తెలుగు సినిమాలు నూటికి నూరు శాతం ఫైనాన్స్ మీదే నిర్మిస్తారు. ఎంత పెద్ద ప్రోడక్షన్ హవుస్ అయినా సినిమా పేరు మీద ఫైనాన్స్ తీసుకుంటారు. వడ్డీ కట్టుకుంటూ వెళ్లడమే. సినిమా విడుదల వరకు ఏ ఫైనాన్షియర్ కూడా అసలు అడగరు. సినిమా విడుదల ముందు మాత్రం అస్సలు వదలరు. టాలీవుడ్ బండి సక్రమంగా నడవాలి అంటే ఫైనాన్షియర్లు ఫండింగ్ చేస్తూనే వుండాలి. లేదూ అంటే టాలీవుడ్ ఆగిపోతుంది.
ఇప్పుడు అదే జరిగింది. టాలీవుడ్ లో ఒక్క కొత్త సినిమా ప్రారంభం కావడం లేదు. హీరోలు బిజీ మాత్రమే రీజన్ కాదు. అన్నీ సెట్ అయినా కూడా ఫండింగ్ రావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎక్కువగా ధర్మవరం, పొద్దుటూరు వడ్డీ వ్యాపారుల నుంచి ఫండింగ్ వస్తుంటుంది. వారంతా ఇప్పుడు ఫండింగ్ ఆపేసినట్లు బోగట్టా.
సినిమా థియేటర్ల దగ్గర నుంచి మొదలుకోని బయ్యర్లు నిర్మాతల మీదుగా రోటేషన్ కాకపోతే సమస్యే. ఇప్పుడు అదే సమస్యతో ఫైనాన్షియర్లు ఫండింగ్ వ్యవహారాలకు పాజ్ బటన్ నొక్కారు. దాంతో తెలుగులో కొత్త ప్రాజెక్టులు అన్నీ దాదాపు ఆగిపోయాయి. రన్నింగ్ లో వున్నవి, ఫినిషింగ్ స్టేజ్ లో వున్నవి నడిపిస్తున్నారు కానీ కొత్తవి స్టార్ట్ చేయాలంటే మాత్రం కుదరడం లేదు.
టాలీవుడ్ కు గట్టిగా ఫైనాన్స్ చేయగలిగిన వారు ఆరుగురు మించి లేరు. ఇప్పుడు వీరంతా ప్రస్తుతానికి ఫండింగ్ లు ఆపేసారు. సినిమాల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా వుంది. రన్నింగ్ లో వున్న సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో, ఎప్పుడు విడుదలవుతాయో అంతా అగమ్యగోచరంగా వుంది.
2021 ద్వితీయార్థం నుంచి 2022 సమ్మర్ వరకు సినిమాలు తొడతొక్కిడిగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కొత్త సినిమాలు ప్రారంభం అయినంత మాత్రాన ఏం చేసుకోవాలి? అందుకే నిర్మాతలు కూడా కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టడానికి ముందు వెనుకలాడుతున్నారు.
అయినా కూడా కొత్త, చిన్న నిర్మాతలు ఓటిటిలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చిన్న సినిమాలు అనేకం మాత్రం చకచకా రెడీ అవుతున్నాయి.