గ్రేటర్ విశాఖపట్నం కార్పోరేషన్ మీద ఎగరబోయే జెండా ఎవరిది అన్న చర్చ అపుడే రాజకీయ వర్గాలలో వస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికలు వచ్చే ఏడాది జరగడం ఖాయం. అలా కనుక అనుకుంటే గట్టిగా సమయం కూడా లేదు. గ్రేటర్ విశాఖను గెలుచుకోవాలని అటు అధికార వైసీపీ గట్టి పట్టుదల మీద ఉంది. అదే సమయంలో టీడీపీ కూడా విశాఖ నగరంపైన తనకు ఉన్న పట్టును మరోమారు నిరూపించుకోవాలని చూస్తోంది.
విశాఖలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లను గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో, ఎమ్మెల్యేల తీరు ఎలా ఉన్నా క్షేత్ర స్ధాయిలో పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ఇక అధికార వైసీపీది విశాఖ కోటను ఎలాగైనా కొట్టాలన్నది కోరిక.
2014 నుంచి చూసుకుంటే విశాఖ నగరం ఎపుడూ వైసీపీకి ఓటమినే బహుమతిగా ఇస్తోంది. దాంతో ఈసారి ఆ తలరాతను మార్చాలన్న కసి అయితే అధికార పార్టీ పెద్దలలో ఉంది. కానీ విశాఖ సిటీ వరకూ చూసుకుంటే మాత్రం నాయకత్వ లోపం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
విశాఖ పార్లమెంట్ అధ్యక్షునిగా వంశీకృష్ణను పార్టీ నియమించింది. ఆయన గతంలోనూ ఈ బాధ్యతలను నిర్వహించారు. కానీ ఆయన చురుకైన పాత్రను నిర్వహించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయననే మేయర్ అభ్యర్ధిగా కూడా వైసీపీ అనధికారికంగా నిర్ణయించింది. విశాఖ నగరంలో యాదవ సామాజికవర్గం అధికంగా ఉంది.
దాంతో ఆ సామాజికవర్గానికి చెందిన వంశీని బరిలోకి దించడం ద్వారా గణనీయమైన లాభాన్ని పొందాలన్నది వైసీపీ ఎత్తుగడ. కానీ గ్రేటర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడంలేదు. పరోక్షంగా జరిగే ఎన్నికలలో ముందుగా కార్పోరేటర్‌గా గెలవాలి.
ఆ విధంగా వంశీ కేవలం తాను పోటీ చేసిన డివిజన్ వరకూ ప్రభావం చూపించగలరని, మొత్తం విశాఖ అంతా యాదవులు వైసీపీ వైపు కదిలేలా సరైన వ్యూహం రూపొందించాల్సి ఉందని పార్టీలో చర్చ అయితే ఉంది.
మరో వైపు చూసుకుంటే యాదవులు టీడీపీకి దశాబ్దాలుగా మద్దతుగా ఉన్నారు. అచ్చం వైసీపీ ఫార్మూలానే టీడీపీ కూడా గ్రేటర్ విశాఖలో అమలుచేస్తోంది. ఆ పార్టీ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను విశాఖ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించింది.
ఇక, ఆయననే మేయర్ అభ్యర్ధిగా చేయాలన్నది టీడీపీ వ్యూహం. దాంతో ఇపుడు సామాజికవర్గ సమీకరణలపరంగా చూసుకున్నా వైసీపీ టీడీపీల మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది మార్చి అంతానికి గ్రేటర్ విశాఖ ఎన్నికలు పూర్తి అయ్యేవి.
అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చి నిండా ఏడాది కూడా కాలేదు. ఆ జోష్ అలాగే ఉంది. కార్యకర్తలలో కూడా హుషార్ ఉంది. కచ్చితంగా గెలిచి తీరుతామన్న పట్టుదల కూడా కనిపించింది. ఎపుడైతే గ్రేటర్ ఎన్నికలు వాయిదా పడ్డాయో నాటి నుంచే కార్యకర్తలు పూర్తి నిరాశలో పడిపోయారు.
