు. జ‌న‌సేన బ‌ల‌మంతా కాపులే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు మాట్లాడుకోలేని ప‌రిస్థితి. ఇది కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కే ప‌రిమితం కాలేదు.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెవిలో జోరీగలా కాపు నాయ‌కుడు త‌యార‌య్యారు. జ‌న‌సేన బ‌ల‌మంతా కాపులే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు మాట్లాడుకోలేని ప‌రిస్థితి. ఇది కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కే ప‌రిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఇదే కంపు. రాజ‌కీయాల్లో ఏ అవ‌ల‌క్ష‌ణాలైతే వుండ‌కూడ‌ద‌ని భావిస్తామో, అవే రాజ్య‌మేల‌డం అత్యంత విషాదం.

ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే, త‌న సామాజిక వ‌ర్గాన్ని న‌మ్ముకుంటే త‌ప్ప రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు జ్ఞానోద‌యం అయ్యింది. అయితే త‌న సామాజిక వ‌ర్గం అండ కావాల‌ని బ‌హిరంగంగా కోర‌డం ఆయ‌న రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నమ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుండ‌గా కాపు కుల నాయ‌కుడిని సీఎం చేసుకోవ‌డం ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్పుడూ సాధ్యం కాద‌ని మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య గ‌త కొంత కాలంగా అంటున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న కాపు సంక్షేమ సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కూడా. కేవ‌లం కాపు, బ‌లిజ త‌దిత‌ర వాటి అనుబంధ కులాల సంక్షేమ కోసం ప‌ని చేస్తున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. ఇటీవ‌ల కాపుల‌తో ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేలా ఆయ‌న చొర‌వ తీసుకున్నారు. టీడీపీతో జ‌న‌సేన ఎలా వ్య‌వ‌హ‌రిస్తే వ‌ర్కౌట్ అవుతుందో ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషిస్తున్నారు. కానీ హ‌రిరామ జోగ‌య్య ఆకాంక్షిస్తున్న‌ట్టు చంద్ర‌బాబుతో బేర‌సారాలు ప‌వ‌న్ సాగిస్తున్నార‌ని ఆయ‌న‌కు ఇంకా అర్థం కాన‌ట్టుంది.

అందుకే అమాయ‌కంగా ఆయ‌న టీడీపీ-జ‌న‌సేన కూట‌మిపై త‌నదైన విశ్లేష‌ణ చేస్తున్నారు. అయితే హ‌రిరామ‌జోగ‌య్య విశ్లేష‌ణ‌లో ఒక ప్ర‌మాదాన్ని, హెచ్చ‌రిక‌ను ప‌వ‌న్ గుర్తించాల్సిన ఆవ‌శ్య‌క‌త వుంది. ఏదో 20 లేదా 25 సీట్ల‌కు అంగీక‌రించి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే త‌న సామాజిక‌వ‌ర్గ‌మంతా త‌న వెంట న‌డిచి, చంద్ర‌బాబును సీఎం చేస్తుంద‌ని ప‌వ‌న్ అనుకుంటే మాత్రం త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఈ మాట ఎందుకు అనాల్సి వ‌స్తున్న‌దో ఒక్క‌సారి హ‌రిరామ‌జోగ‌య్య విశ్లేష‌ణ‌లోని లోగుట్టును అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

“టీడీపీ-జ‌న‌సేన కూట‌మి జ‌యాప‌జ‌యాల‌ను నిర్దేశించేది సీఎం ఎవ‌ర‌నేది మాత్ర‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు తెలివి త‌క్కువ వాళ్లు కాదు. చ‌దువు సంస్కారం లేని వాళ్లు కూడా రాజ‌కీయాల గురించి అంద‌రి కంటే బాగా మాట్లాడుతున్నారు. నేను గ‌మనించిన మేర‌కు ప‌వ‌న్‌క‌ల్యాణే సీఎం కావాల‌ని కోరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ‌గా వుంది. వారు కోరుకుంటున్న‌ది నూత‌న ప‌రిపాల‌న‌. పాత చింత‌కాయ ప‌చ్చ‌ళ్లు కాద‌నేది సుస్ప‌ష్టం”

“రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను సంతృప్త‌ప‌రిచిన‌ప్పుడే ఎన్నిక‌ల్లో ఓట్లు బ‌దిలీ అవుతాయి. అప్పుడు కూట‌మి విజ‌యం సాధిస్తుంది. లేదంటే వైసీపీ గెలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. టీడీపీ, జ‌న‌సేన సీఎం ప‌ద‌వీ కాలంతో పాటు సీట్లు చెరి స‌గం పంచుకున్న ప్పుడే కూట‌మి విజ‌యం సాధ్యం. ఈ ష‌ర‌తుల‌కు అంగీకారం కుద‌ర‌ని ప‌క్షంలో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌డం ద్వారా వైసీపీని ఓడించే అవ‌కాశం ఉంది. అప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీఎం కావ‌డం ఖాయం “

చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోసం ప‌వ‌న్ ప‌ని చేస్తున్నార‌నే భావ‌న కాపులు, బ‌లిజ‌ల్లో క‌లిగితే, టీడీపీ-జ‌న‌సేన కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని హ‌రిరామ జోగ‌య్య నేరుగా హెచ్చ‌రించారు. అధికారంలోనూ, సీట్ల‌లోనూ చెరిస‌గం కావాల‌నేది కాపుల మ‌న‌సులో మాట‌గా హ‌రిరామ జోగ‌య్య తేల్చి చెప్పారు. ఒక‌వైపు తాను సీఎం కావాల‌ని కోరుకుంటున్న హ‌రిరామ‌జోగ‌య్య‌, మ‌రోవైపు ఆచ‌ర‌ణ సాధ్యం కాని ప్ర‌తిపాద‌న‌ల‌తో జోరీగ మాదిరిగా న‌స పెడుతున్నాడ‌ని ప‌వ‌న్ అస‌హ‌నంగా ఉన్నారు. 

ప‌దేప‌దే హ‌రిరామ‌జోగ‌య్య అధికారంలో వాటాతో పాటు సీట్ల‌లోనూ స‌మాన వాటా అడ‌గ‌డం, తద్వారా కాపుల మ‌న‌సుల్లో ఆ ర‌క‌మైన అభిప్రాయాల్ని నాటుకునేలా చేస్తూ, అందుకు విరుద్ధంగా ఏదైనా జ‌రిగితే సొంత సామాజిక వ‌ర్గం ఎదురు తిరిగేలా కాపు సంక్షేమ సేన నాయ‌కుడు చేస్తున్నార‌నే భ‌యం ప‌వ‌న్‌ను వెంటాడుతోంది.