ఒకరేమో యువతకు ఆదర్శనీయమైన క్రికెటర్. మరొకరేమో మాజీ క్రికెటర్, ఇప్పుడు ఎంపీ కూడా! అయితే వీరి తగదా మాత్రం థర్డ్ రేటెడ్ గా ఉంది. వీరికి ఒకరంటే ఒకరికి చాలా కాలంగా పడదనే పేరుంది. ఒకే సమయంలో టీమిండియా డ్రస్సింగ్ రూమ్ ను వీరు షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి 2011 ప్రపంచకప్ ఫైనల్లో బ్యాటింగ్ కూడా చేశారు. అయితే ఆ ఇన్నింగ్స్ సందర్భంగా కూడా వీరిద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించరు! అంతలా వీరి మధ్యన వైరుధ్యాలున్నట్టున్నాయి. వీరిద్దరూ ఢిల్లీ బేస్డ్ క్రికెటర్సే. అయితే కలహించుకోవడం మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి క్రమంలో తాజా ఐపీఎల్ సీజన్లో కూడా వీరి రచ్చ కొనసాగుతూ ఉంది. లక్నో జట్టు కోచింగ్ స్టాఫ్ లో పని చేస్తున్న గంభీర్ ఈ సీజన్లో ఇది వరకూ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో తమ జట్టు గెలిచే సరికి చాలా హల్చల్ చేశాడు. తనే ఆటగాడిని అయినట్టుగా గ్రౌండ్లోకి వచ్చి తను అరుస్తూ, ఆర్సీబీ ఫ్యాన్స్ ను సైలెంట్ గా ఉండమన్నట్టుగా సైగలు చేస్తూ ప్రవర్తించాడు.
సాధారణంగా క్రికెట్ కోచ్ లెవ్వరూ ఇలాంటి పనులు పెట్టుకోరు. ఇలాంటి సంప్రదాయం ఫుట్ బాల్ లో కనిపిస్తూ ఉంటుంది. సాకర్ జట్లు మేనేజర్లు ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. జెంటిమెన్ గేమ్ గా పేరున్న క్రికెట్ లో కోచ్ లు చాలా కామ్ అండ్ కంపోస్డ్ గా ఉంటారు. అయితే ఎంపీ హోదాలో కూడా ఉన్న గంభీర్ మాత్రం తనేదో విశ్వవిజయాన్ని సాధించినట్టుగా రియాక్ట్ అయ్యాడు. అదంతా కొహ్లీపై కసి అని అందరికీ తెలిసిందే.
కట్ చేస్తే ఈ సీజన్లో లక్నో వర్సెస్ బెంగళూరు రెండో మ్యాచ్ సందర్భంగా మరోసారి రచ్చ రేగింది. ఈ సారి కొహ్లీ , గంభీర్ లు ముఖాముఖిగా తిట్టుకున్నారు. వీరు తలపడిన తీరు చూస్తే.. అచ్చమైన పంజాబీ బూతులన్నీ వాడేసి ఉంటారు అనుకుంటున్నారు నెటిజన్లు. ఇలా చాలా కాలంగా తమ మధ్యన జరుగుతున్న రచ్చను వీరు కంటిన్యూ చేశారు. వీరిని ఆపడానికి మిగతా ఆటగాళ్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఒకర్నొకరు కొట్టుకోవడమే మిగిలినట్టుగా ఉంది.
ఈ నేఫథ్యంలో ఈ అంశంపై ఐపీఎల్ పాలక కమిటీ దృష్టి సారించినట్టుగా ఉంది. వీరిద్దరికీ వంద శాతం మ్యాచ్ ఫీజును కోతగా విధించింది. గంభీర్, కొహ్లీ ఇద్దరికీ ఈ ఫైన్ ను విధించింది. మరి ఈ ఫైన్ తో వీరిద్దరూ తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక మ్యాచ్ ఫీజు వీరిద్దరికీ ఒక లెక్క కాదు! అయితే ఇలాగే కొనసాగితే ఒకటీ రెండుమ్యాచ్ ల నిషేధం కూడా పడే అవకాశాలుంటాయి. కొహ్లీ సంగతేమో కానీ, గంభీర్ అయినా కాస్త తగ్గాలి. తను ఎంపీ కూడా మరి! అయితే తనే ముందుగా రెచ్చిపోవడానికి రెడీగా ఉంటాడెప్పుడూ!