రైతు పరామర్శ యాత్రల పేరుతో పవన్ కల్యాణ్ నాలుగు జిల్లాల్లో చేసిన సుడిగాలి పర్యటనకు యువత నుంచి విశేష స్పందన వచ్చిందని జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సంబరాలు అంబరాన్నంటినా.. ఓట్లు మాత్రం గడప దాటలేదు.
మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఏమైనా తేడా ఉందా? పవన్ కల్యాణ్ పర్యటనకు వచ్చినవారంతా నిజంగానే జనసేన భావాలు నచ్చి వచ్చారా? లేక సినిమా హీరో పవర్ స్టార్ ని దగ్గరగా చూసేందుకు వచ్చారా? ఈ విషయం జనసేన ఆధ్వర్యంలో జరగబోతున్న నిరసన దీక్షలతో తేలిపోతుంది.
వరుస తుపాన్లతో నష్టపోయిన రైతన్నలకు తక్షణ నష్టపరిహారంగా రూ.10వేల రూపాయలు ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి 48గంటల డెడ్ లైన్ కూడా ఇచ్చింది. ఎలాగూ ప్రభుత్వం జనసేన డిమాండ్ ని లెక్కలోకి తీసుకోదనే విషయం తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ నిరసన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ పేరుతో ప్రకటన కూడా విడుదలైంది.
అయితే నిరసన దీక్షలకు జనాన్ని తరలించడం జిల్లా నాయకులకు తలకు మించిన భారంగా మారుతోంది. పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే.. ఆసక్తి చూపించిన కార్యకర్తలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసనకు రండి అంటే మాత్రం ఉత్సాహం చూపించడంలేదు.
ఒక రకంగా కరోనా కాలం నుంచి నిశ్శబ్దంగా ఉన్న జనసైనికుల్లో చురుకు పుట్టించడానికే పవన్ ఈ దీక్షల ప్లాన్ వేసినా.. ఏ జిల్లాలోనూ ఉత్సాహం కనిపించడం లేదు.
పైగా బీజేపీతో సంప్రదించకుండానే, బీజేపీ సపోర్ట్ లేకుండానే పవన్ సొంతగా జనసేన అజెండాగా దీన్ని రూపొందించారు. గతంలో పొత్తు కుదిరిన సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా కలిసే చేస్తాం, కలిసే నడుస్తాం అంటూ వీరావేశంతో డైలాగులు కొట్టారు కానీ, క్షేత్ర స్థాయిలో బీజేపీ-జనసేన కలసి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు.
ఇప్పుడు జనసేన పార్టీ… రైతుల కోసం తన సత్తా చూపాలనుకుంటోంది. ఈ నిరసన దీక్షలకు జనం వస్తేనే జనసేన బలం ఎంతో తేలుతుంది?