ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర టూర్ కి వస్తున్నారు. ఈ నెల 3న విశాఖ విజయనగరం జిల్లాల దశ దిశ మార్చేసే అనేక కీలకమైన పధకాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే పాతిక వేల మందికి ఉపాధిని ఇచ్చే అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్, విజయనగరం లోని తారకరమా సాగునీటి ప్రాజెక్ట్ ఇలా చాలా కార్యక్రమాలను ఒకేసారి పెట్టుకుని మరీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రా టూర్ కి వస్తున్నారు.
ఈ పర్యటన పూర్తిగా ఉత్తరాంధ్రాను ఫోకస్ చేయడానికి కూడా వైసీపీ వాడుకుంటోంది. విశాఖ విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ మీద టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు సహా వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా గతంలో తాము శ్రీకారం చుట్టినవే అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. కొత్తవేమీ కావని కూడా ఎద్దేవా చేస్తున్నారు. అంటే టీడీపీలో ఈ రకమైన రాజకీయ హైరానా అయితే బిల్డప్ అయిందనే అంటున్నారు.
ఇపుడు చూస్తే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కూడా జగన్ తో పాటే ఉత్తరాంధ్రా టూర్ కి రెడీ అయ్యారని అంటున్నారు. జగన్ ఇలా వచ్చి వెళ్లగానే వారం వ్యవధిలో చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ కి ప్లాన్ చేస్తునారు. ఈ నెల 10, 11 తేదీలలో ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. అదే విధంగా ఈ నెల 17న ఆయన విశాఖ జిల్లా టూర్ కి మరోసారి రానున్నారు.
అంటే ఒకే నెలలో రెండు సార్లు చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనలకు వస్తున్నారని తెలుస్తోంది. జగన్ పర్యటనను వచ్చే పొలిటికల్ మైలేజిని పూర్వపక్షం చేయడానికి టీడీపీని బలోపేతం చేయడానికి బాబు చేస్తున్న టూర్లుగా వీటిని చూస్తున్నారు. అటు జగన్ ఇటు చంద్రబాబు టూర్లతో ఉత్తరాంధ్రా రాజకీయం వేడెక్కుతోంది అనే చెప్పాలి.