త‌మిళ సూప‌ర్‌స్టార్‌పై సీనియ‌ర్ హీరోయిన్‌ ఫైర్‌

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ర‌జినీకాంత్‌పై త‌మిళ‌నాడు కోడ‌లు, సీనియ‌ర్ హీరోయిన్‌, ఏపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. గ‌తంలో కూడా టీడీపీ స‌భ‌ల‌కు…

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ర‌జినీకాంత్‌పై త‌మిళ‌నాడు కోడ‌లు, సీనియ‌ర్ హీరోయిన్‌, ఏపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. గ‌తంలో కూడా టీడీపీ స‌భ‌ల‌కు ర‌జినీకాంత్ వెళ్లార‌ని ఆమె గుర్తు చేశారు. 

చంద్ర‌బాబు, ర‌జినీకాంత్ మంచి ఫ్రెండ్స్ అన్నారు. అయితే ఎన్టీఆర్ ఆత్మ సంతృప్తి చెందుతుంది, చంద్ర‌బాబునాయుడిని ఆశీర్వదిస్తుంద‌ని ర‌జినీకాంత్ మాట్లాడ్డం త‌న‌కు బాధ క‌లిగిస్తోంద‌న్నారు. క‌ళాకారుడిగా ర‌జినీకాంత్ అంటే త‌మంద‌రికీ ఇష్ట‌మ‌న్నారు. కానీ ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేకుండా అలా మాట్లాడుతున్నార‌ని ఆమె అనుమానించారు. 

“నా అల్లుడు చంద్ర‌బాబునాయుడు దొంగ‌, మోస‌గాడు, జామాత గ్ర‌హం. త‌డిగుడ్డ‌తో గొంతు కోసే ర‌కం” అని స్వ‌యంగా ఎన్టీఆర్ విమ‌ర్శించార‌ని రోజా గుర్తు చేశారు. సీఎం పీఠం మీద నుంచి ఎన్టీఆర్‌ను దించేసి, ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించార‌ని రోజా చెప్పుకొచ్చారు. నాడు చంద్ర‌బాబునాయుడు గురించి ఎన్టీఆర్ ఎంత ఘాటుగా విమ‌ర్శిస్తూ మాట్లాడారో అంద‌రూ చూశార‌న్నారు. మ‌రి ర‌జినీకాంత్ చూడ‌క‌పోయి వుంటే తాను పంపుతాన‌న్నారు. త‌న‌పై దారుణ‌మైన కార్టూన్లు వేయించిన చంద్ర‌బాబును ఎన్టీఆర్ ఆత్మ ఆశీర్వ‌దిస్తుంద‌ని చెప్ప‌డం బాధాక‌ర‌మ‌న్నారు. 

ర‌జినీకాంత్ మాట‌లు దివంగ‌త నేత ఎన్టీఆర్‌ను, ఆయ‌న అభిమానుల్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌న్నారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. రజినీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుంద‌న్నారు. అవ‌గాహ‌న లేని కామెంట్స్‌తో త‌న గౌర‌వాన్ని త‌గ్గించుకున్నార‌న్నారు. చంద్ర‌బాబు లంచ్‌తో పాటు అబ‌ద్ధాలు కూడా వడ్డించిన‌ట్టున్నారని చ‌మ‌త్క‌రించారు. ఈ మ‌ధ్య హైద‌రాబాద్‌కు వెళితే న్యూయార్క్‌లా క‌నిపించింద‌ని ర‌జినీకాంత్ చెప్పార‌ని, ఇదంతా చంద్ర‌బాబు ఘ‌న‌త‌గా ఆయ‌న చెప్ప‌డాన్ని రోజా త‌ప్పు ప‌ట్టారు. 

చంద్ర‌బాబునాయుడు సీఎంగా 2003లో దిగిపోయార‌న్నారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కు ముఖ్య‌మంత్రి కాలేద‌న్నారు. 2003 నుంచి 2023 వ‌ర‌కు చంద్ర‌బాబు తెలంగాణ‌లో అధికారంలో లేన‌ప్పుడే డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగింద‌న్నారు. అది ర‌జినీకాంత్ గుర్తించుకోవాల‌ని రోజా హిత‌వు చెప్పారు. చంద్ర‌బాబు లేన‌ప్పుడే అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. 

చంపేసి దండ వేసి, దండం పెట్ట‌డం చంద్ర‌బాబుకే చేత‌న‌వుతుంద‌న్నారు. ఎన్టీఆర్ యుగ‌పురుషుడు అన్న‌ప్పుడు ఆయ‌న‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచావ‌ని రోజా నిల‌దీశారు. ఎన్టీఆర్ పార్టీని ఎందుకు లాక్కున్నావ‌ని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో క‌నీసం మాట్లాడేందుకు ఎన్టీఆర్‌కు మైకు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏడ్చుకుంటూ వెళ్ల‌డాన్ని అంద‌రం చూశామ‌న్నారు. ఊస‌ర‌వెల్లి కూడా చంద్ర‌బాబులా రంగులు మార్చ‌ద‌న్నారు. 

యుగ‌పురుషుడైన ఎన్టీఆర్‌ను అప్పుడు చంప‌డం కాదు, నిన్న చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, ర‌జినీకాంత్ ఇలాంటి మాట‌లు మాట్లాడి మ‌ళ్లీ చంపారని రోజా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఆత్మ ఖ‌చ్చితంగా క్షోభిస్తుంద‌న్నారు.