తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆంధ్ర వచ్చారు..చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. మళ్లీ వెళ్లారు. దాని మీద గడబిడే ఇక మిగిలింది. అసలు ఎన్టీఆర్ శతజయంతి అంటూ కృష్ణా జిల్లాలో హడావుడి మొదలుపెట్టినపుడు, దాని మీద పేజీలకు పేజీలు నింపినపుడే తెలుస్తోంది కదా..తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్టీఆర్ ను ఎన్నికలకు వాడేసుకోవాలి అని అనుకుంటోందని.
ఇవే పత్రికలు ఎన్టీఆర్ వెన్ను పోటు టైమ్ లో ఏ విధంగా పేజీలకు పేజీలు నింపేసాయన్న సంగతి ఈ జనరేషన్ కుర్రాళ్లకు తెలియకపోవచచ్చు. వైకాపా జనాలు అప్పటి పత్రికలు అన్నీ సంపాదించి ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తే భలేగా వుంటుంది. తేడాలు గమనించండి అనే టైపులో అప్పటి కవరేజి, ఈనాటి కవరేజి చూపిస్తే జనం ముక్కున వేలేసుకుంటారు.
కమ్ బ్యాక్ టు రజనీకాంత్. చంద్రబాబు శిబిరం వైపు రజనీకాంత్ వుండడం కొత్త కాదు. ఎన్టీఆర్ ను గద్దె దింపినుపుడే రజనీకాంత్ స్వయంగా వచ్చి చంద్రబాబు అండ్ కో దగ్గర కూర్చుని, మాట్లాడి వెళ్లారు. అందువల్ల ఇప్పుడేదో రజనీకాంత్ కు అర్జంట్ గా చంద్రబాబు నచ్చాడని, చంద్రబాబు పాలన కావాలని, చంద్రబాబు విజన్ అత్యవసరం అని అనిపించింది అనుకోవడం భ్రమ.
అందువల్ల రజనీ మీద రాద్దాంతం చేయడం అనవసరం. నిజానికి తెలుగుదేశం గేమ్ ప్లాన్ కూడా అదే. రజనీ మాట్లాడి వెళ్లిపోతే, రంజుగా ఏం వుంటుంది? అదే కనుక రజనీ మాటలకు వైకాపా జనాలు స్పందిస్తే అప్పుడు కదా, సౌండ్ కు రీసౌండ్ వుంటుంది. జనాల్లో డిస్కషన్ జరుగుతుంది. అదే తేదేపాకు కావాల్సింది.
ఇంకా ఎంత మంది గెస్ట్ ఆర్టిస్ట్ లు ఏదో వంకన ఆంధ్రకు రావాల్సి వుంది. వస్తారు. ఎన్నికల ఏడాది ఇలా వస్తూనే వుంటారు. వారంతా, తాతల మూతుల వాసన చూడండి అనేట్లు, చంద్రబాబు విజన్ గురించి బుర్రకథలు పాడి వెళ్తూనే వుంటారు. ఈ జబర్దస్త్ గేమ్ షో ను ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచింది వైకాపా జనాలకు.