ఖాళీ అవుతున్నవి 4 స్థానాలు.. ఇప్పటికే వాటికి పేర్లు ఖరారయ్యాయని వినికిడి, మరి అలీకి చోటెక్కడ. అలీని రాజ్యసభకు పంపించి ఏం చేస్తారు..? గతంలో సినిమా వాళ్లకు పెద్దల సభలో ఛాన్స్ ఇవ్వడం టీడీపీ నుంచి మొదలైంది. ఇప్పుడు వైసీపీ దాన్ని కంటిన్యూ చేస్తుందా..? అలీకి రాజ్యసభ కాకుండా ఇంకేదైనా కీలక పోస్ట్ ఇవ్వలేరా..?
వారం తర్వాత ఏంటి..?
సినిమావాళ్లు సీఎంని కలసిన తర్వాత ప్రత్యేకంగా అలీతో జగన్ మాట్లాడారట. వారం తర్వాత రా కలుద్దాం.. అంటూ భుజం తట్టి పంపించారట. ఈ వారం మిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. దగ్గర్లో రాజ్యసభ వ్యవహారం ఉంది కాబట్టి.. వారం తర్వాత అలీని రాజ్యసభకు పంపించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది పూర్తి ఊహాగానమే అయినా అర్జంట్ గా అలీకీ, రాజ్యసభకు లింకు ఎందుకు కుదిరిందా అనేది ఆలోచించాల్సిన విషయమే.
మైనార్టీలో ఇంకెవరూ లేరా..?
ఈసారి ఉన్న నాలుగు సీట్లలో మైనార్టీకి ఒకటి కేటాయించాలనుకుంటున్నారని, అందుకే అలీకి అది ఇవ్వబోతున్నారని వార్తలొస్తున్నాయి. మరి వైసీపీలోని మైనార్టీ నాయకుల్లో రాజ్యసభ అర్హత ఉన్నవారు ఎవరూ లేరా..? సడన్ గా అలీని తీసుకొచ్చి రాజ్యసభకు పంపిస్తారా అనేది తేలాల్సి ఉంది. అలీ ద్వారా మైనార్టీ ఓట్ల కోసం ఎరవేసేవారే అయితే.. కచ్చితంగా ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచేవారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకునేవారు.
కానీ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు, అలాంటి ఒత్తిడి కూడా తేలేదు. సినిమా రంగం నుంచి వచ్చేవారంతా స్వచ్ఛందంగానే జగన్ చెంతకు చేరారు, ఎప్పుడూ ఎలాంటి పదవీ ఆశించలేదు. ఆ మధ్య నటుడు పృథ్వీకి పదవి ఇచ్చినా అది ఎక్కువరోజులు నిలవలేదు.
పవన్ పై కోపంతో అంతపని చేస్తారా..?
అలీని పవన్ కల్యాణ్ కి శిష్యుడిగా భావిస్తారు జనసైనికులు. గురువు రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయి, అసలిప్పుడేం చేయాలా అనే డైలమాలో ఉన్నారు. కనీసం బీజేపీ ఆయన్ను పిలిచి రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం లేదు. ఈ దశలో అలీకి వైసీపీ తరపున రాజ్యసభ సీటు దక్కితే జనసైనికుల పరిస్థితి మామూలుగా ఉండదు.
ఓడిపోయిన నేత పవన్ కల్యాణ్, ఎంపీ అలీ అంటూ ఇప్పటికే సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఇకపై రాస్కో సాంబా అనలేరని, ఎంపీ సాంబా అనాల్సిందేనని ట్రోలింగ్ మొదలైంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో మరో వారం తర్వాత తేలిపోతుంది.