టీడీపీ కరపత్రిక ఈనాడు ఏది రాసినా చంద్రబాబు వేదవాక్కుగా భావిస్తారు. ఈనాడు రాసిందల్లా నిజమేనని బాబు నమ్మకం, విశ్వాసం. పంది కాదు అది నంది అని ఈనాడు రాస్తే, ఏమీ ఆలోచించకుండా చంద్రబాబు కూడా అదే అంటారు. తన దృష్టిలో ఈనాడు భగవద్గీత అని చంద్రబాబు ఓ సందర్భంలో అన్న విషయం తెలిసిందే.
తాజాగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులకు ప్రాణహాని ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. ఇదే విషయాన్ని ఓ అధికారి కేంద్రంగా ఈనాడు పత్రిక పరోక్షంగా రాసింది. ఈ కథనం అక్షరసత్యమన్నట్టు చంద్రబాబు, అవే విమర్శలు చేయడం గమనార్హం. బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఆయన ఇంటికెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాలకు ఏ విధంగా హాని కలగనుందో వివరించారు.
మొద్దు శ్రీను హత్య హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారన్నారు. దీన్ని బట్టి వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిందితులు కడప సెంట్రల్ జైల్లో ఉన్నారన్నారు. సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సాయంతో వరుణ్‌రెడ్డి రూపంలో నిందితులకు ప్రాణాపాయం పొంచి వుందని చంద్రబాబు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కడప జైలర్‌గా వరుణ్‌రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీ ముఖ్య నాయకుడు పరిటాల రవి హత్య కేసులో మొద్దు శ్రీను ప్రధాన నిందితుడు. అతన్ని చంపిన సమయంలో అనంతపురం జైలర్‌గా వరున్‌రెడ్డి ఉన్నాడని, హత్య వెనుక ఇతని ప్రోద్బలం ఉందనే అనుమానం కలిగేలా ఇటీవల ఈనాడు కథనం రాసింది.
అప్పట్లో వరుణ్‌రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని ఆ కథనం గుర్తు చేసింది. వివేకా కేసులో నిందితులున్న జైలకు వరుణ్‌రెడ్డి రావడం వెనుక మొద్దు శ్రీను ఉదంతం లాంటి కుట్రలకు తెరలేచే అవకాశాలను పరోక్షంగా ప్రస్తావించారు. ఆ పత్రిక రాసిన విషయాలనే చంద్రబాబు ఇవాళ ఆరోపించడం చర్చనీయాంశమైంది.