మోహ‌న్‌బాబుతో జ‌గ‌న్‌కు బెడిసిందా!

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బెడిసిందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు కూడా. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన…

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బెడిసిందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు కూడా. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విష్ణు ఘ‌న విజ‌యం సాధించారు. త‌ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోహ‌న్‌బాబు త‌న ప‌ట్టు నిలుపుకున్నారు.

సినిమా టికెట్ ధ‌ర‌లు, అలాగే ఇత‌ర‌త్రా అంశాలు ఏపీ ప్ర‌భుత్వంతో టాలీవుడ్‌కు వివాదం ఏర్ప‌డింది. ఇరు వైపుల నుంచి ప‌ర‌స్ప‌రం మాట‌లు తూటాలు పేలాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు అతిగా రియాక్ట్ కావ‌డంతో ప్ర‌భుత్వం కూడా దూకుడు పెంచింది. దీంతో చాలా చోట్ల ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను సీజ్ చేయ‌గా, మ‌రికొంద‌రు తామే స్వ‌చ్ఛందంగా ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింది.

చిరంజీవి నేతృత్వంలో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించింది. మొత్తానికి ఆరేడు నెల‌లుగా సాగుతున్న వివాదానికి ఎట్ట‌కేల‌కు గురువారం శుభం కార్డు ప‌డిన‌ట్టు చిరంజీవి తెలిపారు. అయితే ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో మోహ‌న్‌బాబు, “మా” అధ్య‌క్షుడు విష్ణుకు చోటు ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పైగా మంచు విష్ణు వైఎస్ కుటుంబ అల్లుడు. జ‌గ‌న్ సొంత చిన్నాన్న కూతురిని విష్ణు వివాహ‌మాడారు. అప్పుడ‌ప్పుడు విష్ణు త‌న భార్యా, పిల్ల‌లతో సీఎం ఇంటికి వెళుతుండ‌డం తెలిసిందే. ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ ఎన్నిక‌ల్లో విష్ణును గెలిపించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఒత్తిడి చేస్తున్న‌ట్టు ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈ ప్ర‌చారాన్ని మంత్రి పేర్ని నాని ఖండించాల్సి వ‌చ్చింది.

త‌న‌ను ఎన్నుకుంటే రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ఉన్న సాన్నిహిత్యం వ‌ల్ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తాన‌ని స్వ‌యంగా విష్ణు ప్ర‌క‌టించారు. త‌న‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ బావ అవుతార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డంపై అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థులు త‌ప్పు ప‌ట్టారు. మంచు విష్ణుకు వ్య‌తిరేకంగా ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌ను మెగా బ్రద‌ర్ నాగ‌బాబు నిలిపార‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. చివ‌రికి ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ ఓడిపోయింది.

చిత్ర‌ప‌రిశ్ర‌మ ఎన్నిక‌ల్లో గెలుపొందిన మంచు విష్ణుతో పాటు ఆయ‌న తండ్రి మోహ‌న్‌బాబుకు తాజా వివాదంలో జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి కోసం, అలాగే జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు మంచు మోహ‌న్‌బాబు విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డాన్ని ఆయ‌న అభిమానులు గుర్తు చేస్తున్నారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్‌ను ఓడించాల‌ని తాను ప్ర‌చారం చేసినా, దాన్ని మ‌న‌సులో పెట్టుకోకుండా బాల‌కృష్ణ విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌త్యేకంగా చెప్పారు.

కానీ తిరుప‌తిలో ప్ర‌త్యేక యూనివ‌ర్సిటీ, అలాగే సినీ స్టూడియో నిర్మించుకోడానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచిన విష‌యాన్ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చిరంజీవి నేతృత్వంలో చ‌ర్చించ‌డానికి, మోహ‌న్‌బాబు, విష్ణుల‌ను ఆహ్వానించ‌క పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అంతిమంగా మోహ‌న్‌బాబు, విష్ణు కాంక్షిస్తున్న‌దే జ‌గ‌న్ చేస్తున్నార‌నేది ప్ర‌భుత్వ వాద‌న‌. ఏది ఏమైనా తాజా ప‌రిణామాల‌పై మాత్రం పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.