ఎంజీఆర్ అవుతాడా? చిరంజీవి అవుతాడా?

త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మ‌రోసారి స్పందించారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఇది వ‌ర‌కే త‌ను రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా, వ‌చ్చేసిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ప్ర‌క‌టించుకోవాల్సి…

త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మ‌రోసారి స్పందించారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఇది వ‌ర‌కే త‌ను రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా, వ‌చ్చేసిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ప్ర‌క‌టించుకోవాల్సి వ‌స్తోంది! రాజ‌కీయాల్లోకి రావ‌డం ప‌ట్ల ర‌జ‌నీకాంత్ త‌ట‌ప‌టాయింపులు ఈనాటివి కావు. 

గ‌త ఇర‌వై యేళ్ల నుంచి ఉన్న‌వే! ఎందుకో ఈ మ‌ధ్య ర‌జ‌నీకాంత్ కు రాజ‌కీయాల్లోకి రావడం ప‌ట్ల మ‌రి కాస్త ఉత్సాహం పెరిగింది. అయితే ఆ ఉత్సాహ‌మే కాదు, ఆయ‌న‌లో నిర్వేదం కూడా ఉంది! అందుకే త‌ట‌ప‌టాయింపులు కొన‌సాగుతూ ఉన్నాయి.

ఈ మ‌ధ్య‌నే త‌న ఆరోగ్యం దృష్ట్యా రాజ‌కీయాల్లోకి రాలేక‌పోవ‌చ్చ‌ని ర‌జ‌నీకాంత్ చెప్పిన‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ఒక లేఖ వైర‌ల్ గా నిలిచింది. ఆ లేఖ‌లోని అంశాల‌ను ర‌జ‌నీకాంత్ కూడా ధ్రువీక‌రించారు. త‌న‌కు కిడ్నీ మార్పిడి ఆప‌రేష‌న్ జ‌రిగిన‌ట్టుగా, కోవిడ్-19 ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎక్కువ‌గా జ‌నం మ‌ధ్య‌కు రావొద్ద‌ని వైద్యులు సూచించిన‌ట్టుగా ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా కూడా చెప్పారు.

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. అలాగే కోవిడ్ ప‌రిస్థితులు కూడా ఇప్పుడ‌ప్పుడే చ‌క్క‌బ‌డేలా లేవు. రాజ‌కీయాలు అంటే.. జ‌నం మ‌ధ్య‌కు రాకుండా చేయ‌గ‌లిగేవి కావు! జ‌నం మ‌ధ్య‌కు వ‌స్తే కోవిడ్ భ‌యం ఉండ‌నే ఉంది. రానున్న మూడు నాలుగు నెల‌ల్లో కూడా ఆ భ‌యాలు పోతాయా? అనేది సందేహ‌మే! ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ప్ర‌క‌టించిన ర‌జ‌నీకాంత్.. ధైర్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తారా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే!

అస‌లు ఈ ప్ర‌క‌ట‌న‌కు అయినా క‌ట్టుబ‌డ‌తారా?

ఇదే ర‌జ‌నీకాంత్ తాజా ప్ర‌క‌ట‌న త‌ర్వాత వ్య‌క్తం అవుతున్న పెద్ద సందేహం. ఇది వ‌ర‌కే త‌ను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా, వ‌చ్చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించిన ర‌జనీకాంత్ ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌క‌ట‌నే ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? అనే అంశంపై అంద‌రికీ స్ప‌ష్ట‌త ఉంది. 

ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ మీద ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ర‌జ‌నీకాంత్ ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. అయితే ఇది వ‌ర‌కే రాజకీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించి, ఆ త‌ర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేప‌ట్ట‌ని ర‌జ‌నీ.. ఇప్పుడు అయినా చేసిన ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డ‌తారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ జ‌న‌వ‌రిలో ఉంటుంద‌నేది తాజా ప్ర‌క‌ట‌న సారాంశం. జ‌న‌వ‌రికి ఇంకా స‌మ‌యం ఉంది. 25 రోజుల వ‌ర‌కూ స‌మ‌యం ఉంది. మ‌రి అంత‌లోపు ర‌జ‌నీకాంత్ మ‌న‌సు మ‌ళ్లీ మారినా మారుతుందేమో అని ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు!

అలాగే మ‌రో సెటైర్ ఏమిటంటే.. జ‌న‌వ‌రి అని ర‌జ‌నీకాంత్ అన్నారు కానీ, అది ఏ సంవ‌త్స‌రంలోనో చెప్ప‌లేదంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు! వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రా.. లేక ఆపై వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రా.. అంటూ కొంద‌రు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

ఇలాంటి వ్యంగ్యానికి ఆస్కారం ఇచ్చిందంతా ర‌జ‌నీకాంతే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయాల్లో ఎంట్రీ ప‌ట్ల ఒక అడుగు ముందుకు  రెండు అడుగుల వెన‌క్కు వేయ‌డం వ‌ల్ల ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌ట‌న‌లు ఈ త‌ర‌హా వ్యంగ్యానికి కారణంగా నిలుస్తున్నాయి.

అంతా బీజేపీ డైరెక్షన్లోనే?

ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ ద‌క్షిణాది వైపు చూస్తోంది. అందులో భాగంగా తెలంగాణ మీద ముందుగా దృష్టి పెట్టింది. ఆ త‌ర్వాత బీజేపీకి ఎక్కువ వ్యాక్యూమ్ క‌నిపిస్తున్న‌ది త‌మిళనాడులోనే! అందుకోసం ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఉంది బీజేపీ. అయితే.. ద్ర‌విడ భావాజాలం ఇప్ప‌టికీ గ‌ట్టిగా ఉన్న త‌మిళ‌నాట బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌డం లేదు. 

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేను బీజేపీ వాళ్లే ఢిల్లీ నుంచి న‌డిపిస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. అన్నాడీఎంకేపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. దానికంటూ క్యాడ‌ర్ ఉన్నా.. ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్లినా.. ఆ వ్య‌తిరేక‌త‌లో క‌మ‌లం కూడా చిత్త‌వుతుంది. 

ఈ నేప‌థ్యంలో బీజేపీకి ర‌జ‌నీకాంత్ ఆశాకిర‌ణంలా క‌నిపిస్తూ ఉన్నాడు. అందుకోసం ర‌జ‌నీని ఇన్నాళ్ల‌కు స‌మాయ‌త్తం చేయ‌గ‌లుగుతున్న‌ట్టుగా ఉంది బీజేపీ. ఇన్నాళ్లూ త‌మిళ‌నాట బీజేపీ స‌ల‌హాదారుగా ప‌ని చేసిన వ్య‌క్తే ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న ఇప్పుడు క‌నిపిస్తూ ఉండ‌టంతో.. సూప‌ర్ స్టార్ పొలిటిక‌ల్ పార్టీ పూర్తిగా బీజేపీ డైరెక్ష‌న్లోనే అనే స్ప‌ష్ట‌త వ‌స్తోంది!

తొలి ఎంట్రీలోనే పొత్తులతో ప‌ని జ‌ర‌గుతుందా?

ర‌జ‌నీకాంత్ ను ముందు పెట్టి.. వెనుక‌వైపు తాముండి.. ప‌ల్ల‌కిని అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల‌తో మోయించాల‌నేది బీజేపీ వ్యూహం కావొచ్చు. ర‌జ‌నీకాంత్ పార్టీ, బీజేపీ, అన్నాడీఎంకేలు పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లొచ్చు. అన్నాడీఎంకే వాళ్లు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించుకున్నారు. ఆ ప్ర‌క‌ట‌న‌కు బీజేపీ ఎంత వ‌ర‌కూ విలువ‌ను ఇస్తుందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

బీజేపీ నేత‌లు చెప్పిన‌ట్టుగా విన‌డం త‌ప్ప అన్నాడీఎంకే వాళ్లు చేయ‌గ‌లిగింది కూడా ఏమీ లేదు. బీజేపీని ధిక్క‌రిస్తే అన్నాడీఎంకే నేత‌ల‌ను అవినీతి కేసుల్లో జైలుకు పంప‌డం క‌మ‌లం వాళ్ల‌కు పెద్దది కాదు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని బీజేపీ ప్ర‌తిపాదిస్తే అన్నాడీఎంకే కూడా అధికారం పంచుకోవ‌డానికి అయినా సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది.

పొలిటిక‌ల్ గా ఈ గేమ్ బాగానే క‌నిపిస్తోంది కానీ.. ప్ర‌జ‌లు ఆమోదిస్తారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ర‌జ‌నీకాంత్ రాజకీయాల్లోకి వ‌స్తే త‌మిళులు ఆహ్వానించ‌వ‌చ్చు. అయితే.. బీజేపీ డైరెక్ష‌న్లో ఆ పార్టీతో పొత్తుతోనో లేక అన్నాడీఎంకేతో పొత్తుతోనో ర‌జ‌నీకాంత్ వ‌స్తే.. కొత్త సీసాలోకి పాత సారా పోసిన‌ట్టుగానే ఉంటుంది. అప్పుడు ఆ కూట‌మిపై ప్ర‌జ‌ల‌కు విర‌క్తి వ‌చ్చినా రావొచ్చు!

డీఎంకే అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తారా?

లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో డీఎంకే కూట‌మి త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది. జ‌య‌ల‌లిత, క‌రుణ లేకుండా జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్టాలిన్ నాయ‌క‌త్వంలోని డీఎంకే భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 

అదే ఊపులో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ నెగ్గి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కావాల‌ని స్టాలిన్ భావిస్తున్నాడు. బ‌హుశా ఆయ‌న సీఎం అయిపోయిన‌ట్టే అనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ ఎంట్రీతో స్టాలిన్ అవ‌కాశాలు దెబ్బ‌తింటాయా? అనేది మ‌రో చర్చ‌నీయాంశం.

ఎంజీఆర్ అవుతారా?  మిగ‌తా హీరోల్లా మిగులుతారా?

ఇప్ప‌టికే ద‌క్షిణాదిన అనేక మంది స్టార్ హీరోలు రాజ‌కీయ పార్టీలు ఏర్పాటు చేసి జ‌నం మ‌ధ్య‌కు వెళ్లారు. వారిలో కొంద‌రు ముఖ్య‌మంత్రులు కాగా.. మ‌రి కొంద‌రు అనామ‌కులుగా మిగిలిపోయారు. మ‌రి కొంద‌రు మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోయారు.

ముఖ్య‌మంత్రి అయిన మొద‌టి స్టార్ హీరో ఎంజీఆర్. త‌మిళ‌నాడులో ప్రస్థానం సాగించిన వారే. ఆయ‌న స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మ‌రో స్టార్ హీరో ఎన్టీఆర్. ఈయ‌న కూడా ఎంజీఆర్ స్థాయి స‌క్సెస్ ను సాధించారు. అయితే ఎంజీఆర్ ఒక్క‌సారి సీఎం అయ్యాకా మ‌ళ్లీ త‌మిళుల చేత తిర‌స్కారం పొంద‌లేదు. 

కానీ ఎన్టీఆర్ తొలి ఐదేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తిచేసిన త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లోనే ఓట‌మి పాల‌య్యారు. స్వ‌యంగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు ఎన్టీఆర్. చ‌రమాంకంలో మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా గెలిచినా.. ఆయ‌నను సొంత వాళ్లే దించేశారు.

ఇక ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగునాట చిరంజీవి, ఎంజీఆర్ స్పూర్తితో త‌మిళ‌నాట విజ‌య‌కాంత్ లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వీరిద్ద‌రూ అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయారు. చిరంజీవి కొన్ని నెల‌లు మాత్ర‌మే పార్టీని నిల‌బెట్టుకోగ‌లిగారు. 

చివ‌ర‌కు చేత‌గాక ఎంపీ ప‌ద‌విని తీసుకుని పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. విజ‌య్ కాంత్ ఒక‌సారి త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా నిలవ‌గ‌లిగారు. కానీ.. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ప్ర‌జ‌ల అండాదండా ల‌భించ‌లేదు. ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు.

త‌మిళ‌నాట ఇంకా శ‌ర‌త్ కుమార్ త‌దిత‌ర హీరోలు కూడా పార్టీలు పెట్టారు కానీ, వారి ప్ర‌భావం అంతంత మాత్ర‌మే. ఇప్ప‌టికే మ‌రో స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ఒక పార్టీని ఏర్పాటు చేశారు. లెఫ్టిస్టు భావ‌జాలంతో ప‌ని చేస్తున్న క‌మ‌ల్ కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రెండు మూడు శాతం వ‌ర‌కూ ఓట్ల‌ను పొందిన‌ట్టుగా ఉంది క‌మ‌ల్ పార్టీ. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా దాని రాణింపుపై పెద్ద‌గా అంచ‌నాలు ఏమీ లేవు!

ఇక తెలుగునాట ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఈయ‌న కూడా క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయారు ప‌వ‌న్. సినిమాలు చేస్తూ.. విరామాల్లో రాజ‌కీయాలు చేస్తున్న ప‌వ‌న్ ను ప్ర‌జ‌లు సీరియ‌స్ ప్లేయ‌ర్ గా భావించ‌డం లేదు.

ర‌జ‌నీకాంత్ కు కూడా ఇప్పుడు చేతిలో కొన్ని సినిమాలున్న‌ట్టుగా ఉన్నాయి. బ‌హుశా అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ రాజ‌కీయం చేసి, ఎన్నిక‌లు అటో ఇటో అయ్యాకా.. మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటారేమో!