ఏలూరు ఘటన విషయంలో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తలాతోక లేకుండా మాట్లాడటం గమనార్హం. హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనేం మాట్లాడారో కూడా తనకే అర్థం కానట్టుగా మాట్లాడారు.
ఆ ఘటనపై ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు అనేది చంద్రబాబు ప్రథమ అభియోగం. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందట! మరి ఇంతకీ ఏం జరిగిందో చంద్రబాబుకు తెలుసా?
ఒక పద్ధతి ప్రకారం పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందట! ఇప్పటి వరకూ అక్కడి వైద్యులు, పరిశీలిస్తున్న వారే ఈ మాట చెప్పడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుని అది పారిశుద్ధ సమస్య అని తేల్చారు. మళ్లీ అసలేం జరిగిందో తెలుసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిందించారు.
ఇక ప్రజారోగ్య వ్యవస్థపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ వహించలేట. ఎంతసేపూ అప్పులు చేయడం మీదే దృష్టి పెడుతోందట! అప్పుల గురించి చంద్రబాబు నాయుడే మాట్లాడాలి. ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు, అరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పులు చేస్తున్నారంటూ నిందించడం చంద్రబాబు తీరును తెలియజేస్తూ ఉంది.
ఇక ప్రజారోగ్య వ్యవస్థ జగన్ ఆధ్వర్యంలో ప్రశంసలు అందుకుంది. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశే, అలాగే కరోనా రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించింది కూడా ఏపీ మాత్రమే. పోస్ట్ కోవిడ్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కరోనా విపత్కర వేళ మండలానికి రెండు 108లను ప్రారంభించి ప్రజారోగ్య వ్యవస్థకు కొత్త ఊపిరి అందించింది జగన్ ప్రభుత్వం.
చంద్రబాబు హయాంలో ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని ఎలుకలు కొరికితే దిక్కూదివాణం లేకపోయింది. ఒక ఊర్లో వాటర్ ట్యాంక్ లోకి కోతులు పడి చనిపోయి, ఆ ఊరు ఊరు మొత్తం కొన్ని రోజుల పాటు వ్యాధులకు గురయ్యింది. ప్రతిపక్ష పార్టీ నేతగా అప్పుడు జగన్ ఆ ఊరు వెళ్లే వరకూ ప్రభుత్వం స్పందించలేదు!
అప్పటి వైద్యఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ అప్పుడు అవాకులు చవాకులు మాట్లాడారు. అక్కడ సమస్యే లేదన్నారు. తీరా వాటర్ ట్యాంక్ లో కోతుల కళేబారాలు బయట పడితే కానీ అసలు పరిస్థితి బయటపడలేదు. ఇవీ చంద్రబాబు పాలనలోని ఘనకీర్తులు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వచ్చి ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం అంటూ మాట్లాడటాన్ని ఏమనాలి? షేమ్ షేమ్ అనక?
అంతుబట్టని పరిస్థితుల గురించి కేంద్ర బృందం పరిశోధనకు రాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే లెక్చర్లు హేయంగా ఉన్నాయి.