తగ్గేదేలే.. ట్రోలర్స్ పై హీరోయిన్లు రివర్స్ గేమ్

ఒకప్పుడు హీరోయిన్లు వివాదాలకు దూరంగా ఉండేవారు. తమపై ఏదైనా ప్రచారం జరిగితే వాటిపై పెద్దగా స్పందించేవారు కాదు. ఇక సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ను చూసీచూడనట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.…

ఒకప్పుడు హీరోయిన్లు వివాదాలకు దూరంగా ఉండేవారు. తమపై ఏదైనా ప్రచారం జరిగితే వాటిపై పెద్దగా స్పందించేవారు కాదు. ఇక సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ను చూసీచూడనట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. హీరోయిన్లు ఊరుకోవడం లేదు. తప్పుడు ప్రచారం జరిగితే ఖండిస్తున్నారు. ట్రోల్ జరిగితే వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కడిగి పారేస్తున్నారు.

మొన్నటికిమొన్న నేహా శెట్టి ఏం చేసిందో అందరం చూశాం. 'జర్నలిస్ట్' సురేష్ కొండేటిని కడిగిపారేసింది. తనకు సంబంధించి అసభ్యంగా ఓ ప్రశ్న అడిగినందుకు నేహాశెట్టి ఫైర్ అయింది. సదరు రిపోర్టర్ తన ఇంట్లో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తాడో, అతడి ప్రశ్నతోనే అర్థమౌతోందంటూ సెటైర్ వేసింది. ఆ తర్వాత కూడా మరో సందర్భంలో రియాక్ట్ అవుతూ.. ఇలాంటి ట్రోలింగ్స్, కామెంట్స్ కు వ్యక్తిగతంగా తను సమాధానం ఇస్తానని, తన టీమ్ కంటే ముందు తను రియాక్ట్ అవుతానని కుండబద్దలుకొట్టింది.

ఇక రకుల్ సంగతి సరేసరి. ఆమెకు ట్రోలింగ్స్ కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే మినిమం గ్యాప్స్ లో రకుల్ పై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి చెత్త డ్రెస్సింగ్ కారణంగా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఆ తర్వాత మంచు లక్ష్మిని ముద్దాడుతూ దిగిన ఓ ఫొటో కారణంగా ట్రోలింగ్ కు గురైంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్ర పోషించిన రకుల్, దానికి సంబంధించిన స్టిల్ రిలీజ్ చేస్తే.. శ్రీదేవి వేషంలో ఉన్న శ్రీరెడ్డిలా ఉందని కొందరు ట్రోల్ చేశారు. ఇలా ట్రోలింగ్ జరిగిన ప్రతిసారి రకుల్ ఘాటుగా స్పందించింది. ట్రోలర్స్ కు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో ఆమె ఎక్కడా తగ్గలేదు.

మొన్నటికిమొన్న కాజల్ పై కూడా ఇలానే పెద్ద ట్రోలింగ్ నడిచింది. గర్భంతో దిగిన ఫొటోల్ని చూసిన కొంతమంది, ఆమెపై బాడీషేమింగ్ కామెంట్స్ చేశారు. అవి చూసి ఊరుకోలేదు కాజల్. తనదైన శైలిలో తిప్పికొట్టింది. హుందాగా, మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలని క్లాస్ పీకింది. అలాంటి ట్రోల్స్ తో తన ఆనందాన్ని చెడగొట్టలేరంటూ పెద్ద పోస్ట్ పెట్టింది.

ఇక సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగచైతన్యతో విడిపోయిన టైమ్ లో దాదాపు వారం రోజుల పాటు సమంతపై ట్రోలింగ్ నడిచింది. నాగచైతన్యను రాచిరంపాన పెట్టిందని కొందరు, మరో ఎఫైర్ పెట్టుకుందని ఇంకొందరు, సమంతకు బుద్ధిలేదని మరికొందరు.. ఇలా రకరకాలుగా ఆమెను ట్రోల్ చేశారు. సమంత కూడా తగ్గలేదు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది. ఇలాంటి ట్రోల్స్ తో వ్యక్తిగతంగా మారింత రాటుదేలుతున్నానని, తనకు మరింత ధైర్యం వస్తోందని ఆమె చెప్పడం దీనికి నిదర్శనం. అంతేకాదు.. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దీనిపై స్పందించింది సమంత. తనను ట్రోల్ చేసే వాళ్లను చూస్తూ ఊరుకోనని ఆమె కరాఖండిగా చెప్పేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ట్రోలర్స్ కు గట్టి రిప్లయ్ ఇచ్చే హీరోయిన్ల జాబితా చాలానే ఉంది. కీర్తిసురేష్, పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నా, తమన్న.. ఇలా అంతా ఏదో ఒక దశలో ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చిన వాళ్లే. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే ఇలానే ఉంటుంది.