బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిగ్ ప్లాన్ తో ఉన్నారట. విశాఖపట్నంలో లక్ష మంది జనంతో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి ఏపీ జనాలను తన వైపు తిప్పుకోవాలన్నది గులాబీ బాస్ ఆలోచనగా ఉంది. విశాఖనే కేసీఆర్ ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ఆయన పూర్వీకుల నేటివ్ ప్లేస్ ఇక్కడే ఉంది. దాంతో కేసీఆర్ సాగర తీరం నుంచి ఏపీలో బీఆర్ఎస్ కి శంఖారావం ఊదాలనుకుంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూలో జోక్యం చేసుకోవడం అందులో భాగమే అని అంటున్నారు. కేసీఆర్ ఉత్తరాంధ్రా మీదుగా ఉభయ గోదావరి జిల్లాలు అలా కోస్తా రాయలసీమ అన్నది తన పొలిటికల్ రూట్ మ్యాప్ గా రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది.
ఏపీలో మొత్తం 175 ఎమ్మెల్యే పాతిక ఎంపీ సీట్లకు పోటీ చేయాలని బీఆర్ఎస్ డెసిషన్ తీసుకుందని ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తెలిపారు. అన్ని సీట్లకు పోటీ చేయడమే కాదు ఏపీలో ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తామని ఆయన అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక విభాగానికి బిడ్ వేయకపోవడం టెక్నికల్ మ్యాటర్ తోనే కుదరలేదని ఆయన వివరణ ఇచ్చారు. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరని సమర్ధించుకున్నారు. ఏపీ రాజకీయాలో బీఆర్ఎస్ వాటా ఉందని, కేసీఆర్ ఏపీ ప్రజల కోసం పోరాడతారని ఆయన అంటున్నారు. విశాఖ మీటింగ్ తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతాయని చెబుతున్నారు.