ఇంతకూ టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును ఏపీ సీఐడీ అధికారులు చితక్కొట్టారా? లేదా? అనేది మిస్టరీగా మారింది. అశోక్‌బాబును తప్పకుండా చితక్కొట్టి ఉంటారని తన స్వీయానుభవంతో వైసీపీ రెబల్ ఎంపీ బల్లగుద్ది మరీ చెప్పారు. అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటారనేందుకు టీడీపీ సోషల్ మీడియాతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కొన్ని అంశాలను ఉదహరించారు.
అర్ధరాత్రి అశోక్‌బాబును అరెస్ట్ చేశారంటే, ఇక తెల్లవార్లు లాఠీలతో కుళ్లపొడచడానికే వుంటుందని పచ్చ బ్యాచ్ గగ్గోలు పెట్టింది. అశోక్‌బాబు అరెస్ట్ అనంతరం 24 గంటల్లోనే బెయిల్ కూడా లభించింది. అయితే రఘురామ మాదిరిగా తనపై ఏపీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అశోక్‌బాబు ఇంకా చెప్పలేదు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇదే రఘురామ తెగ బాధపడి పోయారు.
పట్టాభిని ఈ పాటికి వీపు విమానం మోత మోదించి ఉంటారని, కాళ్లు, చేతులు వాచి పోయి వుంటాయని, ఆ దెబ్బలకు తాళలేక పట్టాభి అరిచే అరుపులకు జైలు గోడలు మార్మోగిపోయి వుంటాయని రఘురామ ఆవేదనతో చెప్పారు. కానీ పట్టాభి మాత్రం ఆ విషయంపై ఇంత వరకూ నోరు మెదపలేదు. మౌనం అర్ధంగీకారమని అర్థం చేసుకోవాలో లేక కొట్టలేదని సరిపెట్టుకోవాలో పట్టాభి మాత్రమే చెప్పాలి.
ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అశోక్‌బాబును అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం చెలరేగింది. అశోక్‌బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి వుంటారని ఎల్లో బ్యాచ్ ప్రచారం చేయడం వల్ల… ఆయనపై సానుభూతి సంగతేమో గానీ అవమానం కాదా? అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
కొట్టకపోయినా… ఎల్లో గ్యాంగ్ ప్రచారం అశోక్‌బాబుకు శోకాన్ని మిగిల్చిందనే వాళ్లు లేకపోలేదు. అసత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటో ఆ పని చేసే వాళ్లే చెప్పాల్సి వుంది.