ఈ నెలలోనైనా సమ్మర్ సందడి కనిపిస్తుందా?

విరూపాక్ష దయ వల్ల ఏప్రిల్ లో చెప్పుకోడానికి కనీసం ఒక్క హిట్ అయినా ఉంది. కానీ సమ్మర్ పై గంపెడాశలు పెట్టుకున్న టాలీవుడ్ కు మాత్రం షాక్ తప్పలేదు. శాకుంతలం, ఏజెంట్, రావణాసుర సినిమాలు…

విరూపాక్ష దయ వల్ల ఏప్రిల్ లో చెప్పుకోడానికి కనీసం ఒక్క హిట్ అయినా ఉంది. కానీ సమ్మర్ పై గంపెడాశలు పెట్టుకున్న టాలీవుడ్ కు మాత్రం షాక్ తప్పలేదు. శాకుంతలం, ఏజెంట్, రావణాసుర సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి, టాలీవుడ్ పుట్టి ముంచాయి. ఇప్పుడు మే నెల మొదలైంది. కనీసం ఈ నెలలోనైనా సమ్మర్ బాక్సాఫీస్ కు కళ వస్తుందా?

ఈనెలలో కూడా కొన్ని మంచి సినిమాలొస్తున్నాయి. ఆల్రెడీ వాటిపై అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రామబాణం. గోపీచంద్ హీరోగా, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీతో హ్యాట్రిక్ పై కన్నేసింది ఈ హీరో-దర్శక ద్వయం. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ లాంటి భారీ తారాగణం ఉంది.

ఇలాంటిదే మరో హిట్ జోడీ కూడా మే నెలలో థియేటర్లలోకి వస్తోంది. వాళ్లే హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల. వీళ్లిద్దరూ కలిసి గతంలో నాంది లాంటి హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఉగ్రంతో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఏప్రిల్ నెలలో అఖిల్ థియేటర్లలోకి రాగా, మే నెలలో నాగచైతన్య వస్తున్నాడు. అతడు నటించిన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి షెట్టి హీరోయిన్. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, టీజర్ తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో కూడా అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి స్టార్ ప్యాడింగ్ ఉంది.

ఈ సినిమాలతో పాటు అన్నీ మంచి శకునములే, సామజవరగమన అనే మరో 2 సినిమాలు కూడా  ఈ నెల్లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని నిర్మిస్తుందనే ఇమేజ్ ఉంది స్వప్న సినిమాస్ బ్యానర్ పై. అందుకే 'అన్నీ మంచి శకునములే' సినిమాపై ఓ సెక్షన్ ఆడియన్స్ కన్నుపడింది. ఇక శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సామజవరగమన సినిమా టీజర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.

వీటితో పాటు బిచ్చగాడు 2 టైటిల్ తో విజయ్ ఆంటోనీ సినిమా కూడా వస్తోంది. ఈ మూవీస్ లో ఏది ఈ నెలలో బాక్సాఫీస్ కు కళ తీసుకొస్తుందో చూడాలి.