తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టేకలకు సాహసం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల సముద్రంలోకి దూకేశారు. సస్పెన్‌కు తెర దించేశారు. ఈమధ్యనే తన అభిమానులతో, రజనీ మక్కళ్ మండ్రం బాధ్యులతో సమావేశం నిర్వహించిన రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై ఎటూ తేల్చకుండా అభిమానులకు నిరాశ కలిగించారు. కాని ఏం మాయ జరిగిందోగాని ఉన్నట్లుండి ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానోచ్’ అని ప్రకటన చేసేశారు. ప్రజల కోసం ప్రాణాలు ఇస్తానన్నారు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. ‘కొత్తగా మతం పుచ్చుకున్నవారికి నామాలెక్కువ’ అనే సామెత మాదిరిగా కొత్తగా పార్టీ పెడుతున్న రజనీ కూడా తమిళ రాజకీయాలను సమూలంగా మారుస్తానన్నారు. నీతి నిజాయితీ వంటి పెద్ద మాటలు చెప్పారు.
ఆయన ఇంకో మాట కూడా ఉపయోగించారు. అదే…‘ఆధ్యాత్మిక రాజకీయాలు’. మనకు నేర రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, విద్రోహ రాజకీయాలు…ఇలాంటివన్నీ తెలుసు. కానీ ఆధ్యాత్మిక రాజకీయాలేమిటి? ఈ మాట కొత్తగా వింటున్నాం. అసలు ఆధ్మాత్మికం, రాజకీయాలనే కత్తులు ఒక ఒరలో ఇముడుతాయా? ఆధ్యాత్మికం అనేది లౌకిక ప్రపంచానికి అతీతమైంది కదా. ఆధ్యాత్మికంతో రాజకీయాలు చేయవచ్చా? ఈ ప్రశ్నకు మనం చేయవచ్చని సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో కాషాయ వస్త్రాలు కట్టుకునే సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధ్వీమణులు ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేశారు. మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు అలంకరించారు. జిత్తులమారి రాజకీయాలు నడిపారు.
అయితే ఇలాంటివారంతా మతతత్వవాదులు తప్ప ఆధ్యాత్మికవాదులు కారు. రజనీ ఈ కోవకు చెందడు. ఆయన బేసిగ్గా సినిమా హీరో అయినప్పటికీ ఆయనలో ఓ ఆధ్యాతికవాది కూడా ఉన్నాడు. ఆయనకో ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు. రజనీ అప్పుడప్పుడు అంటే సినిమా రంగంలో విసుగు చెందినప్పుడో , ఈ లౌకిక ప్రపంచంలో పడి కొట్టుకుపోతున్నామని ఫీల్ అయినప్పుడో హఠాత్తుగా హిమాలయాలకు వెళ్లిపోతారు. అక్కడ కొన్నాళ్లు ప్రశాంతంగా, ఏకాంతంగా గడిపి వస్తారు. రజనీకి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువనే అభిప్రాయం అభిమానుల్లోనూ ఉంది. రజనీ కొత్త ఏడాదిలో రాజకీయ పార్టీ ప్రకటించి యాక్టివిటీ మొదలుపెడితే, పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, తన రాజకీయ మార్గం ఏమిటో వివరిస్తేగాని ఆయన ఆధ్యాత్మిక రాజకీయాలు ఏమిటో అర్థంగావు.
ఆధ్యాత్మికం అంటే రజనీ దృష్టిలో హిందూత్వం అని అర్థమా? బీజేపీతో పొత్తు కోసం ఆలోచిస్తున్నారా? అందుకే ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానన్నారా? దీని అంతరార్ధం ఏమిటో ఆయన వివరిస్తేగాని తెలియదు. అయితే ఈమధ్య అభిమానులతో, రజనీ మక్కళ్ మండ్రం బాధ్యులతో జరిపిన సమావేశంలో వారంతా ముక్తకంఠంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని, ఒకవేళ ఆ పని చేస్తే తమ సహకారం ఉండదని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే తన నిర్ణయం ప్రకటించడానికి జాప్యం చేస్తూ వచ్చారుగాని రాజకీయ సలహాదారులను ఎప్పుడో నియమించుకున్నారు. వారిలో ఒకాయన బీజేపీలో కీలక వ్యక్తి. దీన్నిబట్టి రజనీ బీజేపీవైపు మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది. అయితే బీజేపీ ఢిల్లీ నాయకులు రజనీపై ఎప్పటినుంచో ఒక కన్నేసిపెట్టారు. బీజేపీలో చేరాలని కూడా ఆహ్వానించారు. కాని రజనీ ఏ విషయమూ చెప్పలేదు.
వాస్తవానికి పార్టీ పెట్టడానికి రజనీ సుముఖంగా లేరనే అనుకోవాలి. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉంది. రెండు దశాబ్దాల కిందట రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించినప్పుడు అప్పట్లో ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. అప్పట్లో ఆయన జయలలితను వ్యతిరేకించి డీఎంకేకు మద్దతు ఇచ్చారు. తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరిగిపోయిందని జయలలిత సమక్షంలోనే ప్రకటించి సంచలనం సృష్టించారు. రజనీ ప్రభావం ఉందోలేదో చెప్పలేంగాని జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే అధికారంలోకి వచ్చింది. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, పార్టీ పెట్టకపోయినా రాజకీయాలను ఆయన ప్రభావితం చేయగలరనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఏర్పడింది. అందుకే రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేశారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లో కి రావడానికి ఇది సరైన సమయమని అన్నారు.
ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది. దిగ్గజ నాయకులు కరుణానిధి, జయలలిత దివంగతులయ్యారు. డీఎంకేకు స్టాలిన్ బలమైన నాయకుడైనా అళగిరి రాజకీయాల కారణంగా పార్టీ బలహీనంగా ఉందనే చెప్పాలి. అన్నా డీఎంకేలోనూ ఎళప్పాడి వర్గం, పళనిసామి వర్గం రాజకీయాలు సాగుతున్నాయి. త్వరలో జైలు నుంచి శశికళ రాబోతోంది. మరి రజనీ పొలిటికల్ ఎంట్రీ ఎవరిని ఎక్కువ నష్టపరుస్తుందో చూడాలి. రజనీ మాత్రం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. తమిళనాడులో ఇక తకధిమితాళమే…!
నాగ్ మేడేపల్లి