రైతులు చెప్పిన‌ట్టు మోడీ ప్ర‌భుత్వం చేయాల్సిందే, మ‌రో మాట లేదు!

ప్ర‌భుత్వాలు కొత్త‌గా రైతుల‌ను ఉద్ధ‌రించేది ఏమీ లేదు. కొత్త చ‌ట్టాలు, కొత్త న్యాయాలు చేసి రైతుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్ట‌కుండా క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న విధానాల‌ను అనుస‌రించి రైతుల కోరిక‌ల‌ను మ‌న్నించాలి. దేశ…

ప్ర‌భుత్వాలు కొత్త‌గా రైతుల‌ను ఉద్ధ‌రించేది ఏమీ లేదు. కొత్త చ‌ట్టాలు, కొత్త న్యాయాలు చేసి రైతుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్ట‌కుండా క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న విధానాల‌ను అనుస‌రించి రైతుల కోరిక‌ల‌ను మ‌న్నించాలి. దేశ రాజ‌ధానిలో రైతుల ఆందోళ‌న విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం క‌చ్చితంగా దిగి రావాలి. 

తాము తెచ్చిన కొత్త వ్య‌వ‌సాయ విధానాల ద్వారా రైతుల‌ను ఉద్ధ‌రిస్తామ‌ని మోడీ చెబుతున్నారు. అయితే మోడీ ఇప్ప‌టికే దేశాన్ని చాలా ర‌కాలుగా ఉద్ధ‌రిస్తున్నారు. ఆయ‌న పాల‌న‌లో భక్తులు పార‌వ‌శ్యంతో ఉన్నారు. వారు ప‌ర‌వశిస్తే చాలు. ప్ర‌త్యేకంగా రైతుల‌ను ఇప్పుడు పార‌వ‌శ్యానికి గురి చేయాల్సిన అవ‌స‌రం లేదు. 

కొత్త విధానాలు వ‌ద్దు అని రైతులు ఖ‌రాఖండిగా చెబుతున్నారు. కాబట్టి వారిని ప్ర‌భావితం చేసే విధానాల‌ను తీసుకొచ్చే హ‌క్కు మోడీ ప్ర‌భుత్వానికి లేదు. కేవ‌లం పార్ల‌మెంట్ లో బ‌లం ఉంది కాబట్టి.. రైతులు వ్య‌తిరేకించినా వారి విష‌యంలో తాము చేయాల‌నుకున్న చ‌ట్టాల‌ను చేస్తామంటే అందుకు ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌య్యే ప‌ర్యావ‌స‌నాల‌ను మోడీ ప్ర‌భుత్వం ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే దేశంలో అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను పూర్తిగా కార్పొరేట్లు శాసిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు ఏవైనా కొత్త నియ‌మాల‌ను, చ‌ట్టాల‌ను చేస్తున్నాయంటే.. అందులో ఏ కార్పొరేట్ సంస్థ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి త‌ప్ప‌.. సామాన్యుల ప్ర‌యోజనాల‌తో చ‌ట్టాలు ముడిప‌డుతున్నాయంటే ఎవ్వ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు రైతుల ప‌రిస్థితి అదే. మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన వ్య‌వ‌సాయ విధానాల వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం జ‌రుగుతుంది.. అవి స‌వ్యంగా లేవు అని రైతులు స్ప‌ష్టం చేస్తున్నారు.

మూముల‌గా అయితే మోడీ భ‌క్తులు వారిని స‌హించే వారు కాదు. ఆల్రెడీ అప‌ర‌మేధావి కంగ‌నా ర‌నౌత్ లాంటి వాళ్లు త‌మ చెత్త ట్వీట్ల‌తో వారిని అవ‌మానిస్తున్నారు. రైతుల రూపంలో ఆందోళ‌న చేస్తున్న వారు వంద రూపాయ‌ల కూలీకి వ‌చ్చిన వారంటూ ట్వీట్లు వేసి వీరు భ‌క్తుల చేతికి ఆయుధాలు అందించే ప్ర‌య‌త్నం చేశారు. 

అలాగే ద‌ళారులు రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని, ద‌ళారుల ప్ర‌యోజ‌నాల కోసం కొంత‌మంది రోడ్డెక్కార‌నే ప్ర‌చారాన్నీ బీజేపీ అనుకూల వాదులు చేశారు. అయితే.. అది కూడా అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయింది.

ఎవ‌రో డ‌బ్బులిస్తామంటేనో, ద‌ళారుల కోస‌మో రోజుల త‌ర‌బ‌డి ఆ చ‌లికి, ఆక‌లికి  త‌ట్టుకుని, క‌రోనా భ‌యాల్లోనూ అలా రైతులు రోడ్డు మీద‌కు వ‌స్తారా?  కేవ‌లం మోడీని స‌మ‌ర్థించ‌డానికి రైతుల‌ను అవ‌మానించడానికి, రైతుల‌ను ఆందోళ‌న‌ను త‌క్కువ చేయ‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ అతిభ‌క్తి ఎవ‌రికి ప్ర‌యోజ‌న క‌ర‌మో అలాంటి నింద‌లేసే వాళ్లు కాస్త ఆలోచిస్తే మంచిది.

ఇక రైతుల‌ను మిస్ గైడెడ్ అంటూ మ‌రి కొంత‌మంది ఉచిత సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రైతులు మిస్ గైడెడ్ కాదు, ఇలాంటి వాళ్లే మిస్ గైడెడ్. ప్ర‌భుత్వాలు తెచ్చే చ‌ట్టాలు మాట‌ల్లో ఎలా ఉంటాయో, అమ‌ల్లో ఎలా ఉంటాయో దేశంలో ఎవ‌రికీ తెలియ‌నిది కాదు. నేత‌ల మాట‌ల్లో, మీడియా రాత‌ల్లో తీయ‌గా ఉండే చాలా వ్య‌వ‌హారాలు.. ప్ర‌జ‌ల‌ను మాత్రం ముప్పుతిప్ప‌లు పెడుతూ ఉంటాయి. నూటికి 90 శాతం వ్య‌వ‌హారాలూ ఇండియాలో అలాగే ఉంటాయి. 

చ‌ట్టాలు ఉన్నా ప‌ని చేయ‌వు, ప‌నికొచ్చే చ‌ట్టాలు ఉండ‌వు. కాబ‌ట్టి.. కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల్లోని లోతెంతో అనుభవించే రైతుల‌కే తెలుస్తుంది. కాబ‌ట్టి.. వారి మానాన వారిని వ‌దిలేస్తే మోడీకే మంచిది. ఉన్న వాటిని ఉన్న‌ట్టుగా వ‌దిలేస్తే..ఈ దేశంలో ప్ర‌జ‌లే త‌మ మ‌నుగ‌డ‌ను తాము సాగిస్తారు. రైతుల ఆందోళ‌న‌ను దృష్టిలో ఉంచుకుని, వారు కోరిన‌ట్టుగా చేయ‌డ‌మే మోడీ  ప్ర‌భుత్వం ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.

పవన్ మనసులో వున్నది ఆయనేనా?