విడాకులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇక కలిసి జీవించలేమని భావించే దంపతులకు, వారు కోరుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇటీవల కాలంలో విడాకులు కేసులు పెరిగాయి. పెళ్లిళ్లు కావడమే ఆలస్యం, ఏవో చిన్నచిన్న విభేదాలే పెద్దవిగా మారి చివరికి దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకునే వరకూ పరిస్థితులు దారి తీస్తున్నాయి.
అయితే చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, కొత్త జీవితాన్ని స్టార్ చేయాలని భావించే వారికి సంవత్సరాల తరబడి విముక్తి లభించడం లేదు. విడాకులు మంజూరు కావడానికి న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలం పాటు జాప్యం జరుగుతోంది. అయితే విడాకులు మంజూరుకు ఎక్కువ సమయం తీసుకోవడానికి బలమైన కారణం వుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కాలం గడిచే కొద్ది దంపతుల ఆలోచనల్లో సానుకూల మార్పు వచ్చి, కలిసి జీవించడానికి అవకాశం వుంటుందనే భావనే జాప్యానికి కారణంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రాధాన్యం సంతరించుకుంది. విడాకుల కోసం ఆర్నెళ్ల నుంచి 18 నెలల కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై కలిసి జీవించలేమని భావిస్తే, విడాకులు కావాలని కోరితే వెంటనే మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
విడాకులు కోరే జంట మధ్య సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి వుంటే వెంటనే వివాహాన్ని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అనే విశిష్ట అధికారం తమకు వుంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం. దీంతో విడాకులు కోరుకునే జంటలకు సుప్రీంకోర్టు తీర్పు గొప్ప ఊరట ఇచ్చే అంశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.