తమకు కర్ణాటకలో అధికారం ఇస్తే మతతత్వ అతివాద సంస్థలు భజరంగ్ ధళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లపై ఆ రాష్ట్రం వరకూ నిషేధం విధిస్తామంటూ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మతతత్వ రాజకీయాలకు వేదికగా అవుతున్న కర్ణాటక విషయంలో కాంగ్రెస్ హామీ ఆసక్తిని రేపుతూ ఉంది.
అభ్యుదయ వాద రచయితలను కాల్చి చంపే కల్చర్ కూడా కర్ణాటకలో గత కొన్నేళ్లలో వెలుగు చూసింది. హిజాబ్ నిషేధం సమయంలో కాలేజీల్లో విద్యార్థుల వ్యవహారం కూడా వార్తల్లో నిలిచింది. హిజాబ్ కు మద్దతుగా నిలచే వారు అయిన, వ్యతిరేకించే వారు అయినా విద్యార్థులే అప్పుడు విద్యాలయాల్లో రచ్చ చేశారు. ఇలా కర్ణాటక మతం విషయంలో ఇలాంటి ఘర్షణాత్మక వైఖరితో వార్తల్లో నిలిచింది.
ఇలాంటి నేపథ్యంలో తమకు అధికారం ఇస్తే భజరంగ్ దళ్ మీద, దీంతో పాటు ముస్లిం రాజకీయ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాల మీద నిషేధం పెడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ హామీతో పాటు పలు రకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ తమ మెనిఫెస్టోని విడుదల చేసింది.
పలు ఉచిత పథకాలున్నాయి కాంగ్రెస్ మెనిఫెస్టోలో. ఇంటి పెద్దగా ఉండే మహిళకు నెలకు రెండు వేల రూపాయలు, ఉచిత బస్సు పాసులు, నిరుద్యోగ భృతి వంటి క్యాష్ స్కీమ్ లను కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఉచితాల కన్నా బీజేపీ ఉచితాలే గట్టిగా ఉన్నాయి. తమకు అధికారం ఇస్తే సంవత్సరానికి మూడు సిలెండర్ల గ్యాస్, రోజూ పాలు ఉచితం అని బీజేపీ ప్రకటించింది. ఇలా ఉచితాల విషయంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ దూసుకుపోతోంది.