న్యాయ వ్యవస్థలో కాస్త సానుకూల వాతావరణం

న్యాయ వ్యవస్థలో కాస్త వాతావరణం మారుతున్నట్లుగా ఉంది. ఇంతకాలం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ఇస్తున్న ఆదేశాలు పెద్ద చర్చగా మారాయి. వాటిపై రకరకాల వ్యాఖ్యలు, చివరికి కొందరికి కోర్టు ధిక్కార నోటీసులు,…

న్యాయ వ్యవస్థలో కాస్త వాతావరణం మారుతున్నట్లుగా ఉంది. ఇంతకాలం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ఇస్తున్న ఆదేశాలు పెద్ద చర్చగా మారాయి. వాటిపై రకరకాల వ్యాఖ్యలు, చివరికి కొందరికి కోర్టు ధిక్కార నోటీసులు, సీబీఐ విచారణ వంటి వాటికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం వంటివి జరిగాయి.

తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఏపీ హైకోర్టులో గౌరవ న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు మసాలాగా మాదిరి వాడుకుని ఏపీ ప్రభుత్వాన్ని బద్‌నామ్ చేయడానికి శక్తి వంచన లేకుండా కషి చేశాయి. దాంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిమానులు సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వసాగారు. ఈ విషయంలో కొందరు హద్దులు మీరారన్న భావన ఏర్పడింది.

ఆ విషయం పక్కన బెడితే గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన పలు ఆదేశాలలో పరస్పరం విరుద్ధంగా కొన్ని ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు వాటిలో కొన్నిటిపై సుప్రింకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా ఉంది.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు జీర్ణం కాని విషయాలే. అందుకే అలాంటి వార్తలకు వారు ప్రాధాన్యం ఇవ్వడం లేదనుకోవాలి. ప్రధానంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్‌పై సుప్రింకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పాలి.

భారత న్యాయవ్యవస్థ బొత్తిగా న్యాయంగా లేదని అనుకునేవారికి ఇది సమాధానం ఇచ్చినట్లయింది. అందుకు ముందుగా సుప్రింకోర్టు వారిని అభినందించాలి. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఆ కుంభకోణానికి సంబంధించి మాజీ ఎ.జి. దమ్మాలపాటి శ్రీనివాస్‌తో సహా పదమూడు మందిపై ఏపీ అవినీతి నిరోధక శాఖ కేసులు పెట్టడం సంచలనం అయింది.

అందులో దమ్మాలపాటి, ఆయన కుటుంబ సభ్యులు కొందరితో పాటు సుప్రింకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కుమార్తెలు ఇద్దరి పేర్లు ఉండడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఏసీబీ కేసు పెట్టిందన్న సమాచారం వచ్చిన కొద్ది గంటలలోనే ఏపీ హైకోర్టు వారు ఎసిబి ఎఫ్‌ఐఆర్ పై స్టే ఇవ్వడమే కాకుండా, అసలు సంబంధిత వార్తను ఎక్కడా ప్రచారం చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఇచ్చారు. ఇది మరింత సంచలనం అయింది.

ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత భషషణ్, దుష్యంత దవేతో సహా పలువురు ఈ గాగ్ ఆర్డర్‌ను తప్పు పట్టారు. సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. అసలు ఎఫ్‌ఐఆర్ దశలోనే కోర్టులో జోక్యం చేసుకోరరాదని సుప్రింకోర్టు ఆయా కేసులలో ఆదేశాలు ఇచ్చిందని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

అయినప్పటికీ ఏపీ హైకోర్టు వారు ఎఫ్‌ఐఆర్‌ను నిలుపుదల చేయడమే కాకుండా, సంబంధిత వార్తల ప్రచారం చేయరాదంటూ ఆదేశాలు ఇచ్చారు. దానిపై ఏపీ ప్రభుత్వం సుప్రింకోర్టులో అప్పీల్ చేసింది. ఆ కేసు రావడానికి రెండు నెలలకు పైగా పట్టింది.

నిజానికి ఇలాంటి కేసులను సుప్రింకోర్టు స్థాయిలో వేగంగా విచారించి ఉండాల్సిందన్న అభిప్రాయం చాలమందికి ఉంది. ఈ నెల ఇరవైఐదున విచారణ జరిపిన సుప్రింకోర్టు న్యాయమూర్తులు గాగ్ ఆర్డర్‌పై మాత్రం స్టే విధించారు. అంటే ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అంశాలను మీడియాలో రాసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తద్వారా దేశంలో సమాచార స్వేచ్ఛను సుప్రింకోర్టు వారు పునరుద్దరించారన్నమట. అందుకు అంతా సంతోషించాలి.

అదే సమయంలో ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు తీర్పు మీద ఇంకా స్టే ఇవ్వలేదు. రెండు నెలల తర్వాత విచారణ చేయడానికి వాయిదా వేసింది. ఈ విషయంపై సుప్రింకోర్టు వారు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి కనుక అలా వాయిదా వేశారని చెబుతున్నారు. 

అయినప్పటికీ సామాన్యులకు వచ్చే సందేహం ఏమిటంటే గతంలో కొందరు నేతలపై ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసినప్పుడు ఇదే న్యాయ వ్యవస్థ నెలల తరబడి జైలులో ఉంచింది. న్యాయ వ్యవస్థలో ఎవరిపైన అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం స్టేలు ఇస్తారా? అన్న చర్చకు ఆస్కారం ఇచ్చినట్లయింది.

న్యాయ వ్యవస్థ అవినీతికి వ్యతిరేకంగా అన్ని కేసులలో ఒకే విధంగా స్పందించాలని అంతా ఆశిస్తారు. అమరావతిలో వేలకోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం కాని, దర్యాప్తు సంస్థ అయిన ఏసీబీ కాని ఆరోపణలు చేస్తే న్యాయ స్థానం విభిన్నంగా స్పందింవచ్చా అన్న ప్రశ్న కూడా వచ్చింది. 

ఈ కేసు జనవరి తర్వాత అయినా ముందకు సాగుతుందని ఆశిద్దాం. మరో వైపు మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఎబి వెంకటేశ్వరరావు వచ్చిన అభియోగాల మీద కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తర్వాత హైకోర్టు నిలుపుదల చేసింది.

తాజాగా ఏపీ హైకోర్టు కూడా స్వర్ణపాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై డాక్టర్ రమేష్‌ను విచారించడానికి పోలీసులకు అనుమతించడం మంచి పరిణామమే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రింకోర్టు సీనియర్ న్యాయమూర్తిపైన, ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపైన చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కొందరు అసలు జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రింకోర్టులో పిటిషన్ వేస్తే దానిని సుప్రింకోర్టు దానికి విచారణ అర్హత లేదని తోసిపుచ్చడం మరో మంచి పరిణామం. 

అలాగే సుప్రింకోర్టుకు రాసిన లేఖను బహిరంగపరిచడం కోర్టు ధిక్కారం అంటూ వేసిన పిటిషన్‌లను కూడా సుప్రింకోర్టు సీనియర్‌గా తీసుకోలేదు. ఇటీవలికాలంలో ఇవన్ని ఏపీ ప్రభుత్వానికి కాస్త ఊరట ఇచ్చే విషయాలే అని చెప్పాలి.

హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ,గౌరవ న్యాయమూర్తులు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో పరిచే కొన్ని పత్రికలు సుప్రింకోర్టు ఆదేశాల వార్తలకు మాత్రం అంత ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాయి. 

ఏది ఏమైనా న్యాయవ్యవస్థ ఆయా కేసుల విచారణనలో పనికట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటే మంచిదని ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. అవినీతి కేసులలో నిజంగానే రాజకీయ కక్షతో కేసులు పెట్టారన్న అభిప్రాయం కలిగితే అలాంటి వాటిని హైకోర్టు, లేదా ఏ న్యాయ వ్యవస్థ అయినా తప్పు పట్టవచ్చు. సరి చేయవచ్చు. అంతేకాక అలా జరిగితే ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 

ఏది చేసినా పారదర్శకంగా జరగాలి. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అలా చేస్తున్నాయా? లేదా అన్నది చూడడం తప్పు కాదు. కాని న్యాయవ్యవస్థ కొన్ని అవినీతి కేసులలో ఒక రకంగా, మరికొన్ని అవినీతి కేసులలో ఇంకో రకంగా వ్యవహరిస్తే అది వ్యవస్థకు, సమాజానికి మంచిది కాదని చెప్పాలి.

కొమ్మినేని శ్రీనివాసరావు