ఇటీవల ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తనయుడైన నటుడు ఆదిత్య నారాయణ్ తన ప్రేయసి, నటి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లాడారు. శ్వేతతో 12 ఏళ్ల పరిచయం అని, 10 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య చెప్పారు.
ప్రియురాలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ముంబయిలోని ఇస్కాన్ మందిరంలో వాళ్లిద్దరి వివాహం జరిగింది. తన కుమారుడు ఆదిత్య, శ్వేతల ప్రేమ, పెళ్లి గురించి ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కొత్త విషయం చెప్పారు.
తన కొడుకు ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెళ్లితో వాళ్ల రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఆదిత్య ఒక్కడే సంతానమన్నారు.
ఆదిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సందర్భంలో వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారం తమకు తెలిసిందన్నారు. కానీ శ్వేతను ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఆదిత్య చెప్పినప్పుడు మొదట్లో షాక్‌కు గురైనట్టు ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తెలిపారు.
తన కోడలు చాలా అణకువైన అమ్మాయిగా కొనియాడారు. చాలా తక్కువ మాట్లాడుతుందన్నారు. వాడి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నట్టు ఉదిత్ తెలిపారు. అయితే కొవిడ్ కారణంగా హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. కొవిడ్ పరిస్థితులు చక్కబడే వరకూ తన కుమారుడి పెళ్లి వాయిదా వేయాలని తాను అనుకున్నట్టు తెలిపారు.
కానీ తాను ఒకటి అనుకుంటే, ఆదిత్య-శ్వేతా, ఆమె తల్లిదండ్రులు మరోలా ఆలోచించారన్నారు. ఇప్పుడు పెళ్లి జరిగితే బాగుం టుందని వాళ్లు భావించారన్నారు. దీంతో పెళ్లి జరిపించాల్సి వచ్చిందన్నారు. సుదీర్ఘ కాలం పాటు స్నేహితులుగా ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.