నాటకాలు వేయడం మానేసినా, వేషాలు మాత్రం వదల్లేదని ‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాశ్‌రాజ్ ఓ అద్భుత డైలాగ్ చెబుతారు. ఎందుకో గానీ, ఈ డైలాగ్ విన్నప్పుడు చంద్రబాబునాయుడే గుర్తుకొస్తారు. రాజకీయ రంగస్థలంలో చంద్రబాబునాయుడు అవిశ్రాంత నటుడు. రాజకీయ విశ్వ విఖ్యాత నటుడనే బిరుదు ఆయనకు మాత్రమే సొంతం.
రాజకీయాలంటేనే నటన. అయితే నటనే రాజకీయంగా మలుచుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే…అది ఒక్క చంద్రబాబే. చంద్రబాబు ఎంత గొప్ప నట చక్రవర్తి అంటే… ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, తద్వారా మానసిక వేదనకు గురి చేసి, చివరికి మరణానికి కూడా కారకుడయ్యారనే ఆరోపణలు ఎదుర్కొని, ఇప్పుడు అదే ఎన్టీఆర్‌కు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేంత చాణక్యుడు. ఇది సాధారణ నాయకులకు అయ్యే పనికాదు.
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభలో చంద్రబాబు ప్రసంగంపై నెటిజన్లు తమదైన సృజనాత్మక శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడారంటే…‘చంద్ర’
‘తెలుగు జాతి కోసం పుట్టిన వెలుగు ఎన్టీఆర్. తెలుగుజాతి గర్వించదగ్గ విశిష్ట నాయకుడు, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఆయన పేరు మీద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ వేసిన పాత్రల్ని వేయగలిగే వారు భవిష్యత్‌లోనూ పుట్టరు. ఎన్టీఆర్ నటించినట్లు ఎవ్వరూ నటించలేరు. ఆ పాత్రల్ని ధరించి మెప్పించాలంటే ఎన్టీఆర్ మరో జన్మ ఎత్తి నటించాల్సిందే. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పోరాడుతూనే వుంటాం’
ఎన్టీఆర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు ఆడుకుంటున్నారు.
‘No, Sir ! విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్కే సినిమా చూపించిన ఘనత మీ సొంతం సర్ ! మిమ్మల్ని మించిన నటుడు ఈ భూమ్మీద లేడు, ఇక మున్ముందు కూడా పుట్టరు సర్! మిమ్మల్ని మించిన 'నట మాయలోడు' ఎవరు సర్! ఎన్టీఆర్ చావుకు కారణమై, ఇప్పుడు ఆయనకే శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న చతురత మీకు మాత్రమే సొంతం. రాజకీయాల్లో ఇది మీకు మాత్రమే సొంతమైన నటన. అందుకే మీకు రాజకీయ నట చంద్రమార్తాండ పురస్కారం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ నెటిజన్లు చాకిరేవు పెడుతున్నారు.
‘రాజకీయ తెరపై వైవిధ్యభరితమైన పాత్రల్ని పోషించిన ఘనతను దక్కించుకున్న ఒకే ఒక్కడు చంద్రబాబునాయుడు’.., ‘సినిమాల్లో చివరికి హీరోనే గెలుస్తారని అందరికీ తెలుసు. కానీ రాజకీయ తెరపై విలన్ మాత్రమే గెలుస్తాడని ఎన్టీఆర్ అనుభవంలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్కడు చంద్రబాబు’
‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పాత్ర. ఒక ఎన్నికలో వామపక్షాలు, కేసీఆర్‌తో పొత్తు. మరోసారి బీజేపీతో. ఆ తర్వాత ఏ పార్టీకైతే వ్యతిరేకంగా టీడీపీ అవతరించిందో, అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు. వామపక్షాలు,కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సిద్ధాంత వైరుధ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. ఒక్కో దఫా వేర్వేరు పార్టీలతో పొత్తు పెట్టుకుని తనకెలాంటి సిద్ధాంతాలు, విధానాలు లేవని చాటి చెప్పిన గొప్ప రాజకీయ నటుడు చంద్రబాబు’
నిన్న తిట్టినోళ్లనే, ఆ తర్వాత రోజుల్లో రాజకీయ అవసరాల కోసం మాట మార్చడానికి ఏ మాత్రం సిగ్గుపడని నాయకుడెవరైనా ఉన్నారంటే, చంద్రబాబు మాత్రమే అని సోషల్ మీడియాలో దెప్పి పొడుస్తూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రాజకీయ నట చతురత గురించి చెప్పాలంటే మాటలు చాలవని, ఆయన నాలుగు దశాబ్దాల ప్రస్థానం అంతా వంచన, వెన్నుపోటు, అవసరానికి వాడుకుని వదిలేయడమే కనిపిస్తాయని, ఈ క్రమంలో ఎన్నో పాత్రలు ఆయన రాజకీయ స్వార్థానికి బలి అయ్యాయంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం విశేషం. ఇందుకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కారణం కావడం గమనార్హం.