క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలిస్తే రోజూ పాలు ఫ్రీ!

ఒక‌వైపు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఉచిత ప‌థ‌కాల‌పై ఎన్నిక‌ల ప్ర‌చారాల్లోనే విరుచుకుప‌డుతున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెండ్రోజుల క్రితం మోడీ మాట్లాడుతూ ఉచిత ప‌థ‌కాల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఓట‌ర్ల‌ను మోసం చేస్తున్నాయంటూ విరుచుకుప‌డ్డారు! ఉచితాల‌కు…

ఒక‌వైపు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఉచిత ప‌థ‌కాల‌పై ఎన్నిక‌ల ప్ర‌చారాల్లోనే విరుచుకుప‌డుతున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెండ్రోజుల క్రితం మోడీ మాట్లాడుతూ ఉచిత ప‌థ‌కాల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఓట‌ర్ల‌ను మోసం చేస్తున్నాయంటూ విరుచుకుప‌డ్డారు! ఉచితాల‌కు లోనుకావొద్దంటూ ఆయ‌న ఓట‌ర్ల‌కు కూడా ఉద్బోధించారు. 

క‌ట్ చేస్తే క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల మెనిఫెస్టోను విడుద‌ల చేసింది. అందులో మాత్రం ఉచిత హామీలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది రోజూ అర లీట‌రు పాలు ఫ్రీ అనే ప‌థ‌కం. క‌ర్ణాట‌క‌లో తమ‌కు అధికారం చేతికి ఇస్తే బిలో పావ‌ర్టీ లైన్ కుటుంబాల‌కు రోజుకు అర లీట‌రు పాలు ఉచితంగా అందిస్తామంటూ బీజేపీ ప్ర‌క‌టించింది. 

ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ పార్టీలు చాలా ర‌కాల ఉచిత హామీల‌ను ఇచ్చాయి కానీ, ఇలా ఇంటికి పాలు ఫ్రీ అంటూ ప్ర‌క‌టించిన పార్టీ లేదు. ఆ లోటును బీజేపీ భ‌ర్తీ చేస్తున్న‌ట్టుగా ఉంది. మ‌రి ఇది ఫ్రీ బీ కాదని భ‌క్తులు వాదిస్తారు కాబోలు. ఉచిత ప‌థ‌కాలంటూ వేరే పార్టీల‌ను భ‌క్తులు విమ‌ర్శిస్తూ ఉంటారు. మ‌రి ఇలా ఏకంగా పాలు ఫ్రీ అంటూ ప్ర‌క‌టించే ఐడియా మాత్రం కాషాయ పార్టీకే వ‌చ్చిన‌ట్టుంది.

మ‌రి క‌ర్ణాట‌క‌లో అర లీట‌రు పాలు అంటే 20 రూపాయ‌లు. అది కూడా నందిని అయితేనే. నెల‌కు ఆరు వంద‌ల రూపాయ‌లు ఒక్కో కుటుంబానికి. ఏడాదికి 7,200! ఇలా క‌ర్ణాట‌క‌లో రేష‌న్ కార్డు క‌లిగిన కుటుంబాలు బ‌హుశా ప‌దుల ల‌క్ష‌ల్లో ఉండ‌వ‌చ్చు.   పాల‌కే ఇలా ఏడాదికి ఒక్కో కుటుంబం మీద 7,200 రూపాయ‌లు. అది కూడా ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఖ‌ర్చు చేస్తే.. ఈ ఉచిత ప‌థ‌కం ఏ స్థాయికి చేరుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. విద్యార్థుల‌కు చ‌దువుల‌కో, వ్యాపారం చేసుకునే వారికి స‌బ్సిడీ కిందో ఇస్తేనే బీజేపీ ఏడుస్తోంది. మ‌రి పాల‌కు ఇవ్వాల‌నే ఐడియా మాత్రం అలాంటిలాంటిది కాదు.

అయితే బీజేపీ ఉచిత వ‌ల ఇంత‌టిలో ఆగ‌లేదు. సంవత్స‌రానికి మూడు సిలెండ‌ర్ల గ్యాస్ ఉచిత‌మ‌ట‌! అది కూడా మూడు పండ‌గ‌ల‌కు. ఒక‌టి ఉగాదికి, రెండోది వినాయ‌క చ‌వితికి, మూడోది దీపావ‌ళికి. బీపీఎల్ కుటుంబాల‌కు ఇలా ఏడాదికి మూడు సిలెండ‌ర్ల ఉచిత సిలెండ‌ర్ ఇస్తార‌ట‌. కేంద్రంలో క‌మ‌లం పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా గ్యాస్ సిలెండ‌ర్ల ధ‌ర‌లు బారీగా పెరిగాయి. ఇలాంటి నేప‌థ్యంలో గ్యాస్ ఫ్రీ అనే ప‌థ‌కం బీజేపీ విసిరిన మ‌రో ఉచిత వ‌ల‌!

ఇవిగాక ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ఉన్న ఉచిత ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తారట‌. ఇందిరా క్యాంటీన్ల‌కు పేరుమార్చి అట‌ల్ క్యాంటీన్లుగా కొన‌సాగించే హామీ కూడా ఉంది. మ‌రి ప్ర‌ధాన‌మంత్రేమో ఉచిత ప‌థ‌కాల పేర్లు విని మోస‌పోవ‌ద్ద‌ని ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. బీజేపీనేమో ఉన్న‌వాటికి తోడు పాలు, భోజ‌నం, గ్యాస్ ఫ్రీ అంటోంది.