కళావతి సాంగ్.. మైత్రీ మూవీ ‘లీకర్స్’

ఊహించని విధంగా మహేష్ బాబు సినిమా నుంచి పాట లీక్ అయింది. అదేదో బిట్ సాంగ కాదు, వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయాలనుకున్న లిరికల్ వీడియో మొత్తం సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో…

ఊహించని విధంగా మహేష్ బాబు సినిమా నుంచి పాట లీక్ అయింది. అదేదో బిట్ సాంగ కాదు, వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయాలనుకున్న లిరికల్ వీడియో మొత్తం సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో మహేష్ అభిమానుల ఆగ్రహానికి అంతులేకుండా పోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మైత్రీ మూవీ మేకర్స్ కాదని, మైత్రీ మూవీ లీకర్స్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ప్రచారాన్ని వాలంటైన్స్ డే నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా సిద్ శ్రీరామ్ పాడిన కళావతి సాంగ్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు.

అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఊహించని విధంగా లిరికల్ వీడియోను ఎవరో లీక్ చేసేశారు. యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న సాంగ్ ను ఎప్పటికప్పుడు మేకర్స్ తొలిగిస్తున్నారు కానీ, వాట్సాప్ లో ఫార్వార్డ్ అవుతున్న వీడియోను తొలిగించడం వీళ్ల తరం కావడం లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ నడుస్తోంది.

మహేష్ సిగ్నేచర్ స్టెప్

లీక్ అయిన సాంగ్ విషయానికొస్తే.. ఈ లిరికల్ వీడియో కోసం బాగానే ఖర్చు చేశారు. ఏకంగా ఓ సెట్ వేసి మరీ షూట్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్ తో పాటు అంతా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయాడు. సిద్ అయితే తెల్ల చొక్కా, పంచె కట్టు, భుజంపై కండువాతో భలే గమ్మత్తుగా ఉన్నాడు.

క్లాసికల్, వెస్ట్రన్ మిక్స్ చేస్తూ ఈ పాటను కంపోజ్ చేశాడు తమన్. “కమాన్ కమాన్ కళావతి.. నువ్వు లేకుంటే అథోగతి” అంటూ సాగే కొన్ని లిరిక్స్ పాటకు ఓ కిక్ ఇచ్చాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ లిరికల్ వీడియోలో మహేష్ వేసిన స్టెప్ మరో ఎత్తు. ఈ పాటకు సంబంధించిన సిగ్నేచర్ స్టెప్పును లిరికల్ వీడియోలో పెట్టారు. శేఖర్ మాస్టర్ ఈ స్టెప్ కంపోజ్ చేశాడు. ఈ స్టెప్ తో పాటు.. కీర్తిసురేష్ చీర కుచ్చిళ్లను మహేష్ సవరిస్తున్న స్టిల్, టోటల్ లిరికల్ వీడియోలో హైలెట్ గా మారింది.

ఇలా సాంగ్ మొత్తం లీక్ అయిపోయింది. మరి హుటాహుటిన ఈ రోజే పాటను రిలీజ్ చేస్తారా, లేక ఫిబ్రవరి 14 వరకు ఆగుతారా అనేది చూడాలి.