స్ధానిక ఎన్నికలు పూర్తి అయితేనే కానీ నామినేటెడ్ పదవులు పందేరం లేదన్నది కూడా కచ్చితమైన నిర్ణయంగా అధినాయకత్వం పెట్టుకోవడంతో మరింతగా వైసీపీ శ్రేణులు దిగాలుపడ్డాయి. చూస్తూండగానే పది నెలలు గడచిపోయాయి. ఈలోగా ఎన్నో మార్పులు కూడా రాజకీయంగా కూడా వచ్చేశాయి.
విశాఖ రాజధాని అవుతుందని మార్చి నాటికి అందరికీ ఉన్న గట్టి నమ్మకం. ఇపుడు చూస్తే ఆ వివాదం న్యాయ స్ధానాలలో ఉంది. దాంతో, విశాఖ రాజధాని అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముందుకు దూసుకుపోతున్నా అభివృద్ధిపరంగా ఇంకా అడుగులు ముందుకు పడలేదు.
విశాఖ ప్రగతికి సంంధించి కచ్చితమైన కార్యాచరణ సిద్ధంగా ఉన్నా ఆచరణ అన్నది ముఖ్యం. దాని మీదనే నగర వాసులలో కూడా చర్చ సాగుతోంది. విశాఖలో ఇప్పటికీ చూసుకుంటే టీడీపీ బలమైన పార్టీగా ఉంది. ఎమ్మెల్యేలు పార్టీతో ఉండవచ్చు.
ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వవచ్చు కానీ, చెక్కుచెదరని క్యాడర్ టీడీపీకి శ్రీరామరక్షగా ఉంది. వారే రేపటి ఎన్నికలలో వైసీపీకి గట్టి పోటీ ఇస్తారని కూడా అంటున్నారు. ఇక చూసుకుంటే వైసీపీకి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అధికార పార్టీలో చేరడం శుభ పరిణామంగానే చూస్తున్నారు. ఆయన బలమైన నేత కావడంతో అక్కడ ఎక్కున డివిజన్లు వైసీపీ వైపు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మౌనంగా ఉండడం కూడా వైసీపీకి కొంతమేర అనుకూలించేదే. అక్కడ అసలైన ఎమ్మెల్యేగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కెకె రాజు ఉన్నారు. దాంతో ఉత్తరంలోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారు.
తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు బలమైన నాయకుడు. దాంతో, తూర్పులో అటు టీడీపీ, ఇటు వైసీపీల మధ్య ెరాెరీ పోరు ఉంటుంది. అయితే వైసీపీ మేయర్ అభ్యర్ధి తూర్పునకు చెందినవారే కావడంతో ఆ ప్రభావం గట్టిగా ఉంటే సగానికి సగమైన డివిజన్లు వైసీపీ పరం అవుతాయని ఓ అంచనా ఉంది.
ఇక, విశాఖ పశ్చిమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు బలం ఉంది. ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ దూకుడు చూపిస్తున్నా కూడా ఇక్కడ పోటాపోటీగానే వాతావరణం ఉంటుందని అంటున్నారు. గాజువాకలో చూసుకుంటే అక్కడ టీడీపీ అధ్యక్షుడు ఉన్న నియోజకవర్గం. పైగా. మాజీ ఎమ్మెల్యే కూడా. దాంతో, ఇక్కడ కూడా టీడీపీ, విపక్షాలు గట్టిగానే పోరాడుతాయని అంటున్నారు.
ఇక పెందుర్తి, అనకాపల్లిలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా మార్చి నాటి సానుకూల వాతావరణం అధికార పార్టీకి ఇపుడు లేదన్నది ఓ కచ్చితమైన అభిప్రాయంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు కనుక జరిగితే వైసీపీకి టీడీపీ నుంచి గట్టి పోటీ అన్నది తప్పదు అంటున్నారు.
అదే సమయంలో వైసీపీలో ఉన్న అసంతృప్తులను ఇప్పటి నుంచి చల్లార్చుకోకపోతే 99 సీట్లు ఉన్న గ్రేటర్ విశాఖలో మేయర్ పీఠం గెలవడానికి వైసీపీ చాలానే కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే పార్టీని పటిష్టం చేసుకోకపోతే అధికార పార్టీకి గ్రేటర్ ఎన్నికలు అగ్ని పరీక్షనే తెచ్చిపెడతాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి.