ఎట్టకేలకు చిత్ర పరిశ్రమ సమస్యలకు మెగాస్టార్ చిరంజీవి మాటల్లో చెప్పాలంటే శుభం కార్డు పడింది. గత ఆరేడు నెలలుగా ఏపీలో సినిమాలు విడుదల చేయడానికి ముందూవెనుకా ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు, అలాగే రోజువారీ షోల ప్రదర్శనపై ప్రభుత్వం నియంత్రించిన నేపథ్యంలో, గిట్టుబాటు కాదని పెద్ద సినిమాల వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలవంతమయ్యాయి.
గత నెల సంక్రాంతి నాడు సీఎం జగన్‌తో చిరంజీవి లంచ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో చిత్ర పరిశ్రమ సమస్యల్ని జగన్ దృష్టికి చిరు తీసుకెళ్లారు. ఆ రోజు అనుకున్న ప్రకారం మరోసారి ఇవాళ మరింత మంది సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం సినీ పెద్దలంతా మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా కారకులెవరనే విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాటల్లో తెలుసుకుందాం.
“చిన్న, పెద్ద సినిమా నిర్మాతల కష్టనష్టాలు, వారి సమస్యలపై జగన్ అవగాహనకు అభినందనలు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ఓపికగా విని, ఏ విధంగా ముందుకెళ్లాలో సీఎం జగన్ చేసిన దిశానిర్దేశానికి చాలా కృతజ్ఞతలు. ఈ మొత్తం ప్రక్రియను ముందుకు నడిపిన మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు. ఇండస్ట్రీ పెద్ద అని పిలిపించుకోవడం చిరంజీవికి ఇష్టం ఉండదు. కానీ టాలీవుడ్ పెద్ద చిరు అనేందుకు ఆయన చర్యలు నిరూపించాయి.
మహేశ్‌బాబు చెప్పినట్టు ఆరేడు నెలలుగా మన పరిస్థితి ఏంటి? ముందుకా, వెనక్కి వెళ్లాలా అనే అయోమయ పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో సమస్యని పరిష్కరించడానికి ఎవరికి వారుగా ప్రయత్నాలు చేశారు. చిరంజీవి దీన్ని ముందుకు తెచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని చిరంజీవి ఉపయోగించుకుని ఇంత పెద్ద సమస్యని పరిష్కారం దిశగా తీసుకెళ్లారు. ఇందుకు చిరంజీవికి చాలాచాలా కృతజ్ఞతలు” అని రాజమౌళి తన అభిమానాన్ని చాటుకున్నారు.
జగన్‌తో చిరు మంచి స్నేహం వల్లే చిత్ర పరిశ్రమ సమస్యలకు పరిష్కారం లభించిందనే సందేశాన్ని ప్రసిద్ధ దర్శకుడు రాజమౌళి చెప్పడం విశేషం. దీంతో చిత్రపరిశ్రమలో చిరు ఇమేజ్ అమాంతం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.