మే 3వ తేదీ విశాఖ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని రెండు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశలో నిర్మాణం పనులకు అయిదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు.
తొలి దశ పూర్తి కావడంతోనే అరవై లక్షల మంది ప్రయాణికులు సేవలు అందించేలా ఈ ఎయిర్ పోర్ట్ రెడీ అవుతుంది. ఈ ఎయిర్ పోర్టు రెండేళ్ల వ్యవధిలో అందుబాటులోకి తెస్తారు. విశాఖ విజయనగరం రెండు జిల్లాలకు ప్రగతి వారధిగా సారధిగా ఈ ఎయిర్ పోర్టు నిలుస్తుంది అని అంటున్నారు.
సమీప భవిష్యత్తులో అభివృద్ధి విశాఖ విజయనగరంలలో పూర్తిగా విస్తరిస్తుందని కూడా చెబుతున్నారు. ఇక మే 3న ముఖ్యమంత్రి అదానీ డేటా సెంటర్ కి శ్రీకారం చుడతారు. డేటా సెంటర్ ఏర్పాటుతో పాతిక వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో టెక్నాలజీ పార్క్ కి కూడా ఇదే పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాల ద్వారా సీఎం జగన్ శుభారంభం పలుకుతారని వైసీపీ నేతలు తెలిపారు.
విశాఖ సహా ఉత్తరాంధ్రా దశ మే 3వ తేదీతో తిరగడం ఖాయమని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ కి ఉత్తరాంధ్రా పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఈ కార్యక్రమాలే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన నేపధ్యంలో ముఖ్యమంత్రి రాక కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.