ఏజెంట్ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. రెండో రోజుకు ఫ్లాప్ ఫిక్స్ అయింది. ఇక ఇవాళ్టి ఆక్యుపెన్సీతో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఏ సినిమాకైనా సోమవారం టెస్ట్ చాలా కీలకం. అలాంటి కీలకమైన సోమవారం రోజున, అంటే ఈరోజు ఏజెంట్ సినిమా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో లో థియేటర్లన్నీ దాదాపు ఖాళీ. మ్యాట్నీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈవెనింగ్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఏం లేవు. ఇవాళ్టి థియేట్రికల్ ట్రెండ్ తో ఈ సినిమా డిజాస్టర్ పక్కా అయింది.
నిజానికి ఆదివారమే ఈ సినిమా రిజల్ట్ తేలిపోయింది. వీకెండ్ అయినప్పటికీ ఆడియన్స్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. 7 లక్షలు, 9 లక్షలు, 4 లక్షలు.. ఇలా సింగిల్ డిజిట్ లో వసూళ్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఓవరాల్ గా ఆదివారం షేర్ 50 లక్షల్లోపే వచ్చింది. అలా ఆదివారానికే తేలిపోయిన ఏజెంట్ సినిమా, ఇవాళ్టికి పూర్తిగా వాష్ అవుట్ అయింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఏజెంట్ సినిమా. అఖిల్ మార్కెట్ వాల్యూను మించి ఈ సినిమాకు ఖర్చుచేశారు. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా 30 శాతం కూడా రికవరీ సాధించలేదు. బయ్యర్లు భారీ నష్టాలు చూస్తున్నారు.