బాబు కోసం ఐశ్వ‌ర్య‌రాయ్‌, దీపికా ప‌దుకొనే, అమితాబ్‌…!

ఇటీవ‌ల ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబును ఆకాశానికెత్త‌డంపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఆ విమ‌ర్శ‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. తాజాగా వైసీపీ…

ఇటీవ‌ల ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబును ఆకాశానికెత్త‌డంపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఆ విమ‌ర్శ‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. తాజాగా వైసీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న చంద్ర‌బాబుపై పంచ్‌లు విసిరారు.

చంద్ర‌బాబునాయుడు స్వార్థ‌ప‌రుడన్నారు. చంద్ర‌బాబు తాను మంచోడ‌ని చెప్పించ‌డానికి ఎవ‌రినో ఒక‌రిని ప‌ట్టుకొస్తుంటారన్నారు. 1999లో బీజేపీ నేత‌లు, 2014లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తాను మంచోడ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పించార‌ని గుర్తు చేశారు. అప్పుడు  అవ‌కాశం ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. 2019లో ఓడ‌గొట్టార‌న్నారు. 2024 ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, ఇప్పుడు చంద్ర‌బాబు ఎవ‌రిని అడ‌గాల‌ని బైరెడ్డి ప్రశ్నించారు. ప్ర‌ధాని మోదీ పో అని చంద్ర‌బాబును అన్న‌ట్టు పేర్కొన్నారు. బాబు గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పినా న‌మ్మ‌ర‌ని బైరెడ్డి తెలిపారు. కాంగ్రెసోళ్లు, బీజేపీ నేత‌లు చెప్పినా న‌మ్మ‌ర‌ని, తాజాగా ర‌జినీకాంత్‌ను ప‌ట్టుకొచ్చార‌ని వ్యంగ్యంగా అన్నారు.

ఇది మొద‌టి విడ‌త అట అని వెట‌క‌రించారు. రెండో విడ‌త‌లో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అమితాబ‌చ్చ‌న్‌, షారుక్‌ఖాన్‌, దీపికా ప‌ద‌కొనే త‌దిత‌రులంతా వ‌చ్చి చంద్ర‌బాబు గొప్పోడ‌ని, మ‌ళ్లీ ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతార‌ని సెటైర్స్ విసిరారు. కొంచెమైనా చంద్ర‌బాబుకు  సిగ్గుండాల‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లో తాను లేదా త‌న కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే వుండాల‌ని చంద్ర‌బాబు కోరుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచి న‌ట‌న‌కు నంది అవార్డులు ఇస్తుంటార‌న్నారు. ఆ అవార్డు కూడా బాబుకు లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే రావాల‌ట అని దెప్పి పొడిచారు.

కానీ ఒక్క విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని ఆయ‌న సూచించారు. పేద‌వాడు బాగుండాల‌ని కోరుకునే ఏకైక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే అన్నారు. కాపు సామాజిక‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం ఏ విధంగా చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌న్నారు. ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక్క‌డినీ మంచిగా దువ్వుకంటే చాలు, కాపుల ఓట్ల‌న్నీ త‌న‌కే ప‌డుతాయ‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌న్నారు. ఇదే నాయ‌కుడికి, న‌య‌వంచ‌కుడికి మ‌ధ్య ఉన్న తేడాగా బైరెడ్డి అభివ‌ర్ణించారు. 

వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో అక్క‌డ‌క్క‌డ అసంతృప్తి క‌నిపిస్తోంద‌న్నారు. కానీ వ్య‌వ‌స్థ‌లో మార్పు క‌నిపిస్తోంద‌న్నారు. దీన్ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు గ‌మ‌నంలో పెట్టుకుని మ‌రోసారి పార్టీ విజ‌యం కోసం ప‌ని చేయాల‌ని బైరెడ్డి  సూచించారు.