ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఆసక్తిదాయకమైన అంశం. గతంలో కాంగ్రెస్ తరహాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీల్డ్ కవర్ సీఎంలను ఎంపిక చేసే సంప్రదాయాన్ని అనుసరిస్తోంది.
ఇదే తరహాలో సీఎం అయిన వ్యక్తే బసవరాజ్ బొమ్మై కూడా. యడియూరప్పను దించే బొమ్మైని బీజేపీ అధిష్టానం సీఎంగా చేసింది. అయితే బొమ్మైని కూడా మారుస్తారనే ఊహాగానాలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి బొమ్మై తన పీఠాన్ని నిలబెట్టుకున్నారనే పేరుంది!
అదిగో సీఎం మార్పు, ఇదిగో సీఎం మార్పు అనే ఊహాగానాల మధ్యనే బొమ్మై పదవీ కాలం పూర్తైంది ప్రస్తుతానికి. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీస మెజారిటీ వచ్చినా, రాకపోయినా.. ఎలాగోలా ప్రభుత్వాన్ని అయితే తనే ఏర్పాటు చేసే శక్తియుక్తులున్నాయి! ఎమ్మెల్యేలను అటూ ఇటూ చేయడంలో బీజేపీ తలపండిపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కేవలం ఫిరాయింపుదార్లు, తిరుగుబాటు దార్ల ఆధారంగా ఏర్పడిందే. ఇలాంటి ఫీటే మరోసారి చేయడం కమలం పార్టీకి కష్టం కాదు.
మరి అలాంటి తరుణంలో మరోసారి బొమ్మైనే సీఎంగా చేస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. అయితే మొన్నటి వరకూ కూడా బొమ్మైని తప్పిస్తారనే టాక్ నడిచింది. అలాంటప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఈయనకే అవకాశం దక్కుతుందా? అనేది మాత్రం సందేహమే. మరింత మంది ఆశావహులైతే ఉన్నారు. ఈ సారి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న వారిలో వక్కలిగ సామాజికవర్గానికి చెందిన సీటీ రవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
సీటీ రవి సీఎం అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కొందరు కమలం పార్టీ నేతలే ప్రకటనలు చేశారు. తద్వారా ఆయన పేరును ముందస్తుగా ప్రచారంలోకి పెట్టేశారు. భారతీయ జనతా పార్టీ యడియూరప్ప, బొమ్మైల రూపంలో ఇటీవలి కాలంలో లింగాయత్ లకే ప్రాధాన్యతను ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ రూటు మార్చి వక్కలిగకు అవకాశం ఇస్తుందా? అనేది బిగ్ డౌట్!
జేడీఎస్ ను వక్కలిగలు ఓన్ చేసుకుంటారు, వక్కలిగల జనాభా గట్టిగా ఉన్న చోటల్లా జేడీఎస్ గెలవడం ఆనవాయితీగా ఉంది. జేడీఎస్ గెలిచేవన్నీ వక్కలిగల జనసాంద్రత ఉన్న సీట్లే. అయితే కాంగ్రెస్ కూడా వక్కలిగల మద్దతు కొంత వరకూ సంపాదించింది.
వక్కలిగలపై జేడీఎస్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ డీకే శివకుమార రాజకీయంగా ఎదిగాడు. బెంగళూరు పరిసరాల్లో జేడీఎస్ ను ఖాళీ చేయించి కనకపుర వంటి చోట నుంచి డీకేశి చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ కు మెజారిటీ దక్కితే సీఎం అభ్యర్థిగా కూడా డీకేశి పేరు పాతదే! మరి జేడీఎస్, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ తరఫున కూడా ఇప్పుడు వక్కలిగ సీఎం అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి.