గ్రామ, మండలస్థాయి నేతలను చేర్చుకుంటే పార్టీ గెలుస్తుందా ?

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ కాంగ్రెస్…

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ కాంగ్రెస్ ను తిట్టిపోశాక దాన్ని అవకాశంగా తీసుకొని గులాబీ పార్టీ రెచ్చిపోయింది.

వాస్తవానికి మోడీ తిట్టింది కాంగ్రెస్ ను. రాష్ట్ర విభజన విషయంలో మోడీ బీజేపీ పాత్రను ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు. ఆయనదో రాజకీయం. దేశంలో జరుగుతున్న సమస్త అనర్ధాలకు కాంగ్రెస్స్ కారణమంటాడు ఆయన. మోడీ మాట్లాడిన మాటలను కేసీఆర్ మరో రకంగా అన్వయించుకొని మోడీ తెలంగాణను అవమానించారని గాయి గత్తర లేపారు. రచ్చరచ్చ చేశారు.

బీజేపీని ఎన్నికల్లో ఓడించడానికి తెలంగాణా సెంటిమెంటును రాజేశారు. జనగామ బహిరంగ సభలో కూడా మోడీపై రెచ్చిపోయారు. మోడీని దేశం నుంచి తరిమికొడతామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారం తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీ నాయకులు మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తున్నారు.

మరో ఏడాదిలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీపై ప్రజలకు అసహ్యం కలిగే విధంగా కేంద్రం మీద, మోడీ మీద తీవ్రంగా దాడి చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీని అయోమయంలోకి నెడుతున్నారు. కేసీఆర్ సర్కారును గద్దె దింపడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే వ్యూహాలు పన్నుతోంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రంకెలు వేస్తోంది. 

కానీ టీఆరెస్ ను ఎలా ఓడించాలో రాష్ట్ర బీజేపీకి అర్ధం కావడంలేదు. గులాబీ పార్టీని గద్దె దింపాలంటే పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాలు, మండలాల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. 

టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి భారీ ప్లాన్ రచిస్తున్న బిజెపి అధినాయకత్వం గ్రామ, మండల స్థాయిలో పేరున్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని గ్రామ స్థాయిలోనే టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి బీజేపీని విస్తరింప చేయాలని ప్రయత్నిస్తోంది. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బీజేపీనే అని చూపించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ బీజేపీ.

ఒకప్పుడు బీజేపీని తేలికగా తీసుకున్న కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినప్పటి నుంచి దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టారు. బీజేపీ వల్లనే తనకు ముప్పుందని గ్రహించారు. గ్రామ, మండల నాయకులను పార్టీలో చేర్చుకుంటే పార్టీ బలోపేతమవుతుందని, తద్వారా టిఆర్ఎస్ ను ఓడించవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ లో చేరికలకు జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

తాజాగా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుసూదన్ టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక జిట్టా బాలక్రిష్ణ రెడ్డి, రాణి రుద్రమదేవి ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. కానీ వీరు రాజకీయంగా ప్రభావం చూపే నాయకులు కారు. 

గ్రామ, మండల స్థాయిలో నాయకులను చేర్చుకుంటే బీజేపీ బలోపేతమవుతుందా అనేది పెద్ద సందేహం. ఈటల రాజేందర్ తరువాత ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులెవరూ బీజేపీలో చేరలేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలోకి వలసల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.