రాజకీయాల్లోకి రావడానికి సాహసం చేసిన తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తన మార్గం ఆధ్యాత్మిక రాజకీయాలని ప్రకటించాడు. నిజానికి ఆధ్యాత్మిక రాజకీయాలనే మాట కొత్తగా వింటున్నాం. మనకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు, విద్రోహ రాజకీయాలు…ఇలాంటి రాజకీయాలు తెలుసు.
కానీ ఆధ్యాత్మిక రాజకీయాలు కొత్త మాట.రజనీ రాజకీయ పర్యవేక్షకుడిగా నియమించుకున్న తమిళారువి మణియన్ ఈమధ్య ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాటను నొక్కి చెబుతున్నారు. ఆధ్యాత్మిక రాజకీయాలంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే ద్వేష రాజకీయాలకు భిన్నంగా ఉంటాయన్నారు.
తాము ఎవరినీ నిందించబోమని స్పిరిచువల్ మార్గంలో వెళతామని చెప్పారు. ఇదే చాలామందికి అర్ధం కావడంలేదు. నిందలు, విమర్శలు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా? ఇతర పార్టీల నాయకులను బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా ద్వేషించడం, సభ్యత లేకుండా మాట్లాడటం చేయకూడదు. ఇతర పార్టీల విధానాలను, అధికార పార్టీ పాలసీలను విమర్శించవచ్చు. లోపాలను ఎత్తి చూపించవచ్చు.
ఇలా చేయడం ద్వేష రాజకీయాల కిందకు రాదు. దీనికి ఆధ్యాత్మికానికి సంబంధం ఏముంటుంది ? తమవి ఆధ్యాత్మిక రాజకీయాలంటే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమిళారువి మణియన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు ఆధ్యాత్మిక రాజకీయాలు అనేసరికి రజనీ పార్టీ బీజేపీతో అంటకాగుతుందని ఇతర పార్టీలు అభిప్రాయపడుతున్నాయేమో.
ఎందుకంటే బీజేపీవి హిందూత్వ విధానాలు కదా. రజనీ తనవి ఆధ్యాత్మిక రాజకీయాలనేసరికి బీజేపీతో దోస్తీ చేస్తాడేమో అనుకుంటున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటే బీజేపీ పట్ల తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలి.
రజనీ పార్టీ బీజేపీతో కలుస్తుందేమోనని అనుమానించడానికి మరో కారణం ఉండొచ్చు. తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడానికి ముందే పార్టీ కోసం ఇద్దరిని నియమించుకున్నాడు రజనీ.
వారిలో ఒకరు గాంధీ మక్కళ్ ఇయక్కం నాయకుడు తమిళరువి మణియన్, మరొకరు బీజేపీ మేధో విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అర్జున్ మూర్తి. మణియన్ రజనీ పార్టీ పర్యవేక్షకుడు, మూర్తి పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
దీన్నిబట్టి చూస్తే రజనీకి ఇంతకుముందే బీజేపీతో లింకులు ఉన్నాయని అర్ధమవుతోంది. ఇక రజనీ కూడా స్వతహాగా ఆధ్యాత్మికవాది. ఆయన అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళ్లి వస్తుంటారు. ఆయనకు ఓ గురువు కూడా ఉన్నారు. ఆయన హిమాలయాల్లో ఉన్నారని చెబుతారు.
రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడానికి ముందు అభిమానులతో రజనీ సమావేశమయ్యారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని వారు రజనీకి గట్టిగా చెప్పారు. సరే …రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలేమిటో తెలుసుకోవాలంటే ఆయన రంగంలోకి దిగితేగానీ అర్ధం కాదు.