చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపిస్తూ ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. అందులో దాదాపు 15-20 ఏళ్ల కిందటి చిరంజీవిని దర్శకుడు బాబి ఆవిష్కరించాడు. ముఠామేస్త్రి లాంటి సినిమాల్ని గుర్తుకుతెచ్చాడు. మాస్ లుక్ లో చిరంజీవి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అలాంటిదే మరో వింటేజ్ లుక్ వచ్చింది. ఈసారి రౌడీ అల్లుడు సినిమాను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
భోళాశంకర్ సినిమా నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజైంది. తాజాగా మరో లుక్ రిలీజ్ చేశారు. ఇది ట్యాక్సీ డ్రైవర్ లుక్. మే డే సందర్భంగా ఈ ఫొటోల్ని విడుదల చేసింది యూనిట్. ఈ స్టిల్స్ ఇలా బయటకొచ్చాయో లేదో అలా రౌడీ అల్లుడితో కంపారిజన్ మొదలైంది.
చిరంజీవి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి రౌడీ అల్లుడు. అందులో ఆటో డ్రైవర్ గా చిరంజీవి మాస్ లుక్, యాక్టింగ్ ఎవర్ గ్రీన్. అప్పట్లో ఆటో పై సిగరెట్ తాగుతూ, ఆటో పక్కన జల్సాగా నిల్చొని చిరంజీవి ఉన్న పోస్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. అప్పట్లో చాలామంది ఆ పోస్టర్లు తీసుకెళ్లి, ఇంట్లో అతికించుకున్నారు. దాదాపు ఆ ఫీల్ అండ్ లుక్ ను భోళాశంకర్ తాజా పోస్టర్లతో అందించారు.
కాకపోతే ఈసారి చిరంజీవి సిగరెట్ వెలిగించలేదు. చేతిలో గరమ్ ఛాయ్ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఇందులో కూడా చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే వాల్తేరు వీరయ్యలా ఇది స్ట్రయిట్ సినిమా కాదు. భోళాశంకర్ అనేది రీమేక్ మూవీ. అయినప్పటికీ అందులో వింటేజ్ చిరంజీవిని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మెహర్ రమేష్.
తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 11న భోళాశంకర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.