బన్నీ అలవైకుంఠపురములో విడుదలై ఏడాది దగ్గర పడుతోంది. సుకుమార్ రంగస్థలం విడుదలై రెండేళ్లు ఏనాడో దాటేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో పుష్ప సినిమా తయారు కావాలి.
కానీ కరోనా గ్యాప్ నే దాదాపు తొమ్మిది నెలలు తినేసింది. మొత్తం మీద ఇలా ప్రారంభనమైందీ అంటే అలా కరోనా వచ్చి మళ్లీ లెగ్ బ్రేక్ వేసింది. సుకుమార్ డైరక్షన్ టీమ్ లో కొందరికి కరోనా రావడంతో షూట్ ను అర్థాంతరంగా ఆపేసి వెనక్కు వచ్చేసారు.
మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది క్లారిటీ లేదు. దీనికి కారణం మరేమీ కాదు. షూటింగ్ స్పాట్ లో కొద్ది మందికే కరోనా బయటపడినా, హైదరాబాద్ వచ్చిన తరువాత పరిక్షలు చేస్తే ఎక్కువ మందికే అది కూడా ముఖ్యంగా డైరక్షన్ టీమ్ వారికే కరోనా పాజిటివ్ వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా వచ్చి తగ్గిన తరువాత ఎవరైనా సరే కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పైగా టీమ్ లో రాని వారికి భయం వుంటుంది. అందువల్ల మళ్లీ ధైర్యంగా ఎప్పుడు షూటింగ్ కు వెళ్తారు అన్నది తెలియాల్సి వుంది.
అలాగే మరో సమస్య ఏమిటంటే ఆర్ఆర్ఆర్ 2021లో రాకుండా 2022 సంక్రాంతి అంటే కష్టం కావడం. పుష్ప 2021 దసరా లోగా రెడీ అవుతుందా? అన్నది అనుమానం.
ఆర్ఆర్ఆర్ కాస్తా 2021 సంక్రాంతికి రుమాలు వేస్తే మరీ కష్టం. అందువల్ల పుష్ప షూట్ ను చకచకా చేయాల్సిన అవసరం అయితే గట్టిగా వుంది